రానున్న ఎన్నికలపై సినీనటుడు ఆలీ తన మనసులోని మాటను బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ఉందని చెప్పారు. మంత్రి గంటా శ్రీనివాస్ తో భేటీ అయిన సందర్భంగా ఆలీ పోటీ విషయమై క్లారిటీ ఇచ్చారు. మూడు రోజుల క్రిందట చంద్రబాబునాయుడుతో ఆలీ భేటీ అయిన విషయం అందరికీ తెలిసిందే. మరి అప్పుడు గుంటూరులో పోటీ చేసే విషయమై చంద్రబాబుతో చెప్పారో లేదో తెలీదు. అంతకుముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కూడా దాదాపు రెండుగంటల పాటు భేటీ అయ్యారు.

 

అసలు ఆలీ వరసుగా అందరితోను భేటీలు ఎందుకు జరుపుతున్నారంటే మీడియా, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారమనే చెప్పాలి. పది రోజుల క్రితం విశాఖపట్నం నుండి హైదరాబాద్ వచ్చే సమయంలో ఎయిర్ పోర్టులో జగన్ ను కలిశారు. ఇద్దరూ కలిసి విమానంలో హైదరాబాద్ కు వచ్చారు. తర్వాత రెండు రోజులకు ఆలీ వైసిపిలో చేరుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. చంద్రబాబుకు మద్దతిచ్చే మీడియాలో కూడా ఆలీ వైసిపిలో చేరుతున్నట్లు ప్రముఖంగా వచ్చింది. దాంతో  టిడిపి, జనసేనలో పెద్ద కలకలమే రేగింది.

 

సరే తర్వాత తాను వైసిపిలో చేరటం లేదని ఆలీ వివరణ ఇచ్చుకున్నాకే ప్రచారం ఆగింది. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుందని తాజాగా ఆలీ బయటపెట్టారు. అది కూడా గుంటూరు నియోజకవర్గంలో పోటీ చేయాలనుందని చెప్పటం గమనార్హం. పైగా మైనారిటీ కోటాలో మంత్రి పదవి కూడా కావాలట. నిజానికి మంత్రివర్గంలో అసలు కోటాలే లేవు. మంత్రిపదవి కావాలి అని ఎవరైనా అడగటానికి మాత్రమే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపులు, బిసిలనే కార్డును వాడుతుంటారు. అలాంటిది మైనారిటీ కోటా గురించి ఆలీ మాట్లాడటమే విచిత్రంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: