ఏపీ రాజకీయాల్లో ఓ మహత్తర ఘట్టానికి నిన్న తెర పడింది. పద్నాలుగు నెలల పాటు అప్రతిహతంగా సాగిన జగన్ పాదయాత్ర ఇచ్చాపురంలో ఘనంగా ముగిసింది. మొత్తం పదమూడు జిల్లాలను పాదయాత్రతో జగన్ చుట్టేశారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయాన్ని, వాతావరణాన్ని ఆయన స్వయంగా తెలుసుకున్నారు. బాగా అవగాహన పెంచుకున్నారు.


అనుభవం పెంచిందా :


జగన్ పాదయాత్రకు ముందు నంద్యాల ఉప ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఆ ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని జగన్ తో సహా  అంతా భావించారు. అయితే చిత్రంగా టీడీపీ దాదాపు 30 వేల భారీ మెజారిటీతో గెలిచి వైసీపీకి గట్టి ఝలక్ ఇచ్చింది. అదే తీరున కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లోనూ వైసీపీ ఓడిపోయింది. ఓ వైపు పార్టీ నుంచి ఫిరాయింపులు, మరో వైపు వరస పరాజయాలు, ఇది నిజంగా వైసీపీకి పరీక్షా సమయం. దాన్ని అధిగమించేందుకే జగన్ భారీ పాదయాత్ర తలపెట్టారు. అది మంచి ఫలితాన్ని ఇవ్వడమే కాదు, అధినేతగా జగన్ కి కూడా మంచి అనుభవాన్ని కూడా పంచింది.


అతి విశ్వాసం లేదు :


2014 ఎన్నికల నాటికి జగన్ తో సహా నేతలంతా అతి విశ్వాసానికి వెళ్ళిపోయారు. నిజానికి ఓ దశలో మేమే రేపు అధికారంలోకి వస్తున్నామని నిర్లక్ష్యంగా  వ్యవహరించారు. ప్రచారం పైన కూడా పెద్దగా ద్రుష్టి పెట్టలేదు, అదే సమయంలో టీడీపీ కొత్త పొత్తులతో దూసుకురావడం, బూత్ లెవెల్ వరకూ క్యాడర్ ని విస్తరించి చావో రేవో అన్నట్లుగా పొరాడడం వల్ల చివరి నిముషంలో ఫలితం మారిపోఇంది. స్వల్ప తేడాతో ఎక్కడికక్కడ వైసీపీ ఓటమి పాలు అయితే టీడీపీ గెలిచింది. ఆ తప్పు ఇపుడు జగన్ చేయాలనుకోవడం లేదని పాదయాత్ర తరువాత ఆయన ప్రసంగాన్ని  చూస్తే అర్ధమవుతోంది.


ఇంకా పోరాడాలి :


జగన్ ఇదే విషయాన్ని క్యాడర్ కి  గట్టిగా చెబుతున్నారు. జనం బలం ఉన్నంత మాత్రాన గెలిచేట్టు కాదని జగన్ బాగానే గ్రహించారు. చంద్రబాబును మాయవి తో పోల్చారు. ఆయన ఎన్ని ఎత్తులు, జిత్తులైనా వేస్తారని, కొత్త పొత్తులతో వస్తారని, తోడుగా మీడియా కూడా ఉందన్న వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్లుగా వివరించారు. ఇది నిజంగా జగన్ లో వచ్చిన అతి పెద్ద మార్పుగా చూడాలి. ఈ మధ్యనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇదే చెప్పారు. జగన్ కి అనుకూలంగా అంతా కనిపిస్తున్నా చంద్రబాబు ని తక్కువ అంచనా వేయలేం, ఆయన చివరి వరకూ పోరాడుతారు అని.
సరిగ్గా జగన్ నోటి వెంట కూడా ఇదే మాట రావడం ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనమే. ఇదే తీరులో జగన్ పూర్తి వాస్తవికంగా ఆలొచనలు చేస్తూ  సరైన వ్యూహాలను రూపకల్పన చేసుకుంటే వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. జగన్ సైతం దానికి తగినట్లుగానే అడుగులు వెస్తున్నారని పాదయాత్ర తేల్చి చెప్పింది. నిజంగా పాదయాత్ర జగన్ కి ఇచ్చిన అనుభవ సారం ఇదేనేమో


మరింత సమాచారం తెలుసుకోండి: