మ‌రో మాజీమంత్రి సైకిలెక్క‌డం ఖాయ‌మైందా?  వైఎస్ బ‌ద్ధ‌ వ్య‌తిరేకి అయిన ఆయ‌న చేరిక‌కు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌చ్చ‌జెండా ఊపేశారా?  ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఆఫ‌ర్‌ను తిర‌స్కరించి మ‌రీ ఆయ‌న పసుపు కండువా క‌ప్పుకునేందుకు సిద్ధ‌మ‌య్యారా? అంటే అవున‌నే అంటున్నారు ఆయ‌న అనుచ‌రులు! ఏపీలో రాజ‌కీయ వ్యూహాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా 2014లో కాంగ్రెస్ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నాయ‌కులు యాక్టివ్ అయ్యేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే! ఇప్ప‌టికే కొంద‌రు ఎవ‌రో ఒక‌రి చెంత‌కు చేరిపోగా.. మిగిలిన వారు నేత‌ల‌తో సంప్ర‌దింపులు చేస్తున్నారు. ప్ర‌స్తుతం మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రా రెడ్డి కూడా ఈ జాబితాలోనే ఉన్నారు. క‌డ‌ప జిల్లాకు చెందిన ఆయ‌న‌.. టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖ‌రారు అయింద‌ని తెలుస్తోంది. దీంతో క‌డ‌ప జిల్లాలో ప్ర‌తిప‌క్ష నేత‌కు ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్టే క‌నిపిస్తోందంటున్నారు విశ్లేష‌కులు. 


వైఎస్‌, డీఎల్.. ఒకే జిల్లాకు చెందిన నేత‌లు! కానీ ఇద్ద‌రివీ భిన్న ధృవాలు. ఉప్పూ-నిప్పులా ఇద్ద‌రూ వ్య‌వ‌హ‌రించేవారు. ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత‌గా ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు పొడ‌చూపేవి! ఒక‌రు రైట్ అంటే.. మ‌రొక‌రు లెఫ్ట్ అనే ర‌కం. ముఖ్యమంత్రి స్థాయిలో వైఎస్ తీసుకునే నిర్ణ‌యాల‌ను బ‌హిరంగంగానే డీఎల్ వ్య‌తిరేకించే వారు! అధిష్ఠానం ఇద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య కుదిర్చేందుకు ప్ర‌య‌త్నించినా.. అవేమీ ఫ‌లించేవి కావు! దీంతో కాంగ్రెస్‌లో వైఎస్ బ‌ద్ద వ్య‌తిరేకిగా డీఎల్‌పై ముద్ర‌ప‌డింది. అనంత‌రం జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాలు.. విభ‌జ‌నతో ఆయ‌న పూర్తిగా రాజ‌కీయాల‌కు ఆయ‌న‌ దూర‌మ‌య్యారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో మరోసారి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు డీఎల్‌ సిద్ధమయ్యారు. ఆయన టీడీపీ, వైసీపీల్లో ఏ పార్టీలోకి చేరుతారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి.


ఆయ‌న వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. డీఎల్ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని. కానీ మైదుకూరు ఎమ్మెల్యే టికెట్‌ మాత్రం ఇవ్వలేనని జగన్‌ స్పష్టం చేశారు. ఆయ‌న‌ పార్టీలోకి వస్తే ఎమ్మెల్సీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపార‌ట‌. అయితే జగన్‌ ఆఫర్‌పై ఆ వెంటనే స్పందించిన డీఎల్.. గౌరవపద్రంగా ఆహ్వానించే పార్టీలోకి వెళ్తాను గానీ,  ఎమ్మెల్సీ ఇస్తామన్న మాత్రాన తాను అంగీకరించే వ్యక్తిని కాద‌ని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయ‌న టీడీపీలో చేరేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. అమరావతిలో చంద్రబాబును కలిశారు. పార్టీలో చేరితే తగిన ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో డీఎల్ త్వరలోనే టీడీపీలో చేరడం ఖాయమైంది. మంచి రోజు చూసుకుని ఆయన టీడీపీలో చేరనున్నారు. 


జ‌గ‌న్ సొంత జిల్లాలో బ‌ల‌ప‌డాల‌ని చంద్ర‌బాబు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే సీనియ‌ర్ నాయ‌కులు చేరితే పార్టీకి అద‌న‌పు బ‌లం చేకూరుతుంద‌ని భావించిన ఆయ‌న‌.. డీఎల్ రాక‌కు వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని తెలుస్తోంది. అయితే మైదుకూరు టీడీపీ టికెట్ కోసం టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈనేపథ్యంలో టికెట్ డీఎల్‌కు దక్కుతుందా. లేక పుట్టాకే తిరిగి ఇస్తారా అనేది మ‌రి కొద్ది రోజులు అయితే గాని తెలియ‌దు! 


మరింత సమాచారం తెలుసుకోండి: