నవ్యాంధ్రలో కూడా మూడు ప్రధాన ప్రాంతాలు ఉన్నాయి. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడ తేడా కొట్టినా అధికార పీఠానికి దూరమైపోవడం ఖాయం. సీమ ప్రాంత వాసులకు మిగిలిన వారితో పోలిస్తే విభజన గాయాలు ఇంకా బాధిస్తూనే ఉన్నాయి. వారిది కూడా అచ్చం తెలంగాణా మాదిరిగా నీరు, ఉపాధి, అస్తిత్వ పోరాటమే. 


జగన్ కి ఇబ్బందులేనా :


రాయలసీమలో గతసారి వైసీపీకి మెజారిటీ సీట్లు వచ్చాయి. ఒక్క అనంతపురం తప్ప మిగిలిన కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాల్లో   వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయిదేళ్ల తరువాత చూసుకుంటే ఇపుడు ఆ పరిస్తితి ఉంటుందా అన్నది చూడాలి. చంద్రబాబుపై సహజంగానే సీమ ప్రాంత వాసులు ఆగ్రహంగా ఉన్నారు. ఆయన అన్నీ  తీసుకుపోయి కోస్తాలోనె పెడుతున్నారని, సీమలో పుట్టి కూడా ఏ మాత్రం పట్టించుకోవడంలేదని. ఇపుడు జగన్ విషయంలో ఉన్న సానుకూలతను కోరి చెడగొట్టుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది. ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేసీయార్ తో దోస్తీ కట్టడాన్ని సీమప్రాంత వాసులు భిన్నగా స్పందించడమే ఇందుకు కారణం.


సీమ ప్రాంతాలకు దక్కాల్సిన నీటి వనరుల విషయంలో తెలంగాణా చేస్తున్న దాష్టికం, పోతిరెడ్డిపాడు, ఆఋఈఎస్, హంద్రీ నీవా వంటి పాజెక్టులకు కేసీయార్ మోకాలడ్డడం వంటివి ఇపుడు ఈ కొత్త బంధానికి గుదిబండ కానున్నాయి. జగన్ తెలిసి చేశారా తెలియక చేశారా  అన్నది  పక్కన పెడితే విభజన కాలం నాటి నుంచి తెలంగాణ రాయలసీమకు చేసీ, చేస్తున్న అన్యాయంపైన సీమ గరం గరం గా ఉంది. అసలు విభజన టైంలో రాయల సీమను కూడా కలుపుకోమని ప్రతిపాదనలు వచ్చినా కేసీయార్ తిరస్కరించారు. రేపటి రోజున కూడా కేసీయార్ కి పెత్తనం ఇస్తే సీమ ప్రాజెక్టులకు గండి కొడతారన్న భయం కూడా వారిలో ఉంది. మొత్తం మీద చూసుకుంటే జగన్ కేసీయార్ బంధం వల్ల సీమలో వ్యతిరేకత ఉందని అంటున్నారు. మరి అధికారంలోకి రావాలని భావిస్తున్న జగన్ తన పట్టుని ఇక్కడే నిలుపుకోలేకపోతే అది అసాధ్యమేనని కూడా చెబుతున్నారు.


ప్రచారం షురూ:


ఇక సీమ జిల్లాలతో పాటు ఏపీకి కూడా కేసీయార్, జగన్ బంధం వల్ల తీరని అన్యాయం జరుగుతుందని ఇప్పటికే టీడీపీ ప్రచారం ప్రారంభించింది. దానికి తోడు అన్నట్లుగా కాంగ్రెస్ కూడా ఈ రెండు పార్టీల పొత్తును తిట్టిపోస్తోంది. అదే విధంగా వామపక్షాలు కూడా గుర్రుమంటున్నాయి . నిజానికి జగన్ కి ఈ పొత్తు వల్ల ఒనగూడేది పెద్దగా లేకపోయినా ఎందుకు ఒప్పుకున్నారన్న చర్చ కూడా వైసీపీలో జరుగుతోంది. ఎటు నుంచి ఎలా చూసుకున్నా ఇది తొందరపాటు నిర్ణయమేనని కూడా ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికైనా జగన్ సమీక్షించుకుంటే బాగుంటుందని కూడా సూచిస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: