సినిమాలు, రాజకీయాలు కలగలసిపోయిన రోజులివి. తెలుగునాట గడచిన నాలుగు దశాబ్దాలుగా ఇది జరుగుతోంది. ఇందులో ఆశ్చర్యం కూడా ఏమీ లేదు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా సినిమా రంగంలో జరిగిన‌న్నాళ్ళు బాగా సొమ్ము సంపాదించుకుని ఆనక ప్రజా సేవ అంటూ కొత్త వేషం కట్టి రాజకీయాల్లోకి దూకడం అన్ని విద్యలూ తెలిసిన నటులకు అలవాటు అయిపోయింది. 


నందమూరి వర్సెస్ మెగా ఫ్యామిలి :


టాలీవుడ్లో ఇది ఎప్పటినుంచో ఉంది. నందమూరి తారక రామారావు వారసునిగా బాలక్రిష్ణ సినిమాల్లోకి వచ్చారు. అదే టైంలో చిరంజీవి కూడా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇద్దరూ స్టార్లు అయ్యారు. కొన్ని దశాబ్దాల పాటు ఇద్దరి మధ్యన సినిమాల్లో వార్ అలా కొనసాగింది. ఇక బాలయ్యకు తండ్రి ఇచ్చిన రాజకీయ వారసత్వం అదనం. అందువల్ల ఆయన టీడీపీకి ఎపుడూ వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. చిరంజీవి 2008లో రాజకీయ అరంగ్రేట్రం చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆయన ముఖ్యమంత్రి పీఠానికి ఎర వేసినా ఫలితం దక్కలేదు. 


ఆయనతో పాటే  మరో సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తరువాత ఆయన కొంతకాలం సైలెంట్ గా ఉన్నా 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని ఏర్పాటు చేసి టీడీపీకి మద్దతుగా నిలిచి సంచలనం స్రుష్టించారు. ఆ ఎన్నికల్లో గెలుస్తాడనుకున్న జగన్ ఓడిపోయారు, ఓడిపోతుందనుకున్న టీడీపీ గెలిచింది. ఇక్కడ పవన్ ఫ్యాక్టర్ బాగా పనిచేసింది. ఓ విధంగా టీడీపీ విజయంలో పవన్ పాత్రను ఎవరూ తక్కువ చేయలేరు.


ఆ కామెంట్ల అస్త్రంగా :


ఇక బాలయ్య కూడా 2014 ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి కాకపోయినా బావ చంద్రబాబు సర్కార్ లో బాలయ్య అంతకంటే ఎక్కువే మరి. దీంతో ప్రముఖ టీడీపీ నాయకునిగా బాలయ్యకు గుర్తింపు ఉండనే ఉంది. అందువల్ల మీడియా ఎపుడూ ఆయన్ని ఫోకస్ చేస్తూ వస్తోంది. పవన్ కళ్యాణ్ గురించి, చిరంజీవి గురించి ఈ సందర్భంగా బాలయ్య అప్పట్లో చేసిన కొన్ని కామెంట్స్ వివాదమయ్యాయి. వాటిని పట్టుకుని ఇపుడు మెగా బ్రదర్ నాగబాబు బాలయ్యను టార్గెట్ చేస్తున్నారు. దాంతో ఇపుడు ఏపీ పొలిటికల్ తెరపై మరో మారు నందమూరి, మెగా ఫ్యామిలీ మధ్యన వార్ మొదలైంది.


మీరేనా గొప్ప:


సినిమా నటుడిగా బాలయ్యకు మాస్ ఫోలోయింగ్ ఉండొచ్చు, రాజకీయాల్లోనూ ఆయన‌కు గుర్తింపు ఉండొచ్చు. అంత మాత్రం చేత మిగిలిన వారిని తక్కువ చేస్తారా ఇదే ఇపుడు నాగబాబు వాదన. ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా ఇపుడు బాలయ్యను ఏకి పారెస్తున్నారు. బాలయ్య ఒక్కో సందర్భంలో అన్న కామెంట్స్ ని పెట్టి మరీ కడిగేస్తున్నారు. మీరొక్కరే మనుషులనుకుంటే ఎలా అంటూ నిగ్గదీస్తున్నారు. చాలా కాలంగా బాలయ్య పై నాగబాబు ఇలా దాడి చేస్తున్నా ఇపుడు అది పీక్స్ కి వెళ్ళిపోయింది. దాంతో అటు సినిమా, ఇటు రాజకీయం రెండింటి మీద ఈ ప్రభావం పడుతోంది.


నోరు మెదపని టీడీపీ:


బాలయ్య అంటే సామాన్యుడు కాదు, దివంగత ఎంటీయార్ కి కుమారుడు, సినీ వారసుడు, రాజకీయల్లోనూ చురుకుగా ఉంటున్నారు. ఇక ఆయన బావ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీలో అధికారంలో ఆ పార్టీ ఉంది. బాలయ్య ఎమ్మెల్యే, మరో వైపు స్టార్ హీరో. ఇన్ని హంగులు ఉన్నా నాగబాబు దాడి చేస్తే బాలయ్య క్యాంప్ నుంచి కానీ, టీడీపీ వైపు నుంచి కానీ ఒక్కటంటే ఒక్క కౌంటర్ రావడం లేదు. పైగా సినిమా ఇండస్ట్రీలో సైతం బాలయ్యకు మద్దతు లేకుండా పోయిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నాగబాబు అయితే బాలయ్య మీద మరిన్ని విమర్శలు చేయడానికి రంగం సిధ్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. 


మరి టీడీపీకి కీలక నాయకుడైన బాలయ్య విషయంలో ఆ పార్టీ ఎందుకు ఇంత మౌనంగా ఉంటోందన్నది అర్ధం కావడంలేదు. ఓ విధంగా చూస్తే వ్యూహాత్మకంగానే పార్టీ ఇలా చెస్తోందనుకోవాలెమో. చంద్రబాబుని చిన్న మాట అంటేనే ఉలిక్కిపడి ఉద్యమాలు చేసే టీడీపీ బాలయ్యను కొన్నాళ్ళుగా అదే పనిగా విమర్శిస్తున్నా ఏమీ అనకపోవడం చూస్తూంటే బాలయ్య టీడీపీలో ఎంతటి ఒంటరో అన్నది అర్ధమవుతోంది. ఇక సినిమా రంగంలోనూ బాలయ్యకు మద్దతుగా ఒక్క నోరూ వినిపించకపోవడాన్ని చూస్తూంటే  అక్కడ కూడా ఆయన ఒంటరేనా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఈ వివాదం మరింతగా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: