రానున్న ఎన్నికల్లో వైసిపికి ఎన్ని సీట్లు వస్తాయి ? చాలామంది మధ్య జరుగుతున్న చర్చ ఇది. జాతీయ మీడియా కూడా పార్లమెంటు ఎన్నికల్లో ఎవరికెన్ని సీట్లు వస్తాయి అనే సర్వేలు చేస్తున్నాయే కానీ అసెంబ్లీ సీట్ల విషయంలో మాత్రం ఎందుకనో సర్వేలు చేయటం లేదు. సరే, ఎంపి ఎన్నికల్లో రాబోయే సీట్ల సంఖ్యనే దామాషాగా వేసుకుని వైఎస్ కుటుంబ అభిమానులు, వైసిపి నేతలు సంబరపడుతున్నారు. అయితే,  రాబోయే ఎన్నికల్లో పార్టీ సాధించబోయే అసెంబ్లీ సీట్లపై తాజాగా విజయమ్మ మాత్రం ఓ లెక్క చెప్పారు.

 

విజయమ్మ లెక్క ప్రకారం వైసిపికి 120 సీట్లు వస్తాయట. రానున్న ఎన్నికల్లో వైసిపిది ఒంటరి పోరే అని తాజాగా జగన్ చేసిన క్లారిఫికేషన్ ద్వారా అందరికీ స్పష్టత వచ్చేసింది. ఇక రావాల్సింది ప్రతిపక్షాల్లోనే అంటున్నారు విజయమ్మ. పోయిన ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన తెలుగుదేశంపార్టీ, బిజెపిలు జనసేనను కలుపుకుని మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసినా జగన్ కు వచ్చే నష్టమేమీ లేదని విజయమ్మ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పై మూడు పార్టీలతో పాటు కాంగ్రెస్ ను అదనంగా కలుపుకుని పోటీ చేయాలంటూ విజయమ్మ సవాలు విసరటమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

 

పోయిన ఎన్నికల్లోనే జగన్ సిఎం అవ్వాల్సందంటూ విజయమ్మ అభిప్రాయపడ్డారు. అప్పటి వాతావరణం కూడా ఇఫ్పుడున్నట్లే ఉందన్నారు. పోయిన ఎన్నికల సమయంలో కూడా అధికారంలోకి రాబోయేది జగనే అని అందరూ అనుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కాకపోతే చివరి నిముషంలో చంద్రబాబుకు అండగా బిజెపి, జనసేన నిలబడటంతో చంద్రబాబు ఏదోలా గట్టెక్కినట్లు ఎద్దేవా చేశారు. కానీ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ అదే పరిస్దితి రిపీటయ్యే అవకాశాలు లేవని ధీమా వ్యక్తం చేశారు. జరగాల్సిన నష్టమేదో పోయిన సారే జగన్ కు జరిగిపోయింది కాబట్టి ఇక నష్టం జరగటానికేమీ లేదన్నారు. విజయమ్మ ధీమా చూస్తుంటే అధికారంలోకి రాబోయేది తామే అన్న వైసిపి నేతల మాటలు నిజమవుతాయా అని అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: