ఎంతోమంది క‌న్నీళ్లు తుడుస్తూ.. క‌ష్టాలు వింటూ.. భ‌రోసా ఇస్తూ.. ప్ర‌తిప‌క్ష నేత, వైసీపీ అధినేత జ‌గ‌న్ చేప‌ట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర.. చివ‌రి దశ‌కు చేరుకుంది. మూడు వేల కిలోమీట‌ర్లు పైగా జ‌రుగుతున్న ఈ యాత్రను ఘ‌నంగా ముగించేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించేందుకు నేత‌లు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. అయితే ఈ ముగింపు స‌భ‌లో జ‌గ‌న్ ఏం మాట్లాడ‌తారు? ఏం చెబుతారు? అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తారా? అనే సందేహాలు అంద‌రిలోనూ మెదులుతున్నాయి. ఒక‌ప‌క్క అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టం.. అధికార టీడీపీ అభ్య‌ర్థులను ముంద‌స్తుగానే ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించ‌డంతో వైసీపీ అభ్య‌ర్థుల్లో ఆశ‌లు పెరిగిపోతున్నాయి. ఇప్పటి కే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌.. త‌న‌ రాజ‌కీయ భ‌విష్య‌త్‌కు అత్యంత కీల‌క‌మైన ఈ ఎన్నిక‌ల్లో ఎలాంటి వ్యూహాలు అనుస‌రిస్తార‌నే మీమాంస అందరిలోనూ ఉంది. అయితే ఇప్పుడు జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే వైసీపీ అభ్య‌ర్థుల తొలి జాబితా పూర్త‌యింద‌ని.. పాద‌యాత్ర‌ ముగింపు స‌భ‌లో వీరిని ప్ర‌క‌టిస్తార‌ని పార్టీ నేత‌లు స్ప‌ష్టం చేస్తున్నారు. 


వైసీపీకి 2019 ఎన్నిక‌లు అత్యంత కీల‌క‌మైన‌వి. ఈ ఎన్నికల్లో ఏమాత్రం అటూ ఇటూ అయినా.. జ‌గ‌న్ భవిష్య‌త్‌తో పాటు వైసీపీ భ‌విత‌వ్వం కూడా అంథ‌కారంలో ప‌డిపోతుందనే ఆందోళ‌న, భ‌యం.. పార్టీ నేత‌ల్లో ఏమూల‌నో మిణుకుమిణుకుమంటోంది. గ‌త ఎన్నిక‌ల్లో త‌ప్పిదాలు.. వెంటాడి వెన్నంటి విజ‌యానికి కొద్ది దూరంలోనే నిలిపివేశాయి. ఈ నేప‌థ్యంలో వేసే ప్ర‌తి అడుగు అప్ర‌మ‌త్తంగా వేయాల‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు. అయితే టీడీపీ ముంద‌స్తుగానే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పిన నేప‌థ్యంలో.. జ‌గ‌న్ కూడా ఇదే రూటులో ప్ర‌యాణించాల‌ని నిర్ణ‌యించారు. దీంతో మ‌రో రెండు రోజుల్లో ముగియ‌నున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర సంద‌ర్భంగా నిర్వ‌హించే సమావేశంలో.. ప్ర‌క‌టించాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. ఈ ముగింపు స‌భ‌లోనే తొలి విడ‌త జాబితాను జ‌గ‌న్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయం ఆ పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. 


ఏ పార్టీకైనా ఎన్నిక‌ల‌కు కొన్ని నెల‌ల ముందే పోటీ చేసే అభ్య‌ర్థుల‌కు సంబంధించి దాదాపు 50 లేదా 60 శాతం మంది పేర్లు ఖ‌రారు అవుతాయి.  కానీ అభ్య‌ర్థుల‌ను మాత్రం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉండ‌దు. ముందుగా అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించి తెలంగాణ‌లో మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకున్నారు కేసీఆర్‌. ఇప్పుడు ఇదే మోడ‌ల్‌ను అనుస‌రిస్తూ ఏపీలో వైకాపా కూడా ముందుగానే అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు ఆ పార్టీ వ‌ర్గాలే అభిప్రాయ‌ప‌డుతున్నాయి. ముందుగా అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించేస్తే.. అసంతృప్తులు, రెబెల్స్ ను బుజ్జ‌గించేందుకు స‌మ‌యం ఉండే అవ‌కాశం ఉంటుంద‌నేది వ్యూహంగా చెబుతున్నారు. శ్రీ‌కాకుళం జిల్లాకు సంబంధించి ప‌ది నియోజ‌క వ‌ర్గాల అభ్య‌ర్థుల్ని జ‌గ‌న్ ప్ర‌క‌టించేస్తార‌నే చ‌ర్చ కూడా స్థానికంగా జ‌రుగుతోంది.


ముందుగా అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించ‌డం విజ‌య‌వంత‌మైన వ్యూహంగా అన్ని సంద‌ర్భాల్లోనూ చెప్ప‌లేమంటున్నారు విశ్లేష‌కులు. తెలంగాణ ప‌రిస్థితులు టీఆర్ఎస్‌కు క‌లిసొచ్చాయ‌ని వివ‌రిస్తున్నారు. కేసీఆర్ మూణ్నెల్లు ముందుగా ప్ర‌క‌టించిన‌వ‌న్నీ సిట్టింగ్ స్థానాలే. పైగా, తెరాస అధికారంలో ఉంది. ముందుగా అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న అనేది అధికార పార్టీకి ఎప్పుడూ కొంత అడ్వాంటేజ్‌ అవుతుంద‌ని పేర్కొన్నారు. ఇక‌, వైసీపీ .. టీఆర్ఎస్‌ను అనుక‌రించాలనుకున్నా.. ఆ స్థాయిలో అన్ని సీట్ల‌ను ప్ర‌క‌టించే ప‌రిస్థితి ప్ర‌స్తుతానికి లేదని అభిప్రాయ‌ప‌డుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: