వైఎస్ జగన్ అంటే గుర్తుకువచ్చేవి ఆయన పట్టుదల, నమ్మకం, దేనికైనా వెరవని నైజం. తండ్రి వైఎస్సార్ రాజకీయ వారసునిగా వచ్చినా అయన కంటే భిన్నమైన మార్గంలో రాజకీయం చేయడమే జగన్ ప్రత్యేకత. జగన్ తండ్రిలాగానే కనిపిస్తూనే తనకంటూ ఓ రాజకీయ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తండ్రి ఒరవడికి దగ్గరగా ఉంటాడని అనుకున్నా జగన్ బాట మత్రం వేరుగానే ఉంటోంది. ఆయన వెనక ఎంతటి జన సమూహం ఉన్నప్పటికీ జగన్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నాడు. గత పదేళ్ళుగా అయన ఇదే రకంగా ముందుకు సాగుతున్నారు.


వైఎస్సార్ తో పోల్చితే :


జగన్ని ఆయన తండ్రి వైఎస్సార్ తో పోల్చితే కొన్ని విషయాల్లో  ,మాత్రమే సారూప్యం కనిపిస్తుంది. తండ్రి లాగా దేనికైన వెరవని తత్వం, ఏ విషయంపైనైనా కుండబద్దలు కొట్టినట్లుగా వ్యవహ‌రించడం వంటివి జగన్, వైఎస్సార్ ల విషయంలో ఒకే రకమైన లక్షణాలు. అయితే అదే జగన్ మిగిలిన విషయాల్లో మాత్రం తండ్రి కంటే భిన్నమైన వారుగా చూడాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మూడు దశాబ్దాల పాటు పోరాడితే కానీ తాను అనుకున్న సీఎం పీఠం లక్ష్యం చేరుకోలేకపోయారు. ఆ సమయంలో వైఎస్సార్ ఎన్నో అవమానాలు పడ్డారు భరించారు, సహించారు, అయినా ఆయన కాంగ్రెస్ ని వీడలేదు, ఓ దశలో వైఎస్సార్ రాజీవ్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేస్తారని కూడా గట్టిగా వినిపించింది.


 కానీ ఎందుకో వైఎస్సార్ ఆ దిశగా సాహసం చేయలేకపోయారనుకోవాలి. ఇక వైఎస్సార్ కు కోట్లాది జనాభిమానం పాదయాత్రలో లభిస్తే అంతకు ముందు వరకూ బలమైన  మిత్ర బ్రుందం అండగా ఉండేది. నిత్య అసమ్మతివాదిగా వైఎస్సార్ కి పేరు ఉన్నా అయనకంటూ కాంగ్రెస్ లో జాతీయ స్థాయిలోనూ మంచి స్నేహితులు ఉండేవారు. అలగే రాష్ట్ర కాంగ్రెస్ లో వైఎస్సార్ వర్గం బలంగా ఉండేది. వారి సలహా సూచనలతో వైఎస్సార్ ప్రతి పని చేసేవారంటారు. ఈ విషయంలో జగన్ వైఖరి భిన్నమే.


ఆంతరంగికులు లేరు:


జగన్ విషయానికి వస్తే ఆయనకు ఆంతరంగికులు లేరని అంటారు. ఆయన అభిప్రాయాలను పంచుకునే కోటరీ లాంటిది వైసీపీలో లేదని చెబుతారు. జగన్ కి నాయకులు ఎంత సన్నిహితులైనా  ఓ గ్యాప్ మాత్రం అలాగే ఉండిపోయిందంటారు. ఇక జగన్ రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు కొన్ని సక్సెస్ అయ్యాయి. కొన్ని ఫెయిల్ అయ్యాయి దీనికి కారణం జగన్ సొంతంగా తనకంటూ సలహాదారులను కాని, నమ్మిన మిత్రులను కానీ ఏర్పాటు చేసుకోకపోవడమే అంటారు. జగన్ అనుకుంటే  ఏదైనా చేసి తీరుతారన్న పేరు ఉంది. వైఎస్సార్ విషయంలో ఒకటికి రెండు మార్లు ఆలొచన చేసి కానీ నిర్ణయం తీసుకునే వారు కాదు అని ఆయన్ని ఎరిగిన వారు చెబుతారు.


కరెంట్ పాలిటిక్స్ కి భిన్నం :


ఇక జగన్ లో మరో విషయం చూస్తే వర్తమాన రాజకీయాలకు ఆయన భిన్నంగా ఉంటారు. ఎత్తులు, పొత్తులతో నడిచే ఈ రోజుల రాజకీయాల్లో జగన్ ఎపుడూ ఒంటరి పోరుకే తెగిస్తారు. జగన్ విషయంలో అది ఒక్కోసారి కడు సాహసమే అనిపిస్తుంది. ఎందుచేతనంటే  రాజకీయాలు ఇపుడూ ఒకేలా ఉండవు, వాటికి తగ్గట్లుగా అనుసరించి ఎప్పటికపుడు వ్యూహాలను రూపిందించుకోవాల్సిఉంటుంది. ఓ ప్రధాన ప్రతిపక్షంగా ఏపీలో జగన్ పార్టీ కీ రోల్ ప్లే చేసి టీడీపీకి వ్యతిరేకంగా పార్టీలను కూడగట్టడం వంటివి చేయడం ద్వారా సరి కొత్త ఎత్తులు వేయాల్సి ఉన్నా జగన్ మాత్రం ఎవరితోనూ కలవను అనడం సాహసమేనేమో.


మీడియా సైతం :


ఇక జగన్ విషయంలో మీడియా సైతం  దూరంగానే ఉంటోంది. ఇది గత పదేళ్ళుగా సాగుతున్న వ్యవహారమే. జగన్ కి సొంత మీడియా ఉండడం కూడా ఇక్కడ పోటీ తత్వాన్ని పెంచిందనుకోవాలి. అదే సమయంలో జగన్ ఏ కార్యక్రమం చేసిన కవరేజ్ ఇవ్వని మీడియా సైతం ఏపీలో రాజకీయ క్రీడలో భాగమైపోవడం దారుణమే. ఇక జగన్ కూడా ఈ విషయంలో తన‌ వంతుగా తీసుకోవాల్సిన చొరవ తీసుకోలేదేమో అన్న భావన కూడా ఉంది. మొత్తానికి మీడియా కవరేజ్ విషయంలో చూస్తే జగన్ ఒంటరే అయ్యారని చెప్పాలి. దేశంలో ఎవరూ చేయని విధంగా 14 నెలల పాటు సుదీర్ఘ పాదయాత్ర చేసినా జగన్ కు తెలుగు మీడియా ఇచ్చిన కవరేజ్ చాలా స్వల్పం. ఇది చాలు ఏపీ మీడియా జగన్  విషయంలో ఎంతలా కత్తి కట్టిందో చెప్పడానికి.


రాజకీయ పార్టీలూ :


ఇక ఏపీలో రాజకీయ పార్టీలు సైతం జగన్ విషయంలో అంటరానితనాన్నే పాటిస్తున్నాయి. ఇది మొదటి నుంచి సాగుతూనే ఉంది. జగన్ మీద అవినీతి కేసులు వున్నాయన్న కారణంతో ఆది నుంచి వామపక్షాలు జగన్ కి దూరంగా ఉంటున్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు రావడంతో ఆ పార్టీ సహజంగానే శత్రువు. బీజేపీతో పొత్తులు లేవు, ఎత్తులు లేవు, దాంతో ఆ పార్టీ  ఏ రోజూ జగన్ ని చేరదీసింది లేదు. టీడీపీ తో ఎటూ పోరాటమే ఉంది. కొత్తగా వచ్చిన పవన్ పార్టీ సైతం జగన్ తో కలసి పోరాటాలు చేయడానికి ముందుకు రాకపోవడం బట్టి చూస్తే జగన్ రాజకీయంగా ఒంటరి అని అర్ధమవుతోంది.


జనమే బలమా :


ఈ నేపధ్యం నుంచి చూసినపుడు జగన్ కి కొండంత అండ జనమే అవుతున్నారు. జగన్ కూడా వారినే నమ్ముకునారు. . అయితే ఇక్కడో చిక్కు ఉంది. రాజకీయాల్లో నైతిక విలువలు పడిపోతున్నాయి అని జగన్ అంటున్నారు, కానీ సమాజంలో కూడా నైతిక విలువలు ఎంత వరకూ ఉన్నాయో గమనించాలి. ఓటుకు నోటు కల్చర్ బాగా పెరిగిన రోజుల్లో నిష్టతో చేసే వావిలాల గోపాలక్రిష్ణయ్య కాలం నాటి రాజకీయాలు ఇపుడు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో జగనే ఆలొచించుకోవాలేమో. నంద్యాల  ఉప ఎన్నికల్లో ధన ప్రవాహం ఓ స్థాయిలో సాగి చివరకి ఫలితాన్ని మార్చేసింది.


 రేపటి సార్వత్రిక ఎన్నికలకు అదొక లిట్మస్ టెస్ట్. జనం నుంచి మార్పు రాకపోతే ఎంతటి వారైన నీతి, నిజాయతీతో కూడిన రాజకీయాలు చేయలేరేమో. ఏది ఏమైనా జగన్ పోరాటం గట్టిది, గొప్పది, వర్తమాన కాలంలో ఆయన లాంటి వారు ఉండడం అరుదే. పూటకొక పార్టీ తో పొత్తులు పేర్లు  చెబుతూ మొత్తం రాజకీయాలను కంపు కొట్టిస్తున్న మహా నాయకులు ఉన్న ఈ రోజుల్లో జగన్ కచ్చితంగా సాహసం చేస్తున్నారు. మాటలతో కాకుండా చేతలతోనే ఆయన భ్రష్టుపట్టిన రాజకీయాలను కడిగేయాలనుకుంటున్నారు. దానికి ఆయన నమ్ముకుంటున్న జనం, దేవుడి దీవెనలు ఎంతవరకూ ఉన్నాయన్నది మరి కొద్ది నెల్లలో తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: