కష్టాల్లో ఉన్నాను ఈ ఒక్కసారికి మద్దతు ఇచ్చి ఆదుకోండని చంద్రబాబునాయుడు  చేసిన విజ్ఞప్తిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు. పొత్తుల్లేదు ఏమీ లేదు పొమన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేనకు వామపక్షాలతో తప్ప ఇంకెవరితోను పొత్తు ఉండదంటూ పవన్ తాజాగా ట్విట్టర్ల్ ద్వారా ప్రకటించారు. కుప్పం జన్మభూమి కార్యక్రమంలో పొత్తులపై చంద్రబాబు చేసిన వేడుకోలును పవన్ ట్విట్టర్ ద్వారా తిప్పికొట్టారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలోను జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. వామపక్షాలతో తప్ప మరే పార్టీతోను పొత్తులుండదని తేల్చేశారు. మహిళలు, యువతకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కూడా చెప్పారు.

 

పవన్ తో పొత్తులపై చంద్రబాబు బహిరంగంగా విజ్ఞప్తి చేశారంటేనే తెలుగుదేశంపార్టీ పరిస్ధితేంటో అర్ధమైపోతోంది. ఒకవైపు జనాల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత. మరోవైపు పెరిగిపోతున్న అవినీతి. ఇంకోవైపు ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు జనాల బ్రహ్మరథం పట్టటం. అదే సమయంలో చంద్రబాబు అవినీతిపై తాజాగా మండిపడుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోడి. రాష్ట్రంలో చంద్రబాబుతో పొత్తులు పెట్టుకునేందుకు కాంగ్రెస్ తప్ప మరే పార్టీ కూడా సిద్ధంగా లేదు. కాంగ్రెస్ పరిస్ధితేమో కోమాలో ఉన్నట్లుంది. అటువంటి కాంగ్రెస్ తో ఊరేగితే చంద్రబాబుకు ఏమొస్తుంది ?

 

అందుకని ఎన్నికల్లో గట్టెక్కాలంటే పవన్ మాత్రమే దిక్కని అర్ధం చేసుకున్నారు. పవన్ తో పొత్తులు పెట్టుకుంటే కనీసం కాపుల ఓట్లన్నా వస్తాయన్నది చంద్రబాబు భావన. పవన్ తో పొత్తుల వల్ల టిడిపికి వచ్చే ఉపయోగం ఏమీ పెద్దగా ఉండదన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. అయితే, అదే పవన్ గనుక జగన్ తో పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశంపార్టీకి భారీ నష్టం తప్పదు. కాబట్టి పవన్ ను జగన్ వైపు వెళ్ళకుండా పొత్తుల పేరుతో చంద్రబాబు పెద్ద ఎత్తే వేశారని టిడిపి వర్గాలే చెబుతున్నాయి. అయితే, చంద్రబాబు వేడుకోలును పవన్ కొట్టిపారేయటంతో చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి ?


మరింత సమాచారం తెలుసుకోండి: