ఆలూ లేదు చూలు లేదు. అల్లుడు పేరు సోమలింగం అన్న సామెత లాగుంది చంద్రబబునాయుడు వ్యవహారం. విషయం ఏమిటంటే, కృష్ణా జిల్లాలోని ఇబ్రహింపట్నం దగ్గర అమరావతి లాంటిదే మరో నగరం నిర్మించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అమరావతి ప్రాంతంలో రైతులు సహకరించినట్లు కృష్ణా జిల్లాలోని రైతులు కూడా సహకరిస్తే ఇబ్రహింపట్నం దగ్గర బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మించేందుకు సిద్ధమంటూ చంద్రబాబు చేసిన ప్రకటనతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా చంద్రబాబు చెప్పిన మాటలు వింటుంటే చాలామందికి పిచ్చెక్కిపోతోంది.

 

ఎందుకంటే, కృష్ణా జిల్లాలో రైతులు సహకరిస్తే ఇబ్రహింపట్నం దగ్గర కూడా ఓ అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తానన్నారు. అంటే చంద్రబాబు ఉద్దేశ్యమేమిటి ? అమరావతి ప్రాంతంలో అద్భుతమైన నగరాన్ని నిర్మించేసినట్లే కదా ? అమరావతి నిర్మాణానికి తమ భూములను అప్పగించిన రైతులు ఇపుడు నెత్తీ నోరు కొట్టుకుంటున్న విషయం అందరూ చూస్తున్నదే. రైతుల దగ్గర నుండి లాక్కున్న భూములను చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు, సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టేస్తున్నారు. భూములు తీసుకునేటపుడు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరటం లేదని రైతులు మండిపోతున్నారు.

 

మాయమాటలు చెప్పి తమ దగ్గర నుండి వేలాది ఎకరాలను చంద్రబాబు లాగేసుకున్నారంటూ ఇపుడు రాజధాని ప్రాంత రైతులు లబోదిబోమంటున్న విషయం అందరూ చూస్తున్నదే. రాజధాని ప్రాంత రైతులను తానేదో ఉద్ధరించేసినట్లు చంద్రబాబు బిల్డప్పులు మాత్రమే ఇస్తున్నారు. మళ్ళీ ఇపుడు కృష్ణా జిల్లా రైతులు కూడా ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇవ్వాలని చంద్రబాబు అడగటమంటే రైతుల నోళ్ళల్లో మట్టి కొట్టే ప్లాన్ ఏదో ఉండే ఉంటుందనటంలో సందేహం లేదు. కాబట్టి కృష్ణా జిల్లాలో రైతులు తమ భూములను ఇచ్చేముందు ఒకసారి అమరావతి ప్రాంత రైతులతో మాట్లాడితే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: