పాదయాత్ర ముగింపు బ్రహ్మాండంగా జరిగింది. ఇచ్చాపురం వద్ద  ఈ రోజు విజయస్తూపం ఆవిష్కరించి జగన్ సుదీర్ఘంగా  సాగిన నడక బడలిక తీర్చుకున్నారు. ముఖంలో అలసట ఉన్నా జనం కోసం తాను పడిన కష్టం అన్నది తలచుకుని దాన్ని సైతం  మరచిపోయారు. రెండు గంటల పాటు చేసిన ప్రసంగం ఆధ్యంతం తాను ఏపీలో అధికారంలోకి వస్తే ఏం చేస్తానన్నది వివరణాత్మకంగా తెలియచేశారు. మొత్తానికి వైసీపీకి పదునైన ఆయుధంగా పాదయాత్రను జగన్ అందించారు.


అంతం కాదు...:


పాదయాత్రలో అంతం కాదని, ఇక్కడే ఆరంభం ఉందని జగన్ కొత్త  ట్విస్ట్ ఇచ్చారు. పాదయాత్ర నడక అంతా ప్రజల ఆశీర్వాదం అన్న జగన్ ఇక్కడితో పోరాటం ఆగిందనుకుంటే పొరపాటేనని వైసీపీ శ్రేణులకు సుతిమెత్తగా హెచ్చరించారు. రానున్న మూడు నెలలు ఇదే తీరున కష్టపడితేనే చంద్రబాబు సర్కార్ ని దింపగలమన్న కఠోర సత్యాన్ని ఆవిష్కరించడం ద్వారా వూహల్లోఎవరైనా  నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఉంటే వారిని వాస్తవంలోకి తీసుకువచ్చారు. 


పెద్ద మాయవి :


బాబును మాయావితో పోల్చిన జగన్ ఆయన్ని తేలిగ్గా తీసుకోవద్దంటూ గతానుభవాల సారాన్ని గ్రహించినట్లుగా గట్టి సందేశమే ఇచ్చారు. బాబు మాయలకు తోడు రెండు పత్రికలు, కొన్ని చానళ్ళు  వంత పాడుతున్నాయి.  ఏ వ్యవస్థ‌లనైనా మ్యానేజ్ చేయగలిగే నైపుణ్యం బాబు సొంతమని, అటువంటి బాబు పూటకో పార్టీతో పొత్తు పెట్టుకుని జనానికి కొత్త సినిమా చూపిస్తారని కూడా జగన్ హెచ్చరించారు. అందువల్ల వైసీపీ శ్రేణులంతా జాగ్రత్తగా ఉండాలని, ఎన్నికల వరకూ యుధ్ధమేనని జగన్ చెప్పారు.


అన్నీ జ‌యిస్తాను :


తాను బాబు మాయలు, కుట్రలు జయిస్తానంటూ గట్టి భరోసా ఇచ్చిన జగన్ తనకు ప్రజల అశీర్వాదం కావాలని కోరారు తాను ఒక్కడినే ఏదీ చేయలేనని, అవినీతి, కుట్రలు, వెన్నుపోటుతో కూడుకున్న వ్యవస్థను కుప్పకూల్చాలంటే జనం కూడా అడుగులో అడుగు వేసి ముందుకు కదలాలని జగన్ అన్నారు. అపుడు ప్రజలు కోరుకున్న సర్కార్ అధికారంలోకి వస్తుదని జగన్ చెప్పుకొచ్చారు.


వ్యామోహం అదే :


తనకు డబ్బు మీద వ్యామోహం లేదని, అందువల్ల తాను లంచాలను తీసుకుని అవినీతి పాలన చేయనని జగన్ అభయం ఇచ్చారు. తనకు ప్రజలు, వారి అభివ్రుద్ధి ముఖ్యమని, అందువల్ల అధికారంలోకి వస్తే తాను చెప్పిన వాటిని అన్నీ అమలు చేసి తీరుతానని ఆయన అన్నారు. ముప్పయ్యేళ్ళ పాటు ప్రజలకు అత్యుత్తమ పాలన అందించాలన్నది తన కోరికని జగన్ వెల్లడించారు. మొత్తానికి జగన్ పాదయాత్ర ముగింపు తరువాత పూర్తి వాస్తవిక ధోరణిలో ప్రసంగం చేయడం విశేషం. ఇదే తీరున జగన్ కొనసాగుతూ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తే వైసీపీకి అధికారం దక్కడం తధ్యమన్న మాట వినిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: