కొడితే ఏనుగు కుంభ‌స్థలాన్నేకొట్టాల‌నుకున్నాడు సినీన‌టుడు, క‌మెడియ‌న్ ఆలీ. కొద్ది రోజుల నుంచి ఏపీ రాజ‌కీయాల్లో ఆయ‌న  పేరు మారుమోగుతోంది. అందుకు త‌గిన‌ట్లుగానే.. అటు సీఎం చంద్ర‌బాబు, ప్ర‌తిప‌క్ష నేత జ‌గన్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌తో భేటీల‌తో ఒక్క‌సారిగా ఏపీ రాజ‌కీయ తెర‌పై అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ధ‌మైపోతున్నారు ఆలీ. ఇప్ప‌టివ‌ర‌కూ త‌న రాజ‌కీయ ఎంట్రీ గురించి ఎక్క‌డా బ‌య‌టికి రాకుండా వ‌స్తున్న ఆయ‌న‌.. ఇప్పుడు త‌న రిక్వైర్‌మెంట్లు, త‌న కోరిక‌లు అన్నీ బ‌య‌ట‌పెట్టేశారు! `నాకు కావాల్సిన‌వి ఇవి. వీటిని ఇస్తామ‌ని చెప్పిన వాళ్ల‌తోనే నేను అడుగులు వేస్తాను` అంటూ దాప‌రికం లేకుండా అంద‌రి ముందూ ఉంచేశారు. దీంతో ఇన్నాళ్ల పాటు ముసుగులో గుద్దులాట‌కు తెరదించేశారు. గుంటూరు తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌నుకుంటున్న‌ట్లు ఆలీ వెల్ల‌డించారు. అంతేగాక గెలిచిన త‌ర్వాత త‌న‌కు మంత్రి ప‌ద‌వి కూడా ఇవ్వాల‌ని కండీష‌న్ పెట్టారట‌. ఇక ఆయ‌న ఏ పార్టీలో చేరాలో నిర్ణ‌యించాల్సింది చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, జ‌గ‌నేన‌ని తేలిపోయింది! దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ ఆలీ కోర్టులో ఉన్న బంతి.. ఇప్పుడు వారి ముగ్గురి కోర్టులోకి వెళ్లిన‌ట్ట‌యింది. 


ఊహాగానాల‌కు ఆలీ తెర‌దించేశారు. రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు ఆయ‌న‌ ప్ర‌క‌టించేశారు. వెండితెర‌పై న‌వ్వులు పూయిస్తున్న ఆలీ.. ఇప్పుడు రాజ‌కీయ తెర‌పై స‌రికొత్త అవతారంలో క‌నిపించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే ఇన్నాళ్లూ త‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై వ‌స్తున్న వ‌దంతుల‌కు ఆయ‌న చెక్ చెప్పారు. అంతేగాక త‌న‌కు ఏ సీటు కావాలో కూడా చెప్పేశారు. ఆ సీటు ఇచ్చిన పార్టీలో చేరిపోతాన‌ని ప్ర‌క‌టించేశారు. ఇప్పటి వరకూ త‌న‌ రాజకీయ రంగ ప్రవేశంపై మీడియాతో పెద్దగా మాట్లాడని ఆలీ.. ఒక ఇంట‌ర్వ్యూలో మాత్రం తన ఆశలు అన్నీ వెళ్లబోసుకున్నారు. తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే సరిపోదని.. మంత్రి పదవి కూడా ఇవ్వాల్సిందేనంటున్నారు. అలా ఇచ్చే పార్టీలో చేరతానన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి ఆయ‌న పోటీచేయాల‌ని భావిస్తున్నారు. అక్కడ ముస్లిం జనాభా ఎక్కువ. ఎప్పుడూ ముస్లిం అభ్యర్థులే గెలుస్తూ ఉంటారు. తనకు అక్కడ సీటు ఇచ్చి మంత్రి పదవి కూడా ఇవ్వాలంటున్నారు.


`నేను ఏ పార్టీలో పోటీచేసినా హోదా అడుగుతా. 20 ఏళ్లుగా కార్యకర్తగానే ఉన్నాను. ఇకనైనా ఏదో ఒక పదవి చేపట్టాలి. కేవలం ఎమ్మెల్యేగా గెలవడం కాదు, మంత్రిపదవి కావాలి. మా వర్గం నాయకుడికి కూడా పదవి ఇచ్చారని ముస్లిం జనాలు హ్యాపీగా ఉండాలి. ఏ కండువా నా మీద వేసినా నేను మంత్రిపదవి కండిషన్ పెడతాను. దానికి ఓకే అంటేనే నేను వెళ్తాను.` అని కుండ బ‌ద్ద‌లు కొట్టేశారు. కేవలం మంత్రిపదవే లక్ష్యంగా ఈసారి ఎన్నికల బరిలో దిగబోతున్నానని స్పష్టంచేశాడు. ఎవరైతే పేపర్ పైన తనకు రాసిస్తారో ఆ పార్టీలో చేరతానని చెబుతున్నాడు. మంత్రి పదవి ఇస్తానంటే స్టార్ క్యాంపెయినర్ గా ఏ పార్టీ తరఫున అయినా రాష్ట్రం మొత్తం పర్యటించడానికి సిద్ధ‌మంటున్నారు. `కానీ నేను అడిగిన గుంటూరు-1 లేదా విజయవాడ-1 లేదా రాజమండ్రి సీట్ మాత్రమే కావాలి. రాసి ఇవ్వాలి. లేదంటే నేను ఒప్పుకోను.` అని చెబుతున్నారు. 


ఆలీ తన కోరిక‌ల చీటిని జేబులో పెట్టుకుని మూడు పార్టీల నేత‌ల‌ వద్దకు పరుగులు పెట్టారు. త‌నకు స‌న్నిహితుడైన ప‌వ‌న్.. తన నుంచి ఏమీ ఆశించొద్దని క్లియర్ గా చెబుతున్నాడని, అలాంటప్పుడు జనసేనలో ఎందుకు చేరుతానని ప్రశ్నిస్తున్నాడు ఆలీ. దీంతో మిగిలిన రెండు పార్టీల్లో ఏదో ఒక‌దాంట్లో చేరాల్సిందే! ఏ పార్టీ నుంచి టికెట్ దక్కినా అలీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు.. ఆయన ఆశిస్తున్న గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ సిట్టింగ్ సీటు. అక్కడి ఎమ్మెల్యేలను తొలగించి.. గుంటూరుకు ఎలాంటి సంబంధం లేని.. అలీకి జగన్ టిక్కెట్ ఇస్తారా? అనేది కీలకంగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: