తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహాకూటమిగా ఏర్పడి దారుణమైన ఓటమి చవిచూసింది.  అధికార పార్టీని ఓడించాలనే లక్ష్యంతో టీటీడిపి, టీజేఎస్, సిపిఐ తో కలిసి మహాకూటమిగా ఏర్పడింది.  ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగించింది.  కానీ ఫలితాలు మాత్రం దారుణంగా వచ్చాయి..అధికార పార్టీకే ప్రజలు జై కొట్టారు.  ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయగా ఆయన ప్రత్యర్థిగా వంటేరు ప్రతాప్ రెడ్డి నిల్చున్న విషయం తెలిసిందే.  ఆ సమయంలో కేసీఆర్ పై ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు వంటేరు.  ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి కొంత మంది కాంగ్రెస్ అభ్యర్థులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. 

ఈ నేపథ్యంలో తాను తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)లో చేరుతున్నట్లు కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ లో చేరుతున్నానన్నారు.  తెలంగాణలోని గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి మూడుసార్లు పోటీ చేసిన వంటేరు రెండో స్థానంతోనే సరిపెట్టుకున్నారు. నేడు మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్  కండువ కప్పుకున్నారు. 

ఈ సందర్బంగా వంటేరు మాట్లాడుతూ... గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నానని ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు.  తెలంగాణ ప్రజలు కోరుకున్న విధంగా కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారని..ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు విజయం లభించిందని చెప్పారు. తెలంగాణ ప్రజలు  టీఆర్ఎస్ సర్కారే మళ్లీ కావాలని కోరుకున్నారు కనుక తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేకపోయామని అన్నారు. టీఆర్ఎస్ లో చేరి ప్రజలు కోరుకునే విధంగా పనిచేస్తానని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: