అవును చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కలవటమే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది. అలా వాళ్ళిద్దరూ కలిస్తేనే రాబోయే ఎన్నికల్లో జగన్ పాదయాత్రకు ఫలితం కనబడుతుంది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబు, పవన్ కలిసే అవకాశాలు మెరుగవుతున్నాయి. మొన్నటి వరకు ఇదే చంద్రబాబు అదే పవన్ ను నరేంద్రమోడితో కుమ్మక్కైనట్లు ఆరోపించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా ? ఎవరితోనో ఒకరితో పొత్తు లేకుండా సైకిల్ ముందుకు నడవదు. అందుకనే వ్యూహాత్మకంగానే పవన్ పై ఆరోపణలు, విమర్శలను చంద్రబాబు అండ్ కో తగ్గించేశారు. అందుకు తగ్గట్లుగానే జనసేన అధినేత పవన్ కూడా చంద్రబాబును వెనకేసుకొస్తున్నారు. ఇదంతా చూస్తుంటే మళ్ళీ టిడిపి, జనసేన పొత్తు పొడిచేట్లే ఉందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

  

సరే ఆ విషయాన్ని పక్కనపెడితే జగన్ మళ్ళీ ఇద్దరితో పోరాటం చేయాల్సుంటుంది. అందుకు జగన్ కూడా సిద్ధంగానే ఉన్నట్లున్నారు. నిజానికి జగన్ కు కావాల్సింది కూడా చంద్రబాబు, పవన్ మళ్ళీ పొత్తు పెట్టుకోవటమే. ఎందుకంటే, అప్పుడుగానీ జనాలు కొర్రుకాల్చి చంద్రబాబుతో పాటు పవన్ కు కూడా వాతలు పెట్టటం ఖాయం. పోయిన ఎన్నికల్లో అధికారంలోకి రావటమే లక్ష్యంగా చంద్రబాబు నోటికొచ్చిన హామీలను ఇచ్చేశారు. తానిస్తున్న హామీలు ఆచరణ సాధ్యమా కావా అని కూడా చంద్రబాబు ఆలోచించలేదు.

 

అటువంటి హామీల్లో ప్రధానమైనవి రైతు రుణమాఫీ, కాపులకు బిసి రిజర్వేషన్ వర్తింపచేయం, నిరుద్యోగ భృతి, డ్వాక్రా రుణాలమాఫీ. పోయిన ఎన్నికల్లో తానిచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. పైగా తానిచ్చిన హామీల్లో 98 శాతం నెరవేర్చినట్లు ప్రకటనలు ఇచ్చుకుంటూ జనాలను మభ్య పెడుతున్నారు. అటువంటి హామీల్లో రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి, కాపులకు బిసి రిజర్వేషన్ హామీల వైఫల్యం టిడిపిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కాపులకు బిసి రిజర్వేషన్ వర్తింపు హామీ ఫెయిల్యూర్లో చంద్రబాబుతో పాటు పవన్ కు కూడా బాధ్యతుంది. ఎందుకంటే, తనను చూసే కాపులంతా పోయిన ఎన్నికల్లో టిడిపికి ఓట్లేశారని పవనే చాలా సార్లు చెప్పుకున్నారు. మరి కాపులకు చంద్రబాబు చేసిన మోసంలో పవన్ పాత్ర కూడా ఉన్నట్లే లెక్క.

 

రానున్న ఎన్నికల్లో జనసేనది ఒంటరి పోరే అని ఇఫ్పటికే చాలాసార్లు చెప్పి మళ్ళీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే పవన్ ను కాపు సామాజికవర్గం నమ్మదు. చిత్తశుద్దితో ఒంటరిగా పోటీ చేస్తే కనీసం ఓ 15 సీట్లన్నా వచ్చే అవకాశం ఉంది. అదే చంద్రబాబుతో కలిస్తే వస్తాయనుకుంటున్న సీట్లు కూడా రావని కాపు నేతలే అంటున్నారు. మొన్నటి వరకూ చంద్రబాబును కాపు జాతి ద్రోహిగా చిత్రీకరించిన వారు పవన్ కూడా ద్రోహిగానే చిత్రీకరించాల్సుంటుంది.  అదే జరిగితే అపుడు కాపుల ఓట్లు కూడా పవన్ కు పడేది డౌటే. అపుడు పవన్ కు అభిమానులు తప్ప ఓట్లు ఎవరేస్తారు ?

 

అందుకే వాళ్ళిద్దరూ కలిస్తేనే జగన్ కు మేలు జరుగుతుంది. ఎలాగంటే, చంద్రబాబు, పవన్ విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు జగన్ తో పాటు పవన్ కూడా ఎంతో కొంత చీల్చుకుంటారు. అదే చంద్రబాబు, పవన్ ఏకమైతే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో ఎక్కువ శాతం జగన్ కే పడుతుందనటంలో అనుమానం లేదు. పైగా పవన్ కు చంద్రబాబు 25 అసెంబ్లీలు, మూడు లోక్ సభ సీట్లు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అంటే జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తే అదంతా జగన్ కే అడ్వాంటేజ్ గా మారే అవకాశాలున్నాయి. అంటే, ఒకవైపు 22 ఫిరాయింపు నియోజకవర్గాలు మరోవైపు జనసేనకు ఇస్తారనుకుంటున్న 25 అసెంబ్లీలు కలిపి 47 నియోజకవర్గాల్లో వైసిపి ఎన్ని గెలుస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: