సుదీర్ఘమైన పాదయాత్రను వైసీపీ అధినేత జగన్ చేసారు. దాదాపు పద్నాలుగు నెలల పాటు అలుపెరగని పయనమది. పదమూడు జిల్లాలను చుట్టేసిన జగన్ కోట్లాదిమంది జనంలో మమేకం అయ్యారు. సుమారుగా 3700 కిలోమీటర్ల మేర నడిచారు. ప్రతి అడుగులోనూ తనతో పాటు పార్టీకి, , జనాలకు కూడా ఆత్మవిశ్వాసం నింపారు. మొత్తం రాజకీయాల్లోనే మార్పు తెచ్చారు. అటువంటి జగన్ పాదయాత్ర ముగుస్తున్న వేళ తన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో  పంచుకున్నారు.


ఒంటరిగానే :


గత ఎన్నికల్లో ఎలా ఒంటరిగా పోటీ చేశానో అదే విధంగా పొత్తులు లేకుండా బరిలోకి దిగుతామని జగన్ క్లారిటీగా చెప్పేశారు. తనకు దేముడి మీద, ప్రజల మీద బాగా నమ్మకం ఉందని, వారి దీవెనలతోనే రాజకీయాలు చేస్తున్ననని చెప్పుకొచ్చారు. అందువల్ల తాను జనంపైన  ఉన్న నమ్మకంతోనే ముందుకు పోతానని జగన్ అన్నారు. తనకు ఎటువంటి పొత్తులు అవసరం లేదని, ఆ రకమైన ప్రచారం కూడా తప్పు అని జగన్ స్పష్టం చేశారు. తనకు జనమే ముఖ్యమని, ఏపీ ప్రయోజనాలే ప్రధానమని చెప్పిన జగన్ తాను ఏ పార్టీతోనూ కలసిలేనని, కలవబోనని కూడా కచ్చితంగా చెప్పేశారు. 


అది బురద జల్లుడు ప్రోగ్రాం :


గత ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ తో తాను కలసిపోయానని ప్రచారం చేశారని, తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని ఊదరగొట్టారని, ఈ నాలుగున్నరేళ్ళు తాను కాంగ్రెస్ ని కలవలేదు కానీ బాబు మాత్రం కలిసిపోయారని జగన్ విమర్శించారు. ఇక మోడీతో తనకు లింక్ పెట్టడం కూడా అలాంటి అసత్య ప్రచారమేనని అన్నారు. నిజానికి బీజేపీతో పొత్తు పెట్టుకుని నాలుగున్నరేళ్ళ పాటు కాపురం చేసింది చంద్రబాబు కాదా అని ఆయన నిలదీశారు. రాజకీయాల్లో విశ్వసనీయత కోసం తాను తపన పడుతున్నానని, తనపైన జల్లుతున్న బురదను జనం గమనిస్తున్నారని జగన్ అన్నారు.


ఆ ముగ్గురూ కారకులే :


ఏపీ ఈనాడు ఇలా ఉండడానికి నరేంద్రమోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కారణమని జగన్ ఆరోపించారు. ఈ ముగ్గురూ కలసి రాష్ట్రాన్ని పూర్తిగా ఇబ్బందుల పాలు చేశారని అన్నారు. ఆనాడు హామీలను ఇచ్చి మరీ జనం నుంచి ఓట్లు కొల్లగొట్టిన ఈ ముగ్గురూ ఇపుడు విడిపోయారని అనుకుంటే పొరపాటేనని జగన్ అన్నారు. ఇప్పటికీ బీజేపీతో తెర వెనక బంధాలను కొనసాగించగల సమర్ధుడు బాబు అన్నారు. అలాగే పవన్, బాబు కలిసి పోటీ చేయాలనే తాను కోరుకుంటున్నానని , ముసుగు తొలగించాలన్నదే  తన డిమాండ్ అని జగన్ చెప్పారు.


హోదా ఎవరు ఇస్తే వారికే:


ప్రత్యేక హోదా ఎవరు సాకారం చేస్తే వారికే తమ పార్టీ మద్దతు ఇస్తుందని జగన్ అన్నారు. కాంగ్రెస్ అడ్డగోలుగా ఏపీని విడదీసిందని, ప్రత్యేక హోదాపై చట్టాన్ని చేయకుండా మోసం చేసిందని, ఇక అన్ని అవకాశాలు ఉండి కూడా బీజేపీ హోదా ఇవ్వలేదని అందువల్ల ఏ పార్టీని నమ్మాలని జగన్ ప్రశ్నించారు. ఏపీ ప్రజల ప్రతినిధిగా తాను మళ్ళీ ఈ జనం మోసపోవడానికి సిధ్ధంగా లేరని చెప్పదలచుకున్నానని జగన్ అన్నారు. పాతిక మంది ఎంపీలను గెలిపించుకుని హోదాని సాధిస్తామని జగన్ స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తాను చెప్పిన అన్ని హామీలను తప్పకుండా నెరవేరుస్తానని జగన్ హామీ ఇచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: