ఏపి హై కోర్టు చంద్రబాబునాయుడుకు షాక్ ఇచ్చింది. విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ఐఏకి బదిలీ చేయాలని హై కోర్టు ఆదేశించింది. మొన్నటి వరకూ జగన్ పై దాడి కేసును రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సిట్ విచారిస్తోంది. అయితే, జగన్ వేసిన పిటీషన్ పై విచారణ మొదలుపెట్టిన హై కోర్టు సిట్ విచారణను నిలిపేయాలని గతంలోనే ఆదేశించింది. అయితే, కేంద్రప్రభుత్వ పరిధిలోని ఎన్ఐఏతో విచారించాలని మాత్ర అప్పట్లో చెప్పలేదు. కేంద్రానికి నోటీసులిచ్చిన తర్వాతే కోర్టు ఈరోజు తన తీర్పు చెప్పింది. విశాఖపట్నం విమానాశ్రయమన్నది కేంద్రప్రభుత్వ పరిధిలోని ప్రాంతమని కోర్టు స్పష్టం చేసింది. ఎన్ఐఏ చట్టం ప్రకారం విమానాశ్రయాలన్నీ ఎన్ఐఏ పరిధిలోకే వస్తాయి. కాబట్టి తన పరిధిలో జరిగిన ఘటనపై ఎన్ఐఏ మాత్రమే విచారణ చేస్తుందని హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. కాబట్టి ఇకనుండి జగన్ పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏ మాత్రమే విచారిస్తుంది.

 

నిజానికి కేసును ఎన్ఐఏ మాత్రమే విచారించాలని చంద్రబాబుకు తెలీందేమీ కాదు. కాకపోతే ఘటనలో చంద్రబాబు లేకపోతే టిడిపి నేతల పాత్ర ఉందని జగన్ అండ్ కో ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో కేంద్రపరిధిలోని ఎన్ఐఏ విచారణ చేస్తే వాస్తవాలు బయటపడే ప్రమాదముందన్న విషయం చంద్రబాబుకు తెలుసు. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో తనకు బాగా ఇబ్బందులు తప్పవని చంద్రబాబులో ఆందోళన మొదలైంది. అదే రాష్ట్రప్రభుత్వ పరిధిలోని సిట్ తో విచారణ చేయిస్తే నివేదిక కూడా తాను అనుకున్నట్లే తెప్పించుకోవచ్చన్నది చంద్రబాబు ఆలోచన.

 

అందుకనే కేసును సిట్ తో నే విచారణ జరిపిస్తామని చంద్రబాబు గట్టిగా పట్టుబట్టారు. ఘటన జరిగిన దగ్గర నుండి కూడా కేసును నీరుగార్చేందుకు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. ప్రభుత్వం, టిడిపి చేసిన ప్రయత్నాలు చూసిన తర్వాత అందరిలోను అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ పరిస్ధితుల్లోనే కుట్ర కోణం బయటకు రావాలంటే థర్డ్ పార్టీతోనే విచారణ జరిపించాలని జగన్ కోర్టులో పిటీషన్ వేశారు. దాని ఫలితమే ఎన్ఐఏ విచారణకు కోర్టు ఆదేశాలివ్వటం.  కాబట్టి జగన్ పై జరిగిన హత్యాయత్నం ఘటనలో సూత్రదారులెవరో బయటపడే అవకాశం ఉంది. నిజంగా అదే జరిగితే ఎన్నికల్లో చంద్రబాబుకు ఇబ్బందులు తప్పేట్లు లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: