తెలంగాణా మాజీ మంత్రి, ఎంఎల్ఏ తలసాని శ్రీనివాసయాదవ్ ఏపి రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపి రాజకీయాల్లో తెలంగాణా ముఖ్యమంత్రి కెసియార్ కీలకపాత్ర పోషిస్తారని చెప్పారు. అయితే, కెసియార్ పోషించబోయే పాత్ర ఏమిటో మాత్రం చెప్పలేదు. నాలుగు నెలల తర్వాత దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుందని తలసాని అన్నారు. ముఖచిత్రం ఏ విధంగా ఉండబోతోందో అన్న విషయాన్ని చెప్పకుండా సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్నారు. తెలుగురాష్ట్రాల రాజకీయాలను కెసియార్ శాసించబోతున్నట్లు మాత్రం చెప్పారు.

 

చంద్రబాబునాయుడు గురించి మాట్లాడుతూ, కేవలం ప్రచారంతో మాత్రమే కాలం గడిపేస్తున్నట్లు మండిపడ్డారు. ఏపిలో నాలుగున్నరేళ్ళల్లో చెప్పుకోతగ్గ అభివృద్ధి జరగలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అంటే అభివృద్ధి విషయంలో కెసియార్ ప్రకటనలకు భిన్నంగా మంత్రులు, ఎంఎల్ఏలు ప్రకటన చేసే ధైర్యం చేయలేరు లేండి. అధికారంలో ఉండి కూడా ప్రతిపక్ష పార్టీలాగ ఆందోళనలు, దీక్షలు చేయటమేమిటంటూ చంద్రబాబును ఎద్దేవా చేశారు. ఎన్టీయార్ సిద్ధాంతాలను సైతం చంద్రబాబు పక్కనపెట్టేసి కాంగ్రెస్ వెంటపడుతున్నందుకు సిగ్గుపడాలన్నారు.

 

ప్రస్తుతం ఏపి రాజకీయాలను చూసిన తర్వాతే ఆంధ్రాలో కూడా కీలకపాత్ర పోషించాలని కెసియార్ నిర్ణయించుకున్నట్లు చెప్పటం గమనార్హం. తెలుగు ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నదే కెసియార్ లక్ష్యమట. ప్రజలందరూ సంతోషంగా ఉండాలనే కెసియార్ ఏపి రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని నిర్ణయించుకున్నట్లు తలసాని చెప్పటమే విచిత్రంగా ఉంది. టిఆర్ఎస్ కు ఏపిలో ఏమీ బలం లేదు. పోటీ చేసినా ఒక్క సీటులో గెలిచే అవకాశం కూడా లేదన్న విషయం అందరికీ తెలిసిందే. మరి అటువంటి పరిస్ధితుల్లో ఏపి రాజకీయాల్లో కెసియార్ ప్రత్యక్ష పాత్ర పోషించే అవకాశాలైతే కనబడటం లేదు. ఫెడరల్ ఫ్రంట్ లోకి జగన్, పవన్ ను చేర్చుకోవటం ద్వారా ఏపి రాజకీయాలను కూడా కెసియార్ శాసించాలని అనుకుంటున్నారేమో అన్న అనుమానం వస్తోంది. చూద్దాం మరి ఏం జరగబోతోందా ?


మరింత సమాచారం తెలుసుకోండి: