వైసీపీ అధినేత జగన్ ఇప్పటి వరకూ ఒంటరి పోరు మాత్రమే చేస్తూ వచ్చారు. ఆయన కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత పార్టీ పెట్టుకున్న తరువాత ఎవరూ లేకుండానే రాజకీయాల్లో నెట్టుకు వస్తున్నారు. పొత్తుల విషయంలో మొదటి నుంచి జగన్ వ్యతిరేకంగానే ఉన్నారు. సొంత బలంపైన నమ్మకంతో పాటు, ఒకరి భుజాలపై ఎక్కి అందలం ఎక్కాలని లేదన్న సిధ్ధాంతానికి కట్టుబడి జగన్ తనదైన రాజకీయాలు చేస్తూ వస్తున్నారు.


ఫెడరల్ ఫ్రంట్లో :


ఈ నేపధ్యంలో జగన్ని ఫెడరల్ ఫ్రంట్ లో చేర్చుకోవాలని టీయారెస్ అధినేత కేసీయార్ ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంపై చాన్నాళ్ళుగా ప్రచారం సాగుతున్నా ఇందుకు ముహూర్తం మాత్రం ఈ రోజు ఫిక్స్ అయింది. ఈ రోజు హైదరాబాద్ లో కేసీయార్ తరఫున ఆయన కుమారుడు, టీయారెస్ ఫర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ జగన్ తో భేటీ అవుతారని అంటున్నారు. ఈ భేటీలో అనెక జాతీయ రాజకీయాలు ప్రస్తావనకు రావడంతో పాటు, ఫెడరల్ ఫ్రంట్ లో జగన్ పాత్ర గురించి కూడా క్లారిటీ వస్తుంది. 
మరి జగన్ ఫ్రంట్ లో చేరే విషయంపై ఏం చెబుతారన్నది ఆసక్తికరమైన పరిణామంగా ఉంది. ఓ విధంగా ఈ పరిణామం జాతీయ, ప్రాంతీయ రాజకీయాల్లోనూ సంచలన‌మే అవుతుంది. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్, బీజేపీ కూటములు మాత్రమే ఉన్నాయి. ఏపీ సీఎం కాంగ్రెస్ కూటమిలో ఉన్నారు. ఇపుడు జగన్ ఫెడరల్ ఫ్రంట్ లో చేరితే ఏపీ రాజకీయాలే కాదు, జాతీయ స్థాయిలోనూ ఆ ప్రభావం గణనీయంగా  ఉంటుంది.


లాభమేనా :


ఫెడరల్ ఫ్రంట్ లో జగన్ చేరడం వల్ల ఇప్పటికి ఇపుడు ఏం లాభం జరుగుతుందన్నది చర్చగా ఉంది. జగన్ కి ఏపీలో పొత్తు పెట్టుకోవడానికి ఫెడరల్ ఫ్రంట్ లో పార్టీలేవీ లేవు కూడా. పైగా ఉమ్మడి ఏపీని విడగొట్టిన పార్టీగా టీయారెస్ ని జనం చూస్తే మాత్రం అది జగన్ కి మైనస్ అవుతుంది. ఆ విధంగా  ప్రచారం చేసేందుకు టీడీపీ రెడీగా ఉంటుంది కూడా. జనసెనాని పవన్ అపుడే కేసీయార్ జగన్ దోస్తీపై సెటైర్లు కూడా వేశారు. మరి ఇది వికటిస్తే మాత్రం జగన్ కి ఎన్నికల ముందు నష్టం తప్పదు. 
అదే సమయంలో కలిస్తే మాత్రం కేసీయార్ వ్యూహాలు, ఆయన మందీ మార్బలం కూడా జగన్ విజయానికి తోడు అవుతాయన్న వాదనలూ ఉన్నాయి. ఏపీలో బాబును ఎదుర్కోవడానికి జగన్ చరిస్మా ఒక్కతే సరిపోదని 2014 ఎన్నికలు నిరూపించాయి, ఎత్తులు పై ఎత్తులు వేయాలంటే కేసీయార్ లాంటి వ్యూహకర్త అండ దొరికితే జగన్ కి ఏపీలో విజయం దక్కడం సులువు అవుతుందన్న మాట కూడా వినిపిస్తోంది. మొత్తానికి జగన్ ఏం ఆలొచిస్తారన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: