ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డేందుకు రెండు నెల‌ల కంటే త‌క్కువ స‌మ‌యం ఉండ‌గానే.. వైసీపీలో రెండు కీలకమైన వికెట్లు ప‌డ‌బోతున్నాయా?  రాజ‌కీయంగా అత్యంత ప్ర‌భావితమైన ఈ జిల్లా నుంచి ఇప్ప‌టికే ఇద్ద‌రు ఎమ్మెల్యేలు సైకిలెక్కేయ‌గా.. మ‌రో ఇద్ద‌రు కూడా ఈ బాట‌లోనే న‌డ‌వబోతున్నారా?  సుదీర్ఘ పాద‌యాత్రను పూర్తిచేసి.. ఎన్నిక‌ల వ్యూహాలపై క‌స‌ర‌త్తులు ప్రారంభించిన ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌కు.. ఎన్నిక‌ల ముందు భారీ షాక్ త‌గ‌ల‌నుందా? అంటే అవున‌నే అంటున్నారు కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నాయ‌కులు!! టీడీపీకి కంచుకోట‌గా ఉన్న ఈ జిల్లాలో ప్ర‌స్తుతం రాజ‌కీయ ప‌రిస్థితులు వేడెక్కాయి. ఎన్నిక‌ల ఫీవ‌ర్ క్ర‌మ‌క్ర‌మంగా నాయ‌కుల్లో పెరుగుతుండ‌టంతో పాటు సీనియ‌ర్ నాయ‌కులు త‌మ వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నారు. అయితే వైసీపీకి చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు త్వ‌ర‌లో సైకిలెక్కేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నార‌నే గుస‌గుస‌లు జిల్లాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. 


గ‌త ఎన్నిక‌ల్లో కృష్ణా జిల్లాలో వైసీపీ త‌ర‌ఫున ఐదుగురు ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో పామ‌ర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్ప‌న, విజ‌య‌వాడ వెస్ట్ జ‌లీల్ ఖాన్‌, గుడివాడ కొడాలి నాని, నూజివీడు మేకా ప్ర‌తాప్ ప‌ప్పారావుతో పాటు తిరువూరు నుంచి కొక్కిలిగ‌డ్డ ర‌క్ష‌ణ‌నిధి ఉన్నారు. అయితే వీరిలో ఉప్పులేటి కల్ప‌న‌, జ‌లీల్ ఖాన్ ముందుగానే సైకిలెక్కేసిన విష‌యం తెలిసిందే! మిగిలిన ముగ్గురూ వైసీపీకి విధేయులుగా ఉంటూ వ‌స్తున్నారు. అయితే ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో.. వీరిలో ఇద్ద‌రు ఇప్పుడు టీడీపీలోకి జంప్ చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. మేకా ప్ర‌తాప్ పప్పారావుతో పాటు ర‌క్ష‌ణ‌నిధి సైకిలెక్కేస్తార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే వీరిని టీడీపీలో చేర్చే బాధ్య‌త‌ను జిల్లాకు చెందిన కీల‌క నేత విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌.


మేకా ప్ర‌తాప్ ప‌ప్పారావు ప్ర‌స్థానం టీడీపీలో మొద‌లైంది. త‌ర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ నుంచి ఒక‌సారి.. వైసీపీలో చేరి.. మ‌రోసారి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఇక ర‌క్ష‌ణ‌నిధితోనూ టీడీపీ నేత‌లు ట‌చ్‌లో ఉన్నార‌ట‌. అయితే పార్టీలో చేరితే వీరి టికెట్‌కు ఢోకా ఉండ‌ద‌ని, ప్ర‌స్తుతం ఉన్న స్థానాల నుంచే పోటీ చేయ‌వ‌చ్చ‌ని హామీ కూడా వీరికి ల‌భించింద‌ట‌.

ఈ వ్య‌వ‌హారంలో టీడీపీ కీల‌క నేత రాయ‌బారం న‌డిపిన‌ట్లు చెబుతున్నారు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డిన త‌ర్వాత‌.. వీరు సైకిలెక్కేయ‌చ్చ‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టికే దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయిన విష‌యం తెలిసిందే! అయితే ఉన్న ముగ్గురిలో ఇద్ద‌రూ సైకిలెక్కేస్తే.. ఇక మిగిలేది నాని ఒక్క‌డే! 



మరింత సమాచారం తెలుసుకోండి: