`కాట్ర‌వ‌ల్లి` అంటూ ప్రేక్ష‌కుల‌ను గిలిగింత‌లు పెట్టిన సినీ న‌టుడు, క‌మెడియ‌న్‌ ఆలీ.. ఇప్పుడు స‌రికొత్త అవ‌తారంలో క‌నిపించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. `ఎన్న చేట` అని క‌డుపుబ్బా న‌వ్వించిన అత‌డు.. ఇప్పుడు త‌న మాట‌ల‌తో అటు ప్ర‌జ‌ల‌ను, ఇటు రాజ‌కీయ వేత్త‌ల‌ను గంద‌రగోళంలో ప‌డేస్తున్నాడు! జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ల్యాణ్‌కు స‌న్నిహితంగా మెలిగే ఆయ‌న‌.. తాజాగా రాజకీయ బాట‌లో న‌డిచేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. వ‌రుస‌గా టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబును, ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌ను, అలాగే ప‌నిలో ప‌నిగా మిత్రుడైన ప‌వ‌న్‌తో భేటీ కావ‌డం ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి ఇప్పుడు ఆలీ.. ఏ పార్టీలో చేర‌తాడు? ఎవ‌రికి హ్యాండ్ ఇచ్చేందుకు ప‌వ‌న్ మిత్రుడు సిద్ధ‌మ‌వుతున్నాడు? త‌న‌కు రాజ‌కీయంగా అనుబంధం ఉన్న టీడీపీతో జ‌త‌క‌లిసి ప‌వ‌న్‌కు ఝ‌ల‌క్ ఇస్తారా?  లేక స‌న్నిహితుడైన ప‌వ‌న్ చెంత‌కే చేరి బాబు, జ‌గ‌న్‌కు జెల్ల కొడ‌తారా? అనే సందేహాలు అంద‌రినీ వేధిస్తున్నాయి. అయితే ఈ స‌స్పెన్స్‌కు మాత్రం సంక్రాంతి త‌ర్వాతే.. తెర ప‌డుతుందంటున్నాడు ఆలీ. 


సినిమా న‌టులు రాజ‌కీయాల్లోకి రావ‌డం, రాజ‌కీయ పార్టీల‌కు మ‌ద్ద‌తు తెలప‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మే! మరీ ముఖ్యంగా ఏపీలో రాజ‌కీయాల‌కు, సినిమాకు అవినాభావ సంబంధ‌మే ఉంది. అయితే ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో.. సినీ న‌టులు కొంద‌రు త‌మ అభిమాన పార్టీల‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్న విష‌యం తెలిసిందే! ఇదే స‌మ‌యంలో.. రెండు ద‌శాబ్దాల త‌ర్వాత సినీ న‌టుడు ఆలీ రాజ‌కీయాల్లో యాక్టివ్ కావాల‌నుకోవ‌డం ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీ యాంశంగా మారింది. ప‌వ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడైన ఆలీ.. జ‌న‌సేన‌లో చేరిపోతార‌ని, రాజ‌మండ్రి నుంచి పోటీచేస్తార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రిగింది. కానీ వీటిపై స్పందించిన దాఖ‌లాలు లేవు. అయితే ఇప్పుడు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌తో భేటీ కావ‌డం స‌రికొత్త చ‌ర్చ‌కు దారితీసింది. ఆయ‌న వైసీపీలోకి వెళ్ల‌డం ఖాయ‌మ‌ని వ‌దంతులు చ‌క్కెర్లు కొట్టాయి. ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా జనవరి 9న ఆయన వైసీపీ కండువా కప్పే సుకుంటున్నట్టు డేటు కూడా ఫిక్సయిపోయింది. ఇది జ‌రిగిన కొద్ది రోజుల్లోనే టీడీపీ అధినేత చంద్ర‌బాబును క‌లిసి.. అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు ఆలీ.


అటు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో, ఇటు ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో విడివిడిగా భేటీ అయ్యారు. దీంతో అలీ అడుగులు ఎటువైపు పడనున్నాయనే దానిపై సందిగ్ధత నెలకొంది. నిన్నటి దాకా వైసీపీలో చేరుతారనుకున్న అలీ.. ఒక్కసారిగా ఇలా బాబు, పవన్‌లతో భేటీ కావడం చర్చకు తావిస్తోంది. జగన్‌ నుంచి స్పష్టమైన హామీ లభించక పోవడం వల్లే ఆయన జనసేన, టీడీపీలలో ఏదో ఒక పార్టీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాజకీయంగా అలీకి టీడీపీతో మంచి అనుబంధమే ఉంది. 1999లో బాపట్ల నుంచి ప్రముఖ నిర్మాత రామా నాయుడు టీడీపీ తరపున పోటీ చేసినప్పుడు అలీ క్రియాశీలకంగా పనిచేశారు. అయితే, ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ 20 ఏళ్ల తర్వాత రాజకీయాల వైపు వచ్చేందుకు  ఆసక్తి చూపుతున్నారు. 


అయితే, టీడీపీతో ఉన్న అనుంబంధాన్ని కొనసాగిస్తారా? లేక పవన్‌తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా జనసేనలో చేరుతారా? అనేది వేచి చూడాలి. త‌న నిర్ణ‌యం మాత్రం సంక్రాంతి త‌ర్వాత ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పి.. మ‌రింత స‌స్పెన్స్ పెంచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: