షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబునాయుడును కష్టాలు కమ్ముకుంటున్నాయి. ఎప్పుడో భూమిలో పాతేసిన ఏలేరు స్కాం మళ్ళీ పైకి లేస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితంనాటి ఏలేరు భూ కుంభకోణం తాలూకు కేసును వెంటనే విచారణ జరిపి బాధ్యులపై ఛార్జిషీటును దాఖలు చేయాలని హై కోర్టు ఆదేశించింది. 1996లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పోలీసు స్టేషన్లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేయాలంటూ హై కోర్టు సిబిసిఐడిని కోర్టు ఆదేశించింది. అనకాపల్లిలో ఏలేరు లెఫ్ట్ కెనాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం భూములు సేకరించింది. అందుకుగాను భూములు పోగొట్టుకున్న బాధితులకు నష్ట పరిహారం చెల్లించింది ప్రభుత్వం. నష్ట పరిహారం చెల్లింపుల్లోనే భారీ ఎత్తున కుంబకోణం జరిగిందన్నది ఆరోపణలు.

 

నష్టపరిహారం చెల్లింపుల్లో కుంబకోణం జరిగిందంటూ విశాఖపట్నం జిల్లా కోర్టులో న్యాయవాది అయిన పీలా పోతినాయుడు సుప్రింకోర్టులో కేసు వేశారు. తర్వాత ఆ కేసు విషయమై ప్రభుత్వం జస్టిస్ సోమశేఖర కమీషన్ నియమించింది. సరే తర్వాత ఆ కమీషన్ పనితీరు తదితరాలపై చాలా ఆరోపణలే వచ్చాయి. నష్టపరిహారం చెల్లింపులు, సోమశేఖర కమీషన్ నియామకం, విచారణ అంతా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే జరిగింది. కాబట్టి అన్నింటిలోను చంద్రబాబే కీలక పాత్రదారిగా ఆరోపణలున్నాయి. సరే ఎన్ని ఆరోపణలు వచ్చినా చంద్రబాబు ఏమాత్రం లెక్క చేయలేదనుకోండి అది వేరే సంగతి.

 

తనపై వచ్చిన ఆరోపణలను చంద్రబాబు విజయవంతంగా చెక్ పెట్టగలిగారు. కమీషన్ విచారణ నివేదికను సైతం బహిర్గతం చేయలేదు. బాధ్యులపై ఏదో తూతూమంత్రంగా  చర్యలు తీసుకున్నారు. కుంబంకోణానికి సూత్రదారులను, కీలక పాత్రదారులను వదిలిపెట్టి క్రిందస్ధాయి ఉద్యోగులపైనే చర్యలు తీసుకున్నారన్న ప్రధాన ఆరోపణలైతే అలాగే ఉన్నాయి. అయితే, ఎవరెన్ని ఆరోపణలు చేసినా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఎవరేమీ చేయలేకపోయారు. పైగా కేసు విచారణపై చంద్రబాబు స్టే కూడా తెచ్చుకున్నారు. దాంతో కేసు విచారణ 20 ఏళ్ళుగా కోల్డు స్టోరేజీలో పడిపోయింది.  ఇపుడు హైకోర్టు ఆదేశాలతో మళ్ళీ చలనం వచ్చేట్లుంది. ఏలేరు కుంబంకోణం కేసును ప్రత్యేకంగా విచారణ చేయించాలని అనుకుంటే రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసుకోవచ్చని కూడా చెప్పింది. చంద్రబాబు ఆ పని చేస్తాడా ?


మరింత సమాచారం తెలుసుకోండి: