ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ బౌన్స‌ర్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.. యార్క‌ర్లు సంధిస్తున్నారు. ప్ర‌ధాని మోదీ.. గూగ్లీల‌తో బోల్తా కొట్టించాల‌ని చూస్తున్నారు. లెగ్ స్పిన్ మాయాజాలం చూపేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ రెడీ అయ్యారు. ఆఫ్ బ్రేక్‌లతో ఎలాగైనా పడ‌గొట్టాల‌ని త‌ల‌సాని, ఒవైసీ వంటి వారు ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు. ఇవ‌న్నీ ఎవ‌రిపై అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? ఇన్ని బంతులు ఎదుర్కోవాల్సిన ఒకే ఒక్క బ్యాట్స్‌మన్ ఏపీ సీఎం చంద్ర‌బాబు! త‌న 40 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఎన్న‌డూ లేనంత క‌ఠినాతి క‌ఠిన‌మైన ప‌రిస్థితులును ఆయ‌న ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. ఒక‌ప‌క్క ప్ర‌జ‌ల్లో అసంతృప్తి పెరుగుతోంద‌నే గుస‌గుస‌లు.. ప్ర‌తిప‌క్షానికి తోడ‌వుతున్న ఇత‌ర రాజ‌కీయ శ‌క్తులు.. విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు.. ఇలా ఒక‌టేమిటి అన్నీ క‌లిసి మూకుమ్మ‌డిగా దూసుకొస్తున్న వేళ‌.. చంద్ర‌బాబు సెంచ‌రీ కొడ‌తారా లేదా ముందుగానే ఔట్ అయిపోతారా? అనే ప్ర‌శ్న‌లు అందరిలోనూ వినిపిస్తున్నాయి!


పిచ్ ఏదైనా ఫ‌ర్వాలేదు! ఎలాంటి క‌ఠిన ప‌రిస్థితులు ఉన్నా లెక్కేలేదు! బౌన్స‌ర్లు దూసుకొస్తున్నా.. యార్క‌ర్ల‌తో భ‌య‌పెడుతున్నా.. లెగ్‌స్పిన్‌తో తిక‌మ‌క‌పెట్టినా.. ఆఫ్ బ్రేక్‌తో టెంప్ట్ చేసినా.. గూగ్లీల‌తో బోల్తా కొట్టించాల‌ని చూసినా.. స‌మ‌ర్థుడైన‌ ఆట‌గాడి ముందు ఇవ‌న్నీ గ‌డ్డిపోచ‌తో స‌మాన‌మే! మొన్న‌టివర‌కూ ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా ఇలాంటి ప‌రిస్థితుల‌నే ఎదుర్కొన్నారు. కానీ ఎన్నిక‌ల వ్యూహాల్లో ఆరితేరిన‌ అప‌ర చాణక్యుడిగా..  త‌న చ‌తుర‌త‌తో ఎన్నో క్లిష్ట‌మైన స‌మ‌యాల్లో పార్టీని గ‌ట్టెక్కించిన నాయ‌కుడిగా గుర్తింపు పొందిన ఆయ‌న‌కు 2019 ఎన్నిక‌లు పరీక్ష పెడుతున్నాయ‌న డంలో సందేహం లేదు. ఇప్ప‌టికే ఏపీలో ఇద్ద‌రు యువ‌ నాయ‌కులు ఆయ‌న‌తో పోటీకి సై అంటుంటే.. ఇప్పుడు `రిట‌ర్న్ గిఫ్ట్‌` ఇచ్చేందుకు పొరుగు రాష్ట్రం నేత‌లు సిద్ధ‌మ‌వుతున్నారు. 


2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎలాంటి వ్యూహాన్ని అనుస‌రిస్తార‌నేది స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌రంగా మారింది. మోదీ, జ‌గ‌న్‌, ప‌వ‌న్‌, కేసీఆర్‌, కేటీఆర్‌, ఒవైసీ, త‌ల‌సాని.. మ‌ధ్య‌లో చంద్ర‌బాబు!! ఏపీ రాజ‌కీయాల్లో క‌చ్చితంగా వేలు పెడ‌తామ‌ని చెప్పిన నాటి నుంచి.. తెలంగాణ‌ నేత‌ల దూకుడు మ‌రింత పెరిగింది. చంద్ర‌బాబుకు `రిట‌ర్న్ గిఫ్ట్` త‌ప్ప‌నిస‌రిగా ఇస్తామంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్ప‌డం.. అందుకు అనుగుణంగానే రాజకీయ ప‌రిస్థితులు చ‌క‌చ‌కా మారిపోవ‌డం.. టీడీపీ అధినేత‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మ‌జ్లిస్ అధినేత ఒవైసీ  కూడా `ఏపీకి వ‌స్తాం. జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తాం` అని ప్ర‌క‌టించేశారు. మ‌రోవైపు జ‌గ‌న్‌తో కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ భేటీ కావ‌డం కూడా రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. 


ఇప్ప‌టికే మిత్రుడైన ప‌వ‌న్‌.. ప్ర‌భుత్వంపై యుద్ధం ప్ర‌క‌టించేశాడు. ప్ర‌తిప‌క్ష నేత గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. మ‌రోప‌క్క మోదీ కూడా చంద్ర‌బాబుపై ఆగ్ర‌హంతో ఉన్నారు. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా నేరుగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.  దీంతో రాజ‌కీయంగా చంద్ర‌బాబు చుట్టూ రాజకీయ ప‌ద్మ‌వ్యూహం అల్లేశారు. దీని నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అభివృద్ధే ప్ర‌ధాన అస్త్రంగా చేసుకుంటున్నారు. అయితే ఎటూ క‌ద‌ల‌కుండా చుట్టూ ఫీల్డర్లు మోహ‌రించేసిన స‌మ‌యంలో.. ఆయ‌న వ్యూహాలు ఎంత‌వ‌ర‌కూ ఫ‌లితాన్నిస్తాయ‌నేది చ‌ర్చ‌నీయాంశం! 



మరింత సమాచారం తెలుసుకోండి: