తెలంగాణాలోని కాంగ్రెస్ పార్టీకి రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయా? త‌్వ‌ర‌లోనే ఈ పార్టీ ఇక‌, ప్రాంతీయ పార్టీక‌న్నా ఘోరంగా మార నుందా?  తెలంగాణాను తామే ఇచ్చామ‌ని చెప్పుకొంటున్న నాయ‌కులు.. ఇక్కడ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురా వ‌డం మాట అటుంచితే.. క‌నీసం ఇప్పుడు పార్టీ త‌ర‌ఫున గెలిచిన నాయ‌కుల‌ను కాపాడుకోలేని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ఇప్పుడు తెలంగాణాలో కాంగ్రెస్ అస‌లు ఉంటుందా? ఉండ‌దా అనే సందేహాలు తెర‌మీదికి వ‌చ్చాయి. తెలంగాణా ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీతో విజ‌యం సాధించిన కేసీఆర్‌.. ఆ వెంట‌నే రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌ను బ‌లంగా దెబ్బ‌కొట్టాల‌ని నిర్ణ‌యించుకున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి గెలిచిన వారికి ఆయ‌న రెడ్ కార్పెట్ ప‌రిచారు. 


అయితే, దీనిని ప్రారంభ‌ద‌శ‌లో లైట్‌గా తీసుకున్న కాంగ్రెస్ నాయ‌కులు.. ఇప్పుడు అస‌లు సినిమా మొద‌ల‌య్యే స‌రికి త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఒక‌రు కాదు. ఇద్ద‌రు కాదు.. ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీకి జ‌ల్ల‌కొట్టి కేసీఆర్ కు జై కొట్టేందుకు రెడీ అయ్యారు. మాజీ హోంమంత్రి - రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సహా ఆరుగురు సంక్రాంతి త‌ర్వాత పార్టీ మారేందుకు రెడీ అయ్యార‌నే వార్త‌లు రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారాయి. ఇలా చేరుతున్న వారేమీ ఉత్తిపుణ్యాన కేసీఆర్‌కు జై కొట్ట‌డం లేదు., వారు వారి వారి ప‌ద‌వులు, భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకుని గోడ‌లు దూకుతున్నారు. ఒక్కోక్క‌రి ల‌క్ష్యం ఒక్కొక్క‌టిగా ఉండ‌డం గ‌మ‌నార్హం. తొలి విడత పార్టీలో చేరతారని భావిస్తున్న సబితా ఇంద్రారెడ్డికి రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందని అనుకుంటున్నారు.


అంతేకాదు.. కుమారుడు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం టికెట్ ఇస్తారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో ఆ స్థానం నుంచి కార్తీక్ కు సీటు ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్నది స‌మాచారం. అలాగే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి టీఆర్ ఎస్ లో చేరడం కూడా దాదాపుగా ఖాయమైందని అంటున్నారు. వీరిద్దరే కాకుండా  భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య - పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు - పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి -  నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జె. సురేందర్ కూడా టీఆర్ ఎస్ లో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఏదేమైనా.. కాంగ్రెస్ భ‌విత‌వ్యం రాబోయే రోజుల్లో మ‌రింత గ‌డ్డు ప‌రిస్థితి ఎదుర్కొనక త‌ప్ప‌ద‌నేది వాస్త‌వ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: