పాలిటిక్స్ లో ఎపుడు ఎవరు మిత్రులవుతారో, మరెపుడు శత్రువులుగా మారుతారో చెప్పలేం. ఇపుడు ఏపీలోనూ అలాంటి వాతావరణమే ఉంది. నిన్నటి వరకూ చంద్రబాబుకు మిత్రుడిగా ఉన్న పవన్ ఇపుడు సొంతంగా  పోటీ చేస్తానంటూ జనంలోకి వచ్చారు. దాంతో ఆయన ప్రభావంపై రసవత్తర చర్చ సాగుతోంది. 


రమ్మని పిలిచి :


ఇకపోతే గత కొద్ది నెలలుగా పవన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని, ఆయన కుమారున్ని విమర్శిస్తూ ప్రసంగాలు చేస్తున్నారు .దానికి టీడీపీలోని మంత్రులు, సామంతులు కూడా కౌంటర్లు గట్టిగానే ఇస్తూ వచ్చారు. ఓ దశలో చంద్రబాబు కూడా జోరు పెంచి పవన్ని ఘాటుగా విమర్శించారు. పవన్ జగన్, కేసేయార్ మోడీ అంటూ ఆయన విరుచుకుపడేవారు. ఇదంతా ఇపుడు పాత విషయం అయింది.  కొన్నాళ్ళ క్రితం చంద్రబాబు పవన్ని తనతో కలసి రమ్మని ఓపెన్ గానే ఆహ్వానం పంపారు. మోడీ ఏపీకి చేస్తున్న అన్యాయంలో కలసి పోరాడాలని కూడా పిలుపు ఇచ్చారు. దానికి కేవలం ట్విట్టర్ ద్వారా మాత్రమే ఖండించి పవన్ తన దారి తనదే  అన్నారు. అయితే ఈ రెండు పార్టీల వ్యవహారంపై అప్పటికీ అనుమానాలు ఉన్నాయి. 


ఒక్క మాట అనని బాబు :


ఇది అయిపోయిన తరువాత బాబు యధా ప్రకారం మీటింగుల్లో మాట్లాడుతున్నారు. ఇపుడు బాబు స్వరంలో మార్పు వచ్చింది. అదెలా అంటే కేసీయార్, మోడీ, జగన్ అంటూ నలుగురిని కాస్తా ముగ్గురిని చేశారు. అందులో నుంచి పవన్ని తీసేశారు. పవన్ ప్రస్తావన లేకుండానే బాబు సభలు జరుగుతున్నాయి. ఏపీకి అన్యాయం చేసే నోరు మెదపరా అంటూ గతంలో పవన్ని గద్దించిన చంద్రబాబు ఇపుడు మాత్రం ఆ వూసే ఎత్తడంలేదు. మొత్తం అంతా జగన్ వైపే టర్న్ చేశారు. 
పైగా పవన్ ఏర్పాట్ చేసిన ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ 75 వేల కోట్లు కేంద్రం ఇవ్వాలని చెప్పిందని దాన్ని కోట్ చేసి మరీ అనుకూలంగా వాడుకుంటున్నారు. గతంలో ఇదే కమిటీని ప్రస్తావించి పవన్ ఎందుకు ఈ విషయం పై మోడీని నిలదీయరు అని చంద్రబాబే విమర్శించిన సంగతి గుర్తుండే ఉంటుంది. అంటే బయటకు ఈ రెండు పార్టీలూ నో అనుకున్నా లోపల ఏదో జరుగుతోందన్న అనుమానాలు కలిగేలా బాబు పవన్ని అసలు ఏమీ అనడంలేదంటున్నారు. నిజంగా ఏపీ రాజకీయాల్లో ఇది చాలా కీలకమైన పరిణామమే.


అందుకోసమేనా :


ఎన్నికల ముందు పవన్ సొంతంగా పోటీ చేసినా అనంతరం జరిగే పరిణామాల్లో ఏపీలో టీడీపీకే ఆయన మద్దతు ఉంటుందని అంతా అనుకుంటున్నారు. ఒక వేళ ఏపీలో హంగ్ వచ్చి ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే పవన్ సాయం తీసుకోవాలన్న ముందస్తు ఎత్తుగడలతోనే బాబు ఈ విధంగా పవన్ని విమర్శించడం లేదు అంటున్నారు. అంతే కాదు. పవన్ని అనడం ద్వారా ఆయన సామజిక వర్గం ఓట్లు పోగోట్టుకోవడం కంటే సాఫ్ట్ గా ఉంటే కొంతలో కొంత అయినా ప్రయోజనం కలుగుతుందని బాబు ఆలోచనగా కనిపిస్తోంది. 
ఇక పవన్ని  పిలిచినా అయన పొత్తులకు నో అనేసారు. ఇది జనంలోకి బాగా వెల్ళింది. అంటే బాబు పవన్ పట్ల సానుకూలంగానే ఉన్నారన్న సందేశాన్ని విజయవంతంగా ఆ వర్గంలోకి చంద్రబాబు పంపేశారని అంటున్నారు. దాంతో గతంలో ఉన్న వ్యతిరేకతను ఆ సామజికవర్గంలో కొంత తగ్గించుకోగలిగారని కూడా విశ్లేషిస్తున్నారు.


పవనే క్లారిటీ ఇవ్వాలి :


ఇక పవన్ చాలాకాలంగా బహిరంగ సభలు పెట్టడం లేదు. ఒకవేళ ఆయన సభలు పెడితే అపుదు చంద్రబాబు మీద ఆయన చేసే విమర్శలు బట్టి రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన ఏంటన్న దానిపై క్లారిటీ వస్తుంది. ఆ సభల్లో సుతి మెత్తగా బాబుని అంటూ పోతే మాత్రం ఏదో లోపాయికారీ ఉందనే అనుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి ఇపుడు బాబు మాత్రం పవన్ని రిజర్వ్ లో పెట్టారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: