ఏపీ రాజకీయాల్లో మ‌ళ్లీ పొత్తుల విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోరు చేస్తామ‌ని ఇటు వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. అటు ప‌వ‌న్‌కు స్ప‌ష్టంగానే చెబుతున్నారు. ఈ విష‌యంలో వారికి ఓ క్లారిటీ ఉంది. ప్ర‌స్తుతం పాద‌యా త్ర‌లో ఉన్న జ‌గ‌న్ తాను ఒంట‌రిగానే ఎన్నిక‌ల‌ను ఎదుర్కొంటాన‌ని ప‌దే ప‌దే చెబుతున్నారు. ఇక‌, ప‌వ‌న్ కూడా తాను ఒంట‌రిగానే పోరుకు సిద్ధ‌మ‌వుతాన‌ని, మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ త‌న స‌త్తా చాటుతాన‌ని ప్ర‌క‌టించారు. అయితే, దీనికి సంబంధించిన క్షేత్ర స్థాయి చ‌ర్య‌లు ఏమైనా తీసుకున్నారా?  కేడ‌ర్‌ను బ‌లోపేతం చేస్తున్నారా?  అనే విష‌యాల‌పై ప‌వ‌న్ నుంచి మౌన‌మే స‌మాధానంగా ఉంది. 


ఆయ‌న టార్గెట్‌లో కేవ‌లం ఏడు జిల్లాలు మాత్ర‌మే ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో ఆయ‌న ప్ర‌చారం కానీ, ఆయ‌న ప్ర‌క‌ట న‌లు కానీ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. మ‌రోప‌క్క‌, ఎన్నిక‌ల‌కు స‌మ‌యం మించిపోతోంది. రెండు నెల్ల‌లో ఎన్నిక‌ల కోడ్ కూడా అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఎంతో దూకుడుగా వ్య‌వ‌హ‌రించాల్సిన ప‌వ‌న్‌.. అదేమీ ప‌ట్ట‌నట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జ‌న‌వ‌రి రెండు నుంచి విజృంభిస్తామ‌ని చేసిన ప్ర‌క‌ట‌నలు కూడా ఎక్క‌డా అమ‌లు కావ‌డం లేదు. ముక్త‌స‌రి మీడియా మీటింగుల‌తో ప‌వ‌న్ స‌రిపెడుతున్నాడు. దీంతో అస‌లు ప‌వ‌న్ వ్యూహం ఏంట‌నే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చేలోగానే టీడీపీఅధినేత చంద్ర‌బాబు.. చేసిన ప్ర‌క‌ట‌న మ‌రో సంచ‌ల‌నంగా మారింది. 


ప‌వ‌న్‌తో పొత్తు విష‌యంలో త‌మ‌కు అభ్యంత‌రం లేద‌న్న‌ట్టుగా న‌ర్మ‌గ‌ర్భంగా చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఇక‌, దీనిని మంత్రి క‌ళా వెంక‌ట్రావు.. మ‌రో రూపంలో మార్చుకున్నారు. ప‌వ‌న్‌తో త‌మ‌కు అస్స‌లు ఎలాంటి విభేదాలు లేవ‌న్నారు. కానీ, నిన్న మొన్న‌టి వ‌ర‌కు మోడీకి ప్ర‌తిరూపంగా ప‌వ‌న్ ఇక్క‌డ తిరుగుతున్నాడ‌ని, హోదాపై ఆయ‌న ఏం చేశాడ‌ని?  ప్ర‌శ్నించింది తెలుగు దేశం అధినేతే! మ‌రి ఈ విష‌యాన్ని టీడీపీ నాయ‌కులు మ‌రిచిపోయినా.. ప్ర‌జ‌లు మ‌రిచిపోలేదు. ఇక‌, చంద్ర‌బాబు వృద్ధుడు అయిపోయాడు. కుటుంబంతో గ‌డ‌ప‌లేక పోతున్నాన‌ని బాధ‌ప‌డుతున్నాడు. సో.. ఆయ‌న‌ను  ఈ వ‌య‌సులో మ‌నం బాధ‌పెట్ట‌డం ఎందుకు రిటైర్మెంట్ ప్ర‌క‌టించి మ‌న‌వ‌డితో ఆడుకునేందుకు స‌మ‌యం ఇద్దామ‌ని వ్యంగ్య వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్‌ను కూడా ఎవ‌రూ మ‌రిచిపోవ‌డం లేదు. 


ఈ నేప‌థ్యంలో ఈ రెండు పార్టీల‌కు ఇక ప‌డ‌ద‌ని ఖ‌చ్చితంగా ప‌వ‌న్ టీడీపీకి దూరంగానే ఉంటార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, అనూహ్యంగా బాబు న‌ర్మ‌గ‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌ల‌కు ప‌దును పెరిగి.. ప‌వ‌న్ వ‌స్తే క‌లుపుకొని వెళ్తామ‌ని ప్ర‌క‌టించేశారు మంత్రి క‌ళా! అయితే, ఇది బాబు నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాకుండానే ఆయ‌న ప్ర‌క‌టించారా? అనే ప్ర‌శ్న‌ను కూడా తెర‌మీదికి తెచ్చింది. ఏపీ టీడీపీ అధ్య‌క్షుడి హోదాలోనే క‌ళా వ్యాఖ్యానించినా.. చంద్ర‌బాబుకు చెప్ప‌కుండా ప్ర‌క‌టించే ధైర్యంలేదు. అంటే.. మొత్తంగా జ‌న‌సేన‌తో క‌లిసి ముందుకు వెళ్లేందుకు చంద్ర‌బాబు మాన‌సికంగా రెడీ అవుతున్నారు. 


మ‌రి ఈ విష‌యంలో ప‌వ‌న్ అభిప్రాయం ఏంటి? ఆయ‌న కూడా ఎన్ని మాట‌ల‌న్నా కూడా తుడిచేసుకుని తాజా రాజ‌కీయాల‌కు అల‌వాటు ప‌డిపోయారా? అంటున్నారు ప్ర‌జ‌లు. మార్పు తేవ‌డం అంటే ఇదేనా? అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్పుడు మౌనంగా ఉంటే ప‌వ‌న్‌కే డేంజ‌ర్ అని, అటు తిరిగి.. ఇటు తిరిగి ప‌వ‌న్ ఇప్పుడు దోషిగా మార‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: