మనది ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకోబడిన పాలన. కానీ ఇది నేతి బీరకాయ చందం తీరు. అసలైన ప్రభువులు ప్రజలు అని చెబుతారు, కానీ మొత్తం అధికారాలు మాత్రం ఏలికలు తమ గుప్పిట్లో పెట్టుకుని ఓటేసిన పాపానికి జనాన్ని బానిసలుగా చేస్తున్నారు. చూస్తున్నారు. ఈ విపరీత ధోరణి ఆఖరుకు ఎంత వరకూ వెళ్ళిందంటే మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం సహనం కోల్పోయి ఓటేసిన వారినే నిందిస్తున్నారు. తామే గొప్ప అనుకుంటున్నారు. అంతు చూస్తాం, , మీ పని ఫినిష్ అంటూ బాధ్యత గలిగిన వారు మాట్లాడుతూంటే మనం నియంతల పాలనలో ఉన్నామా అనిపిస్తోంది.


ముఖ్యమంత్రి నోటి వెంట :


కాకినాడలో జన్మభూమి కార్యక్రమానికి వచ్చిన చంద్రబాబు తన బస్సుని అడ్డగించారన్న కోపంతో అక్కడ బీజేపీ కార్యకర్తలను  ఉద్దేశించి అనరాని మాటలు అన్నారు. మహిళా నేత అని కూడా చూడకుండ ఫినిష్ అయిపోతావు అని తర్జని తో బాబు బెదిరించడం చూసాక ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందా అని అనిపించకమానదు. చంద్రబాబు ఇంతలా మాటలను వాడడానికి కారణం ఆ బీజేపీకి చెందిన మహిళ బాబు పాలనలో అవినీతి గురించి ప్రశ్నించడమే. అంతే కట్టలు తెంచుకున్న కోపంతో బాబు రెచ్చిపోయారు. మహిళ అని కూడా చూడకుండా ఆగ్రహం ప్రదర్శించారు.


 అలా తనలోని అసలు మనిషిని బయటకు తెచ్చేశారు. ఇలా ఒక ముఖ్యమంత్రే వ్యవహ‌రిస్తే ఆయన యావత్తు రాష్ట్రానికి ఏమి సందేశం ఇస్తున్నట్లు. ఆయన అంతటి వారే ఫినిష్ చేస్తామని అన్నాక శాంతి భద్రతలు సంగతి ఎవరు పట్టించుకుంటారు. బాబు పాలనలో అవినీతిని ప్రశ్నించకూడదా.. ఒకవేళ ఎవరైన అలా  ప్రశ్నిస్తే ఇలాగే బెదిరిస్తారా.. ఇపుడు ఏపీలో ఇదే చర్చ సాగుతోంది. బాబు ఎందుకిలా సహనాన్ని కోల్పోతున్నారన్నదానిపైనా కూడా చర్చ సాగుతోంది.


మంత్రి గారూ ఇంతే :


ఇక ఇక్కడ ముఖ్యమంత్రి ఇలా వీరంగం వేశారు, సరే, ఆయన గారి కొలువులో సీనియర్ మంత్రి విశాఖ జిల్లాకు చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడిది కూడా ఇదే తీరుగా ఉండడం విశేషం.  జన్మభూమి సభలో వితంతు పించను అడిగిన పాపానికి మహిళ అని చూడకుండా అయ్యన్న నానా మాటలు అన్నారు. దుక్కలా ఉండి పించన్లు అడిగితే ఎలా ఇస్తామంటూ మంత్రి దుర్భాషలాడారు. భర్త చనిపోయిన వారికి పెన్షన్లు ఇవ్వడానికి అభ్యతరం లేదు. కానీ దుక్కలా ఉండి పెన్షన్ కావాలంటే ఎలా.? ఊళ్లో భర్తలేడని కొంతమంది పెన్షన్లు అడుగుతున్నారు. 


ఉన్నాడా పోయాడా చెప్పరు. పదేళ్లుగా జాడాలేదంటున్నారు. అలాంటి వారికి పెన్షన్ ఎందుకిస్తాం.. ఎక్కడి నుంచి ఇస్తాం. మీ భర్తలను రాచిరంపాన పెట్టి తరిమేస్తే మేము పింఛన్ ఇయ్యాలా’ అని మహిళలను కించపరిచేలా మాట్లాడారు.మంత్రి అయ్యన్న మహిళలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సమావేశానికి వచ్చిన మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగల పదవిలో ఉండి ఇంత నీచంగా మాట్లాడతారా అని మండిపడ్డారు.


అసలేమనుకుంటున్నారు :


ప్రజలు నచ్చి మెచ్చి ఓట్లు వేస్తే మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతున్నారు కానీ వారు కూడా ఈ దేశంలో పౌరులేనని ఎందుకు మరచిపోతున్నారు. అధికారం చేతిలో పడ్డాక ఓటేసిన జనంపైనే కారు పోనీయడమేనా ప్రజాసేవ అంటే. తాము అన్నిటినీ అతీతులమని, దైవాంశ సంభూతులమని ఏలిన వారు అనుకుంటున్నారా అనిపిస్తోంది. ఈ దేశంలో అంతా ఒక్కటే, అందరూ కలసి తమ పనులు చేసిపెట్టడానికి ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి నాయకున్ని ఎన్నుకుంటారు.
అంత మాత్రం చేత జనం తీసిపోయినట్లా. నిజానికి జనం కట్టే పన్నులతో సోకులు చెస్తున్న వారు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు. వారి విలాసమంతా జనం సొమ్మేనని గుర్తు పెట్టుకుంటే ఇన్ని మాటలు అనరు. కానీ తామే గొప్ప వారమని, తమను ఎవరూ ప్రశ్నిచకూడదన్న అహంకారమే నయా ప్రజాస్వామ్యవాదులను తయారుచేస్తోందనిపిస్తోంది. ఇకనైనా ప్రజాస్వామ్యయుతంగా పెద్దలు, పాలకులు వ్యవహిస్తే భావి తరాలకు స్పూర్తిని ఇచ్చినట్లుగా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: