శబరిమలలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఆలయంలోకి ప్రవేశించేందుకు మహిళలు వస్తూనే ఉన్నారు. దీంతో అయ్యప్ప భక్తులు ప్రతిఘటిస్తున్నారు. తాజాగా శ్రీలంకకు చెందిన ఓ మహిళ ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె ప్రయత్నాలు ఫలించలేదు.

Image result for sabarimala row

శబరిమలలో రెండ్రోజుల క్రితం ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో కేరళ రావణకాష్టంలా రగులిపోతోంది. మహిళలు వెళ్లారని తెలిసిన మరుక్షణమే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలయ్యాయి. 3వ తేదీన కేరళ బంద్ జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి చనిపోయారు. వందలాది వాహనాలు దహనమయ్యాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే మీడియా ముందుకొచ్చి సంయమనం పాటించాలని కోరారు. కొన్ని హిందూ సంస్థలు రాజకీయంగా ఈ అంశాన్ని వాడుకుంటున్నాయని విమర్శించారు.

Image result for sabarimala row

శబరిమలలో మహిళలకు ప్రవేశం సబబేనంటూ గతేడాది సెప్టెంబర్ 28వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అప్పటి నుంచి ఆలయంలోకి వెళ్లేందుకు పలువురు మహిళలు ప్రయత్నిస్తూ వచ్చారు. అయితే ప్రతిసారీ వాళ్లకు పరాభవమే ఎదురైంది. మహిళలను ఆలయంలోకి వెళ్లనివ్వకుండా అయ్యప్ప భక్తులు అడుగడుగునా ప్రతిఘటించారు. కొంతమంది మహిళలు పోలీసుల బందోబస్తుతో ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. అయితే జనవరి 2వ తేదీ తెల్లవారుజామున ఇద్దరు మహిళలు ఆలయంలోకి వెళ్లగలిగారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Image result for sabarimala row

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం వెనుక వామపక్ష ప్రభుత్వ హస్తముందనేది హిందూసంస్థల ఆరోపణ. ప్రభుత్వం, పోలీసులు సహకరించడం వల్లే మహిళలు లోపలికి వెళ్లగలిగారని బీజేపీ సహా పలు హిందూ పార్టీలు, సంస్థలు ఆరోపిస్తున్నాయి. అయితే తమకు అలాంటి అవసరం లేదంటోంది కేరళ సర్కార్. అయితే సుప్రీంకోర్టు తీర్పును పాటించాల్సిన బాధ్యత తమపై ఉంటుంది కాబట్టి ఎవరైనా వెళ్లేందుకు ముందుకొస్తే రక్షణ కల్పిస్తున్నామని చెప్తోంది. దీంతో ఈ అంశం రాజకీయరంగు పులుముకుంది.

Image result for sabarimala row

ఆలయంలోకి ఇద్దరు మహిళలు వెళ్లినప్పటి నుంచి కేరళ భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో గురువారం మరో మహిళ ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. శ్రీలంక నుంచి వచ్చిన ఓ మహిళ ఆలయం ప్రాంగణంలోకి వెళ్లారు. 18 మెట్లవరకూ వెళ్లానని, ఆ తర్వాత లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆ మహిళ చెప్పారు. తనకు 46 ఏళ్ల వయసుందని, రుతుస్రావం ఆగిపోయినట్లు ధృవీకరణ చూపించినా వారు పట్టించుకోలేదని వివరించారు. 50 ఏళ్లలోపు మహిళలను ఆలయంలోకి పంపకపోవడం శబరిమలలో ఆచారంగా వస్తోంది. దీంతో శ్రీలంక మహిళను కూడా లోపలికి పంపకుండా అడ్డుకున్నారు. అయితే మహిళల ప్రవేశంపై కేరళలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: