మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా వల్ల  ఎవరికి  ఏ నష్టం వున్నా, ముఖ్యమంత్రి  కిరణ్ కుమర్ రెడ్డికి మాత్రం అన్ని విధాలా లాభమే.  ఆయన్ని తొలుత ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నప్పుడు, మంత్రులు ముఖాలు చాటేశారు. తమకన్నా జూనియర్ కింద పనిచేయాల్సి వచ్చినందుకు తమ అక్కసును మీడియా విడతలు విడతలు గా కక్కారు. కానీ నేడు అదే కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరకు  ఒక్కరు కాదు, ఇద్ధరు కాదు, ఏకంగా 22 మంది ‘శరణు, శరణు’ అంటూ దాదాపు  కిరణ్ కాళ్ళ మీద పడినంత పని చేశారు. కిరణ్ కూడా ధర్మాన రాజీనామాను వెంట బెట్టుకుని, గవర్నర్ దగ్గరకీ, పార్టీ అధిష్ఠానం దగ్గరకీ తిరిగీ, ఏదీ తేల్చకుండా ధర్మానతో పాటు ఇతర మంత్రులకు  కూడా టెన్షన్ తెచ్చి పెట్టారు. ఎందుకంటే ‘వాన్ పిక్’ తీగను లాగితే సచివుల డొంకలన్నీ కదులుతాయి.          అనివార్యంగా, రాజీనామా అంశం మీద నిర్ణయాధికారాన్ని అధిష్ఠానం కిరణ్ కే వదలి పెడుతుంది. అందుచేత అప్పటి ‘జీరో’గా వున్న కిరణ్ కాస్తా, ‘హీరో’ అవుతారు. అంతే కాదు, ముఖ్యమంత్రిని మార్పు కూడా  ఇప్పట్లో వుండక పోవచ్చు. అంటే, మంత్రులే  ఆయన పదవీ కాలాన్ని పరోక్షంగా పెంచారు.  ఇంకో చిత్రం. ఎప్పటినుంచో వాయిదా పడుతున్న మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ  ఇప్పుడు సాధ్య పడవచ్చు. ‘కళంకితుల‘ను పక్కన పెట్టే నెపం మీద, కొత్త ముఖాలకు చోటివ్వ వచ్చు. బీసీ కార్డు వాడుతున్న ‘కళంకితుల’ స్థానంలో,  ఇతర బీసీ శాసన సభ్యులకు అవకాశం ఇవ్వవచ్చు. బీసీల సంఖ్యను పెంచి, ‘దేశం డిక్లరేషన్’ తాకిడినీ, ’వైయస్సార్సీ బీసీ సీట్ల’ సవాలును ఎదుర్కోవచ్చు. మొత్తానికి ిఇవి పలుసమస్యలతో సతమతమవుతున్న రాష్ర్ట ప్రజలకు గడ్డు రోజులు కానీ, కిరణ్ మాత్రం కాదు.                                                                                  -కిరీటి  

మరింత సమాచారం తెలుసుకోండి: