రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులు సృష్టించే ఆటంకాల‌ను స‌మ‌ర్ధంగా ఎదుర్కొన‌డం అనేది చాలా కీల‌క విష‌యం. నిజానికి రాజ‌కీయం అంటేనే ప్ర‌త్య‌ర్థిని మ‌రింత దారుణాతి దారుణ స్థితికి చేర్చ‌డ‌మే! ఈ విష‌యంలో గ‌తానికి ఇప్ప‌టికి చాలా తేడా క‌నిపిస్తోంది. రాజ‌కీయంగా స‌బ్జెక్ట్ వారీగా మాత్ర‌మే గ‌తంలో విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమర్శ‌లు ఉండేవి. కానీ, నేడు మారిన రాజ‌కీయ ప‌రిణామంతో పాటు అదికార దాహం కూడా రాజ‌కీయాల్లో పెను మార్పులు తెచ్చింది. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల నుంచి నేత‌లను కొనుగోలు చేయ‌డం వ‌ర‌కు కూడా వెళ్లిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ‌డిచిన మూడేళ్ల కాలంలో ఇలాంటి ప‌రిస్థితి మ‌న‌కు క‌నిపించింది. త‌మ‌ అవ‌స‌రం కోసం పార్టీలు, త‌మ అవ‌స‌రం కూడా ఉంద‌ని నాయ‌కులు ఇలా ప‌ర‌స్ప‌రం ఒక‌రికొక‌రు పార్టీలు మారిపోయిన/చేర్చుకున్న‌ సంద‌ర్భాలు క‌నిపిస్తున్నాయి. 


దీనికి ఎవ‌రూ అతీతులు కారు. అయితే, కొంద‌రికి అవ‌కాశాలు వ‌చ్చినంత‌గా మ‌రికొంద‌రికి రాక‌పోవ‌డం వ‌ల్లే నాయ‌కులు నిజాయితీని వ‌ల్లిస్తుం టారు. స‌రే.. అస‌లు విష‌యానికి వ‌స్తే.. టీడీపీ అధినేత ఆక‌ర్ష్ మంత్రంతో వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీలు మారిపోయారు. ప్ర‌జాప్రాతినిధ్యం చ‌ట్టం ప్ర‌కారం వీరిపై వేటు వేయాల‌న్న‌ది వైసీపీ అధినేత ఆవేద‌న‌, ఆందోళ‌న కూడా! అయితే, సాధార‌ణంగా అధికార ప‌క్షం  వ‌ద్ద ఇవ‌న్నీ ముందుగానే మాట్లాడుకుని నాయ‌కులు పార్టీలు మార‌తారు కాబ‌ట్టి జ‌గ‌న్ ఆశ‌లు నేటికీ తీర‌లేదు. పైగా వైసీపీ నుంచి వెళ్లిన వారు మంత్రులై.. జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు కూడా చేస్తున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో పార్టీ అధినేత‌గా.. నాడు టికెట్ కోసం త‌న చుట్టూ ప్ర‌ద‌క్షిణ చేసిన వారే.. నేడు అసెంబ్లీలో త‌న‌ను విమ‌ర్శిస్తుండ‌డాన్ని త‌ట్టుకోలేని స్థితిలో.. జ‌గ‌న్ అసెంబ్లీని బాయ్ కాట్ చేసి 13 నెల‌లు గ‌డిచిపోయింది. 


అయితే, దీనిని కూడా రాజ‌కీయంగా వాడుకునేందుకు జ‌గ‌న్ ప్ర‌త్య‌ర్థులు ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌య‌త్నిస్తూనే ఉంటార‌నే విష‌యం తెలిసిందే. గ‌తంలో రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం అవ‌స‌ర‌మా? అని ప్ర‌శ్నించిన చ్రంద‌బాబు అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌తిప‌క్షం ఉండి కూడా అసెంబ్లీకి రాలేద‌ని అన్నారు. ఇక‌, అసెంబ్లీలో క‌నీసం జ‌గన్‌కు మైకు ఇచ్చేందుకు స‌మ్మ‌తించ‌ని నాయ‌కులు కూడా జ‌గ‌న్ ను విమ‌ర్శించారు. అయితే, ఎన్నిక‌ల‌కు స‌మ‌యం మించిపోతున్న త‌రుణంలో జ‌గ‌న్ ఇప్ప‌టికైనాఅసెంబ్లీలో అడుగు పెట్టాల్సిన అవ‌సరం ఉంద‌నేది వాస్త‌వం. ప్ర‌భుత్వంపై అవినీతి ఆరోప‌ణ‌లు చేసినా.. అసెంబ్లీకి వెళ్లి ప్ర‌శ్నించ‌డం ఉత్త‌మ‌మ‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. ఎన్నిక‌ల‌కు ముందు స్వ‌యంకృతంగా చంద్ర‌బాబు చేతిలో విమ‌ర్శ‌లకు దొరికిపోకుండా త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న అసెంబ్లీస‌మావేశాల‌కు హాజ‌రై.. ప్రజ‌ల వాణిని వినిపించ‌డం ద్వారా ఆశించిన ఫ‌లితంగా రాబ‌ట్టుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని సూచిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: