పెరట్లో పూసిన గులాబీకి, ప్లాస్టిక్ తో చేసిన ఫ్లవర్ కి ఎంతో తేడా ఉంది. కొళాయి నీరుకు, చెరువు నీరుకూ కూడా ఎంతో వ్యత్యాసం ఉంది. ముఖాన పౌడర్ పూసుకుని నవ్వే నకిలీ నవ్వులకూ, ఏ కల్మషం లేని అచ్చమైన స్వచ్చమైన పల్లె నవ్వుకూ మధ్య ఎంతో తేడా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే పల్లెటూళ్ళు స్వర్గం.  అక్కడ ఉంటే పవిత్రమైన దేవాలయంలో ఉన్నట్లుగా ఉంటుంది.


పల్లె పులకిస్తోంది :


పల్లెటూళ్ళు ఇపుడు పులకరించి పోతున్నాయి. పరవశించి పదాలు పాడుతున్నాయి. ఎప్పటికైనా మీమే మొనగాళ్ళం అంటూ మీసం మెలేస్తున్నాయి. మొదట పల్లె, తరువాతే పట్నం. అంటే నాగరికత కధ అంతా ఇక్కడే ఉంది జీవన విధానమూ ఇక్కడే ఉంది. పట్నం బతుకు తెరువు ఇస్తే పల్లే బతుకే ఇచ్చింది. ఆయుష్షు పోసి నిండు నూరేళ్ళు వర్ధిల్లమని మనసారా ఆశీర్వదిస్తోంది. అటువంటి పల్లెటూళ్ళకు ఇపుడు పట్నాలు జై అంటున్నాయి. తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి కోసం పట్నాలన్నీ కలసి పల్లెలకు తరలి వచ్చేశాయి.


కదలిన బస్తీ :


పండుగ బండి రద్దీగా ఉంది. అందులో ఎందరు ఉన్నా అందరినీ కలిపి పల్లె వైపుగా వేగంగా పరుగులు పెడుతోంది. ఆందరినీ  గమ్యాన్ని చేర్చేందుకు  ఉరకలు వేస్తోంది. బరువైన బాధ్యతను గొప్పగా నిర్వహిస్తోంది. పట్నాలన్నీ  ఒకే దారి పట్టి మరీ పల్లెలకు కదలిపోతున్నాయి. ఏడాది పొద్దు పట్నవాసం సావాసం చేసిన జనం పల్లె పట్టు కోసం పరితపిస్తున్నారు. పల్లె తల్లి కళ్ళలో వెలుగు చూడాలని తపిస్తున్నారు. ఒక్క పండుగ చాలు మళ్ళీ ఏడాదికి సరిపడా రిలీఫ్ ఇచ్చేస్తుంది. అందుకే ఈ ఆరాటం, పోరాటం. యుధ్ధం చేసినా పల్లెకు వెళ్ళాలి. ఎన్ని కడగండ్లు పడైనా ఆ తల్లి ఒడిలో సేద తీరాలి. అందుకే పండుగ బండి రద్దీగా ఉంది.


బోసిపోయిన పట్నం :


పట్నాల డొల్లతనం బయటపెట్టేసింది సంక్రాంతి. ఎన్ని హంగులు ఉన్నా మాకొద్దు అంటున్నారుగా జనం. పల్లెకు పోదాం చలో అంటూ మనో వేగంతో దారులు వెతుకుతూ కదులుతున్నారుగా. మరి పల్లెతో పోటీ  పెట్టుకున్న పట్నం ఇపుడు బోసిపోతోంది. జనం లేక విలవిల్లాడుతోంది. ఎన్నో రంగులు చూపిస్తానంటూ ఊరించినా మాకొద్దు అంటూ పల్లెకు జై కొడుతున్న జనంతో పట్నాల అసలు బండారం బాయటపడిపోయింది పల్లెలన్నీ కిటకిటలాడితే పట్నాలు వెలవెలబోతున్నాయి. సంక్రాంతి వెలుగులతో గ్రామీణ భారతం మరింత వైభవాన్ని సంతరించుకుంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: