ఎన్నికలు, డబ్బు ఇపుడు అవినాభావ సంభదంతో మెలగుతున్నాయి. ఒకపుడు కార్యకర్తల భోజనాలకే ఖర్చుగా డబ్బు కొంత ఉంచుకునే వారు. ఊరూరా తిరిగి ప్రచారం నిర్వహించేవారు. దాంతో అప్పట్లో ఎన్నికలు అంటే ఓ నిబద్ధత, నిజాయతీ కనిపించేది.  ఇచ్చిన మాటలు, హామీలను చూసి మాత్రమే జనం ఓటేసేవారు. ఇపుడు మొత్తం అంతా మారిపోయింది.


నిజమేనా :


ఎన్నీకల్లో డబ్బు ప్రవాహం ఇపుడు బాగా కనిపిసోందన్నది బహిరంగ రహస్యం. రెండు నెలల క్రితం జరిగిన తెలంగాణా ఎన్నికల్లోనే దారుణంగా డబ్బు ఖర్చు పెట్టారని ప్రచారం సాగింది. అక్కడ ఒక్కో అభ్యర్ధి 20 కోట్ల వరకూ వెచ్చించి మరీ పోటీ పడ్డారని వార్తలు వచ్చాయి. ఇక ఏపీలో దానికి మించి ఖర్చు చేస్తారని అపుడే అనిపించింది. దానికి తగినట్లుగానే ఏపీలో వాతావర‌ణం మారుతోంది. జగన్ పార్టీ పై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేత తులసీరెడ్డి ఎమ్మెల్యేకు 30 కోట్లు, ఎంపీకి వంద కోట్లు రూపాయలు ఖర్చు చేసేవారికే జగన్ టికెట్లు ఇస్తున్నారని ఘాటైన‌ ఆరోపణలు చేశారు. మరి ఇది ఎంతవరకూ నిజమో ఆయనే చెప్పాలి.


టీడీపీపైనా :


ఇక టీడీపీ పైన జగన్, పవన్ కూడా గత మీటింగుల్లో ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి చోటా ముప్పయి కోట్ల రూపాయలకు తక్కువ లేకుండా ఖర్చు చేయడానికి టీడీపీ చూస్తోందని కామెంట్స్ చేశారు. అందుకోసమే విచ్చలవిడిగా అవినీతి కూడా చేస్తున్నారని అన్నారు. మరి ఆ విధంగా ఒక్కో ఎమ్మెల్యే కనీసంగా ముప్పయి కోట్లను ఖర్చు చేస్తారన్నది నిజమే అయితే ఈసారి జరగబోయే ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలుగానే భావించాలేమో.


తట్టుకోగలరా :


అధికార పార్టీ టీడీపీ కి అయితే ఈ విషయంలో కొంత పరవాలేకపోవచ్చు కానీ, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, ఆశావహులు కానీ ఈ ఖర్చు భరించగలరా అన్న చర్చ వస్తోంది. అలాగే కొత్తగా వచ్చిన జనసేన కూడా ఈ విషయంలో ఎంతవరకూ అదుపు చేస్తుందన్నది కూడా చూడాలి. నిజానికి ఇదంతా ప్రచారమే అనుకున్నా ఒక ఎమ్మెల్యే ముప్పయి కోట్లను ఖర్చు చేసి గెలిచి వస్తే ఆయన జనాలకు ఏ మేరకు సాయంగా ఉండగలరన్నది కూడా చూడాలి. రాజకీయాలు ప్రజా హితం కావాలి కానీ, డబ్బు ప్రమేయంతో కాకూడదు, మరి ఈ ధోరణి చూస్తూంటే మరో మారు ఎన్నికల్లో కరెన్సీ దూకుడు కనిపించి అసలైన ప్రజాభిప్రాయం తేలిపోయే ప్రమాదం కూడా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: