షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో ఏపి రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఇద్దరినీ ఒకే దెబ్బ కొట్టటానికి బహుశా జగన్మోహన్ రెడ్డి గట్టి వ్యూహమే పన్నుతున్నట్లున్నారు. ఈరోజు టిఆర్ఎస్ నేతలతో భేటీ అవుతున్నారు. తెలంగాణా ఎన్నికలు అయిన దగ్గర నుండి చంద్రబాబంటేనే కెసియార్ మండిపడుతున్న విషయం తెలిసిందే. తెలంగాణాలో అయ్యేది లేదు వచ్చేది లేదని తెలిసినా  తెలంగాణా ఎన్నకల్లో చంద్రబాబు వేలుపెట్టి చెత్త నెత్తినేసుకున్నారు. కెసియార్ ను ఏదో  చేసేద్దామన్న ఉద్దేశ్యంతో బద్దశతృవు కాంగ్రెస్ తో సైతం చేతులు కలిపారు. కాంగ్రెస్, టిడిపి పొత్తు పెట్టుకుని ఇద్దరు ముణిగారు.

 

అప్పటి నుండి చంద్రబాబును ఏపిలో దెబ్బ కొట్టాలనే కోరిక కెసియార్ లో బలంగా పెరిగిపోయింది. అందుకే ఏపి ఎన్నికల్లో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కెసియార్ పదే పదే చెబుతున్నారు. అయితే, రిటర్న్ గిఫ్ట్ ఎవరి ద్వారా పంపాలి ? కెసియార్ ను వేధిస్తున్న ప్రశ్న ఇదే. కెసియార్ ముందున్న అవకాశాలు రెండే. మొదటిది జగన్ తో చేతులు కలపటం, రెండోది పవన్ ను ముందు పెట్టుకుని చంద్రబాబును దెబ్బ కొట్టటం. పవన్ ను నమ్మేందుకు లేదన్న విషయం కెసియార్ కు బాగా తెలుసు. అందుకే జగన్ తో పొత్తు పెట్టుకునేందుకు కెసియర్ పావులు కదుపుతున్నారు.

 

 జగన్ తో పొత్తు పెట్టుకోవాలంటే మందు కామన్ ప్లాట్ ఫారం అవసరం. అందుకే ఫెడరల్ ఫ్రంట్ లోకి జగన్ ను కెసియార్ ఆహ్వనిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు జగన్ తో భేటీకి కెసియార్ ముగ్గురు నేతలను పంపుతున్నారు. నిజానికి ఫెడరల్ ఫ్రంట్ అన్నది ఇఫ్పటికైతే కేవలం ఊహాజనితం మాత్రమే. కాంగ్రెస్, బిజెపియేతర పార్టీలతో జాతీయ స్ధాయిలో ప్రత్యామ్నాయాన్ని తీసుకురావాలన్నది కెసియార్ ఆలోచన. అయితే, జాతీయ స్ధాయిలో కెసియార్ ప్రయత్నాలకు పెద్దగా ఎవరూ కలసిరావటం లేదు. సరే ఫ్రంట్ సంగతి ఏమవుతుందన్నది వేరే సంగతి. ముందైతే కెసియార్, జగన్ కు కామన్ శతృవు చంద్రబాబును దెబ్బకొట్టాలంటే పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఒకటి కావటం తప్పదు కదా ?

 

పైగా తనను దెబ్బకొట్టటానికి జగన్, కెసియార్ ఏకమవుతున్నారంటూ చంద్రబాబు ఎప్పటి నుండో ఆరోపిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబుపై కక్షతోనే కెసియార్, జగన్ ఏకమవుతున్నారంటూ పవన్ కూడా మండిపడుతున్నారు. అంటే పవన్ వైఖరేంటో ఇంత వరకూ స్పష్టం కాలేదు లేండి. జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని చెబుతునే మరోవైపు చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడటం పవన్ కే చెల్లింది. అందుకే పవన్ ను ఎవరూ నమ్మటం లేదు. బహుశా ఎన్నికలు దగ్గర పడిన తర్వాత చంద్రబాబు, పవన్ మళ్ళీ ఏకమైనా ఆశ్చర్యపోవక్కర్లేదు.

 

జగన్ లో కూడా అదే అనుమానం ఎప్పటి నుండో ఉంది. అందుకే ముందుజాగ్రత్తగా ఓ బలమైన మిత్రుడి అవసరం ఉందని జగన్ గ్రహించినట్లున్నారు. అందుకనే టిఆర్ఎస్ ప్రతినిధులతో బేటకి జగన్ సానుకూలంగా స్పందించారు. మరి జగన్ ఫెడరల్ ఫ్రంట్ లో చేరుతారా ? ప్రత్యక్షంగా కెసియార్ సాయం అందుకుంటారా ? లేకపోతే ఏపి ఎన్నికల తర్వాతే నిర్ణయం తీసుకుంటానని చెబుతారా ? అన్న విషయాలపై వైసిపిలో చర్చలు ఊపందుకున్నాయి. సరే చంద్రబాబుకు వ్యతిరేకంగా తాను ఏపి ఎన్నికల్లో జగన్ కు మద్దతుగా ప్రచారం చేస్తానని ఎంఐఏం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసి ఇప్పటికే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి జగన్ తీసుకోబోయే ఏ నిర్ణయమైనా రేపటి ఎన్నికల్లో కీలకమవుతుందనటంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: