రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా సైన్యాన్ని బలోపేతం చేయనున్నారు. అందుకోసం తొందరలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉన్న సుమారు 130 మందితో సమావేశం నిర్వహించాలని అనుకుంటున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో వైసిపిని అధికారంలోకి తేవటంలో సోషల్ మీడియా నిర్వహించాల్సిన పాత్రపై డిటైల్డ్ గా చర్చించటంతో పాటు అవసరమైన సూచనలు ఇస్తారని తెలుస్తోంది. పోయిన ఎన్నికల్లో సోషల్ మీడియాను వైసిపి నిర్లక్ష్యం చేసిందనే చెప్పాలి. అదే సమయంలో చంద్రబాబునాయుడు అధికారంలోకి రావటంలో టిడిపి తరపున సోషల్ మీడియా విభాగం నిర్వహించిన పాత్ర చాలా పెద్దదనే చెప్పాలి.

 

ఎన్నికల్లో సోషల్ మీడియా పాత్రను ఎన్నికలై పోయిన తర్వాతే జగన్ గుర్తించారు. దాంతో అప్పటి నుండి సోషల్ మీడియాపైన కూడా శ్రద్ధ చూపుతున్నారు. అందుకే తెలుగుదేశంపార్టీ నేతలతో పాటు చంద్రబాబునాయుడు, లోకేష్ యవ్వారాలను వైసిపి సోషల్ మీడియా విభాగం చీల్చి చెండాడుతోంది. జగన్ పాదయాత్ర అంత బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యిందంటే అందుకు వైసిపి సోషల్ మీడియా విభాగం పాత్ర కూడా బాగానే ఉంది. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ లాంటి వాటిల్లో వైసిపి సోషల్ మీడియా విభాగం చొచ్చుకుపోతోందనటంలో సందేహం లేదు.

 

అదే సమయంలో సోషల్ మీడియా విభాగం విషయానికి వస్తే అన్నీ పార్టీల్లోకి జనసేన తరపున పనిచేస్తున్న సోషల్ మీడియానే బాగా యాక్టివ్ గా కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినీ సెలబ్రిటీ కావటమే అందుకు ప్రధాన కారణం. లక్షల సంఖ్యలోని పవన్ అభిమానులంతా ఫేస్ బుక్ లో హల్ చల్  చేస్తుంటారు. ఒక్కో ఫేస్ బుక్ ఖాతాలో లక్షలమందున్నారంటేనే అర్ధమైపోతోంది ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో. మొత్తం మీద టిడిపి సోషల్ మీడియా విభాగం ఎందుకో వెనకబడిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలోనే సోషల్ మీడియా విభాగాన్ని మరింతగా జోరు పెంచేందుకే తొందరలో జగన్ సమావేశం నిర్వహించబోతున్నారట. మరి ఏ విధమైన సూచనలు, సలహాలిస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: