మూలిగే నక్కపై తాటిపండు పడటమంటే ఇదే. అసలే అంతంత మాత్రంగా ఉన్న బిజెపికి ఎంఎల్ఏ షాకిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరుతున్నారు. కొంతకాలంగా ఆకుల బిజెపితో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. పార్టీలోని ఎంఎల్సీ సోమువీర్రాజుతో ఆకులకు ఏమాత్రం పడటం లేదు. దానికితోడు ఆకుల భార్య లక్ష్మీ పద్మావతి ఎప్పటి నుండో జనసేనలో యాక్టివ్ గా ఉన్నారు. భార్య జనసేనలో చేరినా ఆకుల మాత్రం బిజెపిలో ఉండటంతో ఎంఎల్ఏ పార్టీ మారరనే అనుకున్నారు. తీరా ఇఫుడేమో తాను జనసేనలో చేరనున్నట్లు స్వయంగా ఆకులే చెప్పటంతో బిజెపి నేతలు షాక్ కు గురయ్యారు.

 

 డాక్టర్ గా ఉన్న ఆకులకు రాజమండ్రిలో మంచి పేరే ఉంది. అదే సందర్భంలో  ఆకులకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఉంది. డాక్టర్ ప్రాక్టీసులో ఎంత బిజీగా ఉంటారో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఆకుల అంతే బిజీగా ఉంటారు. అలాంటిది పోయిన ఎన్నికలకు ముందే బిజెపిలో చేరారు. రాజమండ్రి ఎంపి టిక్కెట్టు ఇస్తామని చెప్పటంతోనే ఆకుల బిజెపిలో చేరారు. అయితే, ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీతో పొత్తు పెట్టుకోవటం వల్ల ఎంపి సీటులో పోటీ చేయటం ఆకులకు కుదరలేదు. రాజమండ్రి నుండి మురళీమోహన్ పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

 

 మొదటి నుండి ఎంపి సీటుపైనే కన్నేసిన ఆకుల రేపటి ఎన్నికల్లో జనసేన తరపున ఎంపిగా పోటీ చేయనున్నట్లు సమాచారం. ఎంపిగా పోటీ చేసే విషయమై ఇటీవల పవన్ కల్యాణ్ భేటీలో ఖాయమవ్వటంతో జనసేనలో చేరటానికి ఆకులకు లైన్ క్లియర్ అయ్యింది. దానికితోడు జనసేనకు కూడా నేతల కొరత బాగా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆకుల కోరుకున్న సీటు తీసుకోవటానికి  జనసేనలో ఎటువంటి ఇబ్బందీ ఎదురుకాలేదు. ఈనెల 21వ తేదీన రాజమండ్రిలోనే పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకుంటున్నారు. సరే ఆయనతో పాటు ఆయన వర్గం ప్లస్ సోము వీర్రాజంటే పడని వాళ్ళు కూడా జనసేన తీర్ధం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బిజెపికున్న నలుగురు ఎంఎల్ఏల్లో ఒక వికెట్ డౌన్ అయిపోయినట్లే. మరి రేపటి ఎన్నికల్లోగా ఇంకెన్ని వికెట్లు పడిపోతాయో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: