కేంద్ర ప్రభుత్వం మరో తలతిక్క నిర్ణయం తీసుకుంది. 2016, నవంబర్ లో చెలామణిలోకి వచ్చిన రూ 2 వేల నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిలిపేయాలని నిర్ణయించింది. అంటే ఇఫుడు చెలామణిలో ఉన్న పెద్ద నోట్లు మాత్రమే సర్క్యులేషన్లో ఉంటాయి. కొత్త నోట్లను మాత్రం ముద్రించరు. కొత్తగా ప్రింటయ్యే పెద్ద నోట్లలో రూ 500 లే పెద్ద నోటన్నమాట. భవిష్యత్తులో మళ్ళీ వెయ్యి రూపాయల నోటును తెచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేం.

 Related image

చెలామణిలోకి తెచ్చిన రెండేళ్ళకే రూ 2 వేల నోట్లు ఎందుకు తెరమరుగైపోతున్నాయి ? ఎందుకంటే, మనీ ల్యాండరింగ్, పన్ను ఎగవేసే వాళ్ళు బ్లాక్ మనీ క్రింద దాచుకోవటం, రియల్ ఎస్టేట్ లో లెక్కలు చూపకపోవటం లాంటి అనేక విధాలుగా వాడుతున్నారని రిజర్వు బ్యాంకు గుర్తించిందిట. అందుకనే పెద్ద నోట్ల ముద్రణను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. నిజంగగా కేంద్రం కావచ్చు, రిజర్వు బ్యాంకు కావచ్చు ఎంత తలతిక్క నిర్ణయం తీసుకుంటోందో చెప్పటానికి తాజా ఉదాహరణిది.

 Image result for rs 2000 note

అప్పట్లో వెయ్యి, రూ 500 నోట్లను హఠాత్తుగా రద్దు చేయటం ఎంత తప్పుడు నిర్ణయమో ఇఫుడు 2 వేల రూపాయల నోట్ల ముద్రణను నిలిపేయటం కూడా అంతే పిచ్చి నిర్ణయం. అప్పట్లో నోట్ల రద్దుకు ప్రధానమంత్రి నరేంద్రమోడి చెప్పిన కారణాలేంటి ? నకిలీ నోట్లు చెలామణి పెరిగిపోతోందని, బ్లాక్ మనీని నియంత్రించటానికి, తీవ్రవాదాన్ని అరికట్టటానికి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. సరే ఏవీ జరగలేదనుకోండి అది వేరే సంగతి. అప్పట్లో ప్రింట్ చేసిన 2 వేల రూపాయల నోట్లు దేశంలో అందరికీ చేరకముందే నకిలీ నోట్లు చక్కగా చెలామణిలోకి వచ్చేసింది.

Image result for rs 2000 note

ఇపుడేమో బ్లాక్ మనీని అరికట్టటానికట,మనీ ల్యాండరింగ్ పెరిగిపోతోందని మళ్ళీ 2 వేల నోట్ల ముద్రణను నిలిపేశారు. వెయ్యి నోట్లను రద్దు చేసి అంతకన్నా పెద్దదైన 2 వేల నోట్లు తెచ్చినపుడు బ్లాక్ మనీ మరింత పెరిగిపోతుందని, మనీ ల్యాండరింగ్ చేసే వాళ్ళకు ఇంకా సులువవుతందన్న కనీస జ్ఞానం కూడా కేంద్రంలో పెద్దలకు లేదా ? చరిత్రలో తుగ్లక్ పాలన అని చదువుకున్నాం గానీ ఇప్పటి తుగ్లక్ చర్యలతో పోలిస్తే అప్పటి తుగ్లక్ చర్యలు తక్కువే అని అర్ధమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: