ఏపీ రాజకీయాలు  ఓ రేంజిలో వేడెక్కుతున్నాయి. అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ దూకుడు పెంచాయి. రానున్న ఎన్నికల్లో గెలిచేందుకు ఎవరికి వారు పదునైన వ్యూహాలను రచిస్తూ రంగంలోకి దిగుతున్నాయి. ఓ వైపు ఏపీలో చంద్రబాబు ముగ్గురు మోడీలు అంటూ తిట్ల పురాణం లంకించుకోవడం ఆసక్తికరంగా మారుతోంది.


పవన్ పై ప్రేమేనా :


ఈ నేపధ్యంలో కావాలనే చంద్రబాబు పవన్ని విమర్శించకుండా పక్కన పెడుతున్నారు. ఇది గత కొంతకాలంగా జరుగుతోంది. చంద్రబాబు వ్యూహాత్మకంగా జనసేనానిని తమ పార్టీ వైపుగా కలిపేసుకుంటున్నారు. మొదట్లో ఓపెన్ గా పిలుపు ఇచ్చి పవన్ని తమతో కలసి రమ్మన్నారు. దానికి ట్విట్టర్ ద్వార బదులిచ్చిన పవన్ తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకోమని చెప్పేశారు. అయినా తెలియని  బంధమేదో కొనసాగుతోందా అన్న అనుమానాలు కలిగించేలా చంద్రబాబు ప్రసంగాలు ఉంటున్నాయి. సహజంగానే పవన్ పొత్తులకు నో అన్నపుడు బాబు వెంటనే ఆయన మీద కూడా విరుచుకుపడాలి. కానీ ఆయన్ని పక్కన పెట్టి ముగ్గురు మోదీలు అంటూ కేసీయార్, మోడీ, జగన్ పైనే తిట్ల పురాణం వల్లె వేస్తున్నారు. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తావిస్తోంది.


మౌనంగా పవన్ :


ఈ రకమైన ప్రచారం ఏపీలో సాగుతున్న జనసేనాని మాత్రం మౌనగానే ఉంటున్నారు. ఓ వైపు టీడీపీ ఎమ్మెల్యే బోడా ఉమామహేశ్వరరావు వంటి వారు కూడా పవన్ని కలసి రమ్మని పిలుస్తున్నారు. మరో వైపు చంద్రబాబు ఏకంగా కలిపేసుకునే ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్తితుల్లో పవన్ మాత్రం ఏ రకంగానూ స్పందించకపోవడం పట్ల పెద్ద చర్చే సాగుతోంది. పవన్ మళ్ళీ టీడీపీతో కలసి పోటీ చేస్తారా అన్న అనుమానాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి.


నష్టమే మరి :


ఒకవేళ పవన్ కి అటువంటి ఆలోచన లేకపోతే చంద్రబాబు పై ఘాటు విమర్శలు చేయాలి. అదే సమయంలో ఈ పొత్తుల పిలుపులపైన కూడా గట్టిగానే నిలదీయాలి. కానీ పవన్ అవేమీ చేయకుండా ఉన్నారంటే అది వ్యూహాతమకమైన మౌనమా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఒకవేళ కాకపోతే  మాత్రం పవన్ కి పెద్ద నష్టమే బాబు తెచ్చిపెడుతున్నారనుకోవాలి. ఏపీ రాజకీయాల్లో మళ్ళీ రెండు పార్టీల పోరాటంగానే బాబు ఇపుడు రాజకీయ సీన్ ని మార్చేస్తున్నారు. పవన్ ఊసు లేకుండా ఆయన వేస్తున్న ఎత్తులు పవన్ పార్టీకి నష్టమే చేకూరుస్తాయని కూడా అంటున్నారు.
ఇక ఫెడరల్ ఫ్రంట్ పైన కూడా పవన్ మాట్లాడకపోవడం విశేషం. ఓ వైపు కేసీయార్, కేటీయార్ లతో పవన్ కి మంచి సానిహిత్యమే ఉంది. అందువల్లనే ఆయన అలా ఉంటున్నారా లేక నిజంగా ఆయన బాబు వైపు అడుగులు వేస్తున్నారా అన్నది అంతుపట్టడం లేదంటున్నారు. ఏదేమైనా మౌనంగా ఉండడం ద్వారా పవన్ ఏపీలో మూడవ ఫోర్స్ గా ఉన్న తన పార్టీకి నష్టమే తెచ్చుకుంటున్నారని అంటున్నారు. మరి పవన్ ఇకనైనా పెదవి విప్పుతారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: