ల‌క్ష్య సాధ‌న‌కు రాజ‌కీయ పార్టీలు ఎంచుకునే మార్గాలు డిఫ‌రెంట్‌గా ఉంటాయి. ఏ పార్టీకి ఆ పార్టీ ఎంచుకునే మార్గాలు ఆస‌క్తిగా ఉంటాయి కూడా. ప్ర‌స్తుతం ఏపీ అధికార పార్టీ టీడీపీ కూడా ఇలాంటి వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌ల‌తోనే ముందుకు సాగుతోంది. న‌వ్యాంధ్ర‌లో తొలి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ.. ఇదే రికార్డును కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ తిరిగి విజ‌యం సాధించేందుకు రెడీ అవుతోంది. ఇప్ప‌టికే టీడీపీ అధినేత‌, ప్ర‌భుత్వ సార‌ధి చంద్ర‌బాబు అభివృద్ధి మంత్రంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని ముందుకు తీసుకు వెళ్లేందుకు, అభివృద్ధి ఆగ‌కుండా ముందుకు సాగేందుకు తిరిగి త‌న‌నే ఎన్నుకోవాల‌ని చంద్ర‌బాబు పిలుపునిస్తున్నారు. 


ఈ క్ర‌మంలోనే ఆయ‌న అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి ప్ర‌జ‌ల్లోకి దూసుకు పోతున్నారు. అదేస‌మ‌యంలో స‌మాజం లోని ప్ర‌తి ఒక్క‌రికీ ఏదో ఒక‌టి అనే నినాదంతో ప్ర‌తి ఒక్క‌రికీ ల‌బ్ధి చేకూరుస్తున్నారు. అన్ని సామాజిక వ‌ర్గాల‌కు చేయూత‌ను అందిస్తున్నారు. ఇక‌, ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌త్యంలో ఇప్పుడు జిల్లా టార్గెట్‌గా చంద్ర‌బాబు దూసుకు పోయే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు సామాజిక వ‌ర్గాలు, వ్య‌క్తుల ఆధారంగా జ‌రిగిన అభివృద్ధిని జిల్లాల వారీగా కూడా చేప‌ట్టి.. పార్టీని అధికారంలోకి తీసుకు రావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి జిల్లాకు ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టులు అందించాల‌ని నిర్ణ‌యించారు. 


ఇటీవ‌ల కాలంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో చంద్ర‌బాబు దూకుడు ప్ర‌ద‌ర్శించారు. అక్క‌డ క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ‌కు శంకు స్థాప‌న చేశారు. ఇక‌, ఇప్పుడు తాజాగా ప్ర‌కాశం జిల్లాలో రెండు కీల‌క ప్రాజెక్టుల‌కు ఆయ‌న భూమి పూజ చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అటు భారీ కాగితపు పరిశ్రమ, ఇటు రామాయపట్నం పోర్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఇండోనేషియాకు చెందిన ఆసియా పల్ప్‌ అండ్‌ పేపర్‌ మిల్స్‌ (ఏపీపీ) రామాయపట్నం సమీపంలో ఆంధ్రా పేపర్‌ ఎక్స్‌లెన్స్‌ (ఏపీఈ) పేరుతో భారీ కాగితపు పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఇక్కడ రెండు దశల్లో రూ.24వేల కోట్ల పెట్టుబడి పెడుతోంది. దేశంలో ఇప్పటిదాకా వచ్చిన అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) కావడం ఇదే విశేషం.


ప్రస్తుతం దేశంలో అతిపెద్దదైన ఐటీసీ పేపర్‌ మిల్స్‌కు పదిరెట్ల పెద్ద కాగిత గుజ్జు, కాగిత తయారీ పరిశ్రమగా ఏపీఈ అవతరించనుంది. ఇందులో ప్రత్యక్షంగానే 15వేల మందికి ఉపాధి లభిస్తుంది. ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 60వేల మంది సుబాబుల్‌, యూకలిప్టస్‌ రైతులకు ప్రయోజనం కలుగుతుంది.  రామాయపట్నం పోర్టుకు కూడా  శంకుస్థాపన జరగనుంది. సుమారు 3092 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 30 బెర్త్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలిదశలో రూ.4240 కోట్లతో ఐదు బెర్త్‌లను నిర్మించనున్నారు. 2023 జనవరి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ పోర్టు ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 25వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇలా ప్ర‌తి జిల్లాకు ఏదో ఒకటి చేయ‌డం ద్వారా చంద్ర‌బాబు పార్టీని అధికారంలోకి తీసుకు రావాల‌న్న వ్యూహం ఫ‌లిస్తుంద‌ని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: