ఏపీలో రాజకీయం బాగా వేడెక్కింది. ఎవరేం చేసినా దాన్ని రాజకీయాలకు ముడి పెట్టడం కామన్ అయిపొయింది.  ప్రతీ నాయకుని మాటలు, కదలికలు బట్టి కూడా ఆయన రాజకీయం ఏంటన్నది చెప్పేస్తున్నారు. నిజానికి ఏపీలో ఈసారి సంక్రాంతి పండుగ, దానితో పాటు రిలీజ్ అయిన సినిమాలు, ఆఖరుకు కోడి పందేలు   అన్నీ కూడా రాజకీయమయమైపోయాయి. అంతా రాజకీయం గా కనిపిస్తోంది.


బాణం గుచ్చుకుంటోందా :


సరిగ్గా  ఆరేళ్ళ క్రితం అంటే 2013లో జగన్ జైల్లో ఉన్నపుడు రాజకీయ అరంగ్రేట్రం చేసిన ఆయన సోదరి షర్మిల తాను జగనన్న వదిలిన బాణాన్ని అని గట్టిగా చెబుతూ జనంలోకి దూసుకెళ్ళారు. ఏపీలోనే కాదు దేశంలో కూడా ఏ మహిళా చేయని సాహసం ఆమె చేశారు. ఏకంగా మూడు వేల పై చిలుకు కిలోమీటర్ల పాదయాత్ర ఉమ్మడి ఏపీలో చేశారు. ఆనాటి ఆమె సభలకు జనం పోటెత్తారు. అచ్చం వైఎస్సార్ రూపు, హావభావాలు, మాటలతో షర్మిల జనాన్ని కట్టి పడేశారు.
 అంతే కాదు. ఆమె ఎక్కడికక్కడ చంద్రబాబుని విమర్శిస్తూ చేసిన ప్రసంగాలు  వాడి వేడి గా సాగాయి. సూటిగా చెప్పదలచుకున్నది చెపుతూ జనంలోకి బాగానే వెళ్ళిపోయాయి. షర్మిల నాడు చేసిన పాదయాత్ర వైసీపీకి ఎంతగానో ఉపయోగపడింది. జగన్ తరువాత దాన్ని చక్కగా మలచుకుని ఏపీలో ఢీ అంటే ఢీ అనే వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగారు. అటువంటి షర్మిళ ఇపుడు మళ్ళీ తెర మీదకు వచ్చారు. ప్రత్యర్ధి టీడీపీని ఈ బాణం గుచ్చుకుంటుందా.


ఎన్నిక అస్త్రమా :


ఏపీలో వచ్చే ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవడానికి సిధ్ధపడుతున్న వైసీపీ అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది. ఈ నేపధ్యంలో హటాత్తుగా ఆయన సోదరి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపైన అసత్య ప్రచారం సాగుతోందని ఆమె పేర్కొన్నారు. అధికార టీడీపీ ప్రోత్సాహం ఉందని కూడా ఆమె ఆరోపించారు. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా రాజుకున్నాయి. ఇన్నాళ్ళు తెర వెనక ఉన్న షర్మిల ఇలా ఒక్కసారి బయటర్కు రావడం వెనక పెద్ద వ్యూహమే వుందనుంటున్నారు. 
ఆమె రేపటి ఎన్నికల్లో పోటీ చేస్తారా లేక విస్త్రుతంగా ప్రచారం చేస్తారా అన్నది ఇపుడు చర్చగా ఉంది. ఏది ఏమైనా అగ్నికి వాయువు తోడు అయినట్లుగా జగన్ కి షర్మిల ఇపుడు తోడు అవుతారని అంటున్నారు. ఆమె వాడి వేడి ప్రసంగాలు, మహిళలపైన తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని అంటున్నారు. దానికి నాందిగా ఆమె ఫిర్యాదు ని చూస్తే మొత్తం మహిళలను కించపరచేలా చేస్తునారంటూ టీడీపీపై విరుచుకుపడిన తీరు రేపటి యుద్ధానికి రెడీ అన్నట్లుగానే ఉంది. చూడాలి ఏం జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: