టీడీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త త‌న‌కు అనుకూలంగా మారుతుంద‌ని భావిస్తున్న ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత జ‌గ‌న్‌లో.. ఏ మూల‌నో భ‌యం కూడ‌గట్టుకుందా?  విజ‌యంపై పూర్తి న‌మ్మ‌కంతో ఉన్న‌ట్లే క‌నిపిస్తున్నా.. గ‌త ఎన్నిక‌ల్లోనూ, అంతేగాక పక్క రాష్ట్రమైన తెలంగాణ‌లో జ‌రిగిన ప‌రిణామాలతో ఆందోళ‌న మొద‌లైందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేకత ఓట్ల రూపంలో వైసీపీకి ప‌డుతుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నా.. జ‌గ‌న్‌లో మాత్రం క‌ల‌వ‌ర‌పాటు ఉంద‌ని వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ మొద‌లైంది. ముఖ్యంగా బ‌హుముఖ పోరు అనే మాట వింటే ఆయ‌న‌లో వ‌ణుకు మొద‌ల‌వుతోంద‌ని తెలుస్తోంది. ప్ర‌జా వ్య‌తిరేక ఓటు మొత్తం త‌మ వైపు రాకుండా.. ఇది అడ్డుప‌డుతుంద‌ని.. ఇది త‌న సీఎం ఆశ‌ల‌ను మ‌ళ్లీ ముంచేస్తుంద‌నే సందేహం ఆయ‌న‌లో ఎక్కువ‌వుతోంద‌ట‌. ఈ నేప‌థ్యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ మ‌ళ్లీ కలిసిపోతేనే త‌న‌కు మంచింద‌ని జ‌గ‌న్ అభిప్రాయ‌ప‌డుతున్నార‌ట‌.
Image result for chandrababu naidu pawan
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేత‌లు వ్యూహ‌, ప్ర‌తివ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో త్రిముఖ పోరు త‌ప్ప‌ద‌నే విష‌యం స్ప‌ష్ట‌మైపోయింది. అధికారిన్ని నిల‌బెట్టుకోవాల‌ని చంద్ర‌బాబు, గ‌తంలో కొద్దిలో దూర‌మైన సీఎం ప‌ద‌వి ఈసారి ద‌క్కించుకోవాల‌నే త‌ప‌న‌తో ఉన్న జ‌గ‌న్‌.. ఇక కొత్త రాజ‌కీయాలకు వేదిక‌గా మారిన ప‌వ‌న్ మ‌ధ్య‌.. తీవ్ర పోటీ నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో.. ఎవ‌రు ఎవ‌రి ఓట్ల‌ను చీలుస్తార‌నే చ‌ర్చ తీవ్రంగా జ‌రుగుతోంది. అంతేగాక ప్ర‌జావ్య‌తిరేక ఓటు ఎటు వెళుతుంద‌నే ప్ర‌శ్న కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్షాల మధ్య చీలిపోతుందనే భ‌యం ప్ర‌తిప‌క్ష నేత‌లో కనిపిస్తోంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 2009లో ప్రజారాజ్యం పోటీ చేయ‌డంతో టీడీపీ నష్టపోయినట్లుగానే ఈసారి వైసీపీకి ఎదురుదెబ్బ తగులుతుందని జగన్ భావిస్తున్నట్లుగా సమాచారం. అందుకే.. టీడీపీ-జనసేన మ‌ళ్లీ కలిసి పోటీ చేస్తేనే మంచిదని కోరుకుంటున్నార‌ట‌. 


ఏపీలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో.. బ‌హుముఖ పోరు కంటే ద్విముఖ పోరు ఉంటేనే మంచిదని జగన్ భావిస్తున్నారు. బహుముఖ పోటీ ద్వారా అధికారంలో ఉన్న పక్షాలకే లాభమని.. తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికలతో పాటు ఎన్నో సందర్భాల్లో రుజువైంద‌ని ఉద‌హ‌రిస్తు న్నారు. ఇదే అంశం ఏపీలో వచ్చే ఎన్నికల్లో తన కొంపముంచే అవకాశముందని జగన్ ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వూల్లో ఇదే అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని అంచనా వేస్తూనే.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తేనే తమకు మంచిదని చెప్పొకొచ్చారు. ముసుగులో గుద్దులాట ఎందుకని, పాతమిత్రులు మరోసారి కలిసి పోటీ చేయాలని సూచించారు. దీంతో జగన్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. జగన్ వ్యాఖ్యలపై వైసీపీతో పాటు టీడీపీ, జనసేనలోనూ చర్చ జరుగుతోంది.


వచ్చే ఎన్నికల్లో విడిగానే పోటీ చేస్తామని పవన్ తో పాటు జగన్ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో పొత్తులపై ఓ క్లారిటీ వస్తోంది. అదే సమయంలో ఎవరికివారు విడివిడిగా పోటీ చేయడం ద్వారా అంతిమంగా వైసీపీకి నష్టం తప్పదనే అంచనాలు ఉన్నాయి. ఇదే విషయాన్నివైసీపీ నేతలు కూడా జగన్ దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. అందుకే మరోసారి టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని జగన్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే పాత మిత్రులను టార్గెట్ చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను గంపగుత్తగా సొంతం చేసుకోవచ్చనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: