పండుగ అంటే ఏంటి. ఈ ప్రశ్నకు సులువుగానే సమాధానం దొరుకుతుంది. మనసులో ఆనందం అంబరాన్ని తాకడం, ఉత్సాహం ఉరకలు వేయడం వంటివి పండుగకు పర్యాయ పదాలు. ఇక మనకు నచ్చిన వారు మన వారు ఒక చోట చేరి కబుర్లు చెప్పుకుంటే ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. పూర్వ కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. వారంతా ప్రతీ రోజూ పండుగగానే బతికారు.


లోగిళ్ళలో సందళ్ళు :


సంక్రాంతి పండుగ తెచ్చే హుషార్ అంతా ఇంతా కాదు. లోగిళ్ళు సందడి చేస్తాయి. అచ్చట్లు, ముచ్చట్లతో హడావుడి చేస్తాయి. పట్టు పరికిణీలు, లంగా ఓణీలు పరువాల పలకరింపులు, బావా మరదళ్ళ సరసాలు, ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్ళ  అల్లర్లు, పెద్ద వాళ్ల కుశల ప్రశ్నలు  ఇలా ఒకటేమిటి సంక్రాంతి కొత్త కాంతిని తీసుకువస్తుంది. ఇంట్లో నవ్వులే నవ్వులుగా అంతా పెద్ద పండుగ చేసుకోవడం ఓ అందమైన  అనుభూతిగా ఉంటుంది.


మనదైన సంప్రదాయం :


నిజానికి మన భారతీయ సంప్రదాయాల్లోనే పండుగలకు విశిష్టత ఉంది. ప్రతి పండుగ కూడా  కాలాన్ని అనుసరించి వచ్చినవే. సంక్రాంతి పండుగ వేళ చలి కాలం ఉంటుంది. అందువల్ల పల్లెటూర్లు మంచుతోనూ, మంచితనంతోనూ కలగలసి కొత్త మెరుపులు మెరుస్తాయి. అటువంటి వేళ లోగిళ్లలో నిండుగా జనం ఉంటే ఆ చలి మటుమాయమే అవుతుంది. ఇక అల్లరులు, ముచ్చట్లు, కోడి పందేల హుషార్లతో  సరికొత్త ఉత్తేజమూ తెస్తుంది. అంతా ఒక్కటిగా ఉండాలని, ఎవరు ఎక్కడ ఉన్నా ఏడాదికో మారు ఒక చోట చేరి పండుగ చేసుకోవాలని పెద్దలు నిర్ణయించారు. అందుకే కోటి కాంతులతో వచ్చే సంక్రాంతి కొత్త అనందాలనూ వెంట తెస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: