తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అంతా రాజకీయ చాణక్యుడు అని పిలుస్తారు. ఆయన రాజకీయం చేస్తే తిరుగు ఉండదని అంటారు. చంద్రబాబు ఆచీ తూచీ అడుగువేస్తారని, తొందర పడరని కూడా పేరుంది. అటువంటి చంద్రబాబు వేసిన ఓ స్టెప్ ఇపుడు కలవరపెడుతోందా..

మోడీతో ఢీ :


2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీతో జట్టు కట్టడం పెద్ద ఇంటెరెస్టింగ్ పాయింట్ అయింది. ఎందుచేతనంటే ఇదే నరేంద్ర మోడీని బాబు అరెస్ట్ చేయాలని వాజ్ పేయి ప్రధానిగా ఉన్న కాలంలో డిమాండ్ చేశారు. ఆయన్ని హైదరాబాదు రానివ్వమని కూడా గట్టిగా ప్రకటించారు. గోద్రా అల్లర్ల నేపధ్యంలో చంద్రబాబు మోడీపై ఆ రోజుల్లో చాలా దారుణంగా విరుచుకుపడ్డారు. ఓ దశలో మోడీ ఉంటే తాను కేంద్రానికి మద్దతు ఇవ్వనని కూడా ఖరా ఖండీగా చెప్పేశారు.


అటువంటిది మోడీతో బాబు జత కలిసారంటేనే అది ఓ సెన్సేషన్ అయింది. దాంతో చాలా మంది ఆశ్చర్య‌పోయారు కూడా. కానీ రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు కనుక ఈ కలయికను ఎవరూ తప్పు పట్టలేకపోయారు. ఓ విధంగా బాబు తెలివైన నిర్ణయం తీసుకున్నారని కూడా అంతా అన్నారు. అప్పటికి ఏపీలో బీజేపీ బలం పెరుగుతోంది. అదే సమయంలో టీడీపీ బలహీనంగా  ఉంది. వైసీపీ దూకుడు ఓ రేంజిలో ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే బాబు మోడీ జోడీ అన్నది ఏపీలో హాట్ టాపిక్ అయింది. అదే సూపర్ హిట్ కూడా అయింది.


ఇది కూడా షాకే :


ఇక నాలుగేళ్ళ పాటు టీడీపీ, బీజేపీ చెలిమి కేంద్రంలో, రాష్ట్రంలో కొనసాగింది. అయితే రెండు పార్టీలు విడిపోవడం మాత్రం షాకింగ్ డెసిషన్ అని చెప్పాలి. ఎందుచేతనంటే  ఎవరూ ఇది కూడా ఊహించలేకపోయారు. కేంద్రంలో రెండవమారు కూడా మోడీ ప్రధాని కావాలని బాబు గట్టిగా కోరుకున్నారు. ఏపీలో కూడా మరో మారు టీడీపీ వస్తుందని బీజేపీ నేతలు చెప్పేవారు. మరి జగన్ పాదయాత్ర మహిమో, లేక విపక్షాలు కలసి సంధించిన పద్మవ్యూహమో తెలియదు కానీ బాబు ఆ ట్రాప్ లో చిక్కుకున్నారు. 


ప్రత్యేక హోదా అన్న ఓ బ్రహ్మ పదార్ధాన్ని పట్టుకుని మోడీ కూటమికి గుడ్ బై కొట్టేశారు. పోనీ బయటకు వచ్చాక ఆ హోదా ఏమైనా టీడీపీకి రాజకీయ మైలేజ్ ఇచ్చిందా అంటే అదీ లేదు. ధర్మ పోరాట దీక్ష‌లకు  ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదు. మరో వైపు విలువైన చివరి ఏడాది కేంద్రం నుంచి బయటకు రావడం వల్ల టీడీపీ రాజకీయంగా నష్టపోయిందన్న మాట కూడా వినిపిస్తోంది. అంత కంటే కూడా ఏపీ నష్టపోయిందని కూడా లెక్కలు  చెబుతున్నాయి.


మళ్ళీ మోడీయేనా :


ఇక మోడీ నుంచి విడిపోయి బాబు సాధించింది కూడా రాజకీయంగా ఏమీ లేదు. కేంద్రంలో మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ తో బాబు కలసినా అది నష్టమే తెచ్చింది తప్ప ఏమీ ప్రయోజనం సమకూరలేదు. తెలంగాణాలో లిట్మస్ టెస్ట్ కింద భావించి కాంగ్రెస్ టీడీపీ పోటీ చేస్తే జనం తిప్పికొట్టారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గ్రాఫ్ పెద్దగా పెరగలేదు. ఇప్పటికీ ప్రధానిగా మోడీనే జనం ఎంచుకుంటున్నారని సర్వేలు సూచిస్తున్నాయి. 


మరో వైపు దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలు సైతం రాహుల్ మీద విశ్వాసం ఉంచలేకపోతున్నాయి. దానికి ఉత్తరప్రదేశ్ పొత్తులు ఒక ఉదాహరణ. అలాగే మరో పెద్ద పార్టీ త్రుణమూల్ కాంగ్రెస్ సైతం రాహుల్ గాలి సోకనీయడం లేదు. ఈ పరిస్థితుల్లో చీలికల పేలికల విపక్షాలు మోడీని ఢీ కొట్టడం అంటే మాటలు కానే కాదు. ఆ విషయం ఇపుడు అందరి కంటే చంద్రబాబుకు బాగా అర్ధం అవుతోంది కూడా.


అస్త్రాలతో సిధ్ధం :


ఇక చివరాఖరి ఏడాదిలో మోడీ అనేక అస్రాలతో సిధ్ధంగా ఉన్నారు. అందులో మొదటికి బయటకు తీసారు. అగ్ర వర్ణాలకు పది శాతం రిజర్వేషన్లు తో మోడీ ఎన్నికల్లో భారీగా రజాకీయ లాభాన్ని కొల్లగొడతారన్నది నిజం. అలాగే అత్యంగ వెనకబడిన వర్గాలకు, షెడ్యూల్డు కులాల విభజనతో పాటు, రైతులను పెద్ద పధకాలు ఇలా అనేక అస్త్రాలను మోడీ ఇపుడు బయటకు తీయబోతున్నారు. దేశంలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే మెజారిటీకి కొద్ది దూరంలోనే బీజేపీ ఉంటుందని సర్వేలు అంటున్నాయి.


 ఆ కొద్ది పాటి సీట్లు భర్తీ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఏ విధంగా చూసుకున్నా మరో మారు ప్రధానిగా మోడీ రావడం ఖాయంగా కనిపిస్తున్న వేళ చంద్రబాబు రాంగ్ స్టెప్ వేశారా అన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా మళ్ళీ మోడీతో బాబు చేతులు కలిపేందుకు తెర వెనక పావులు కదుపుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. బాబు రెడీ అయినా అందుకు మోడీ ఒప్పుకోవాలిగా. చూడాలి మరి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: