తెలుగుదేశంపార్టీ, జనసేన మధ్య పొత్తులు ఖాయమన్నట్లే ఉంది. వచ్చే మార్చి నెలలో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు జరుగనున్నట్లు టిడిపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. చంద్రబాబుతో భేటీ తర్వాత టిజి మీడియాలో ప్రకటన చేశారంటే పొత్తులపై రెండు పార్టీల మధ్య నిర్ణయం అయిపోయినట్లే ఉంది. టిజి వెంకటేష్ అంటే చిన్నా చితకా నేత కాదు. సాక్ష్యాత్తు రాజ్యసభ సభ్యుడు. కాబట్టి అంతటి కీలక నేత చేసిన ప్రకటనతో పార్టీలో సంచలనం మొదలైంది. దానికి తగ్గట్లే టిడిపి నేతలు కూడా ఈమధ్య ఎక్కడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శలు, ఆరోపణలు చేయటం లేదు.

 

పార్టీ నేతలతో జరిగిన టెలికాన్పరెన్సులో చంద్రబాబు మాట్లాడుతూ పవన్ పై ఎటువంటి ప్రకటనలు  చేయవద్దని ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు చేసిన ప్రకటనతోనే రెండు పార్టీల మధ్య పొత్తులు ఉంటాయనే సంకేతాలు వచ్చేశాయి. దానికి తోడు తాజాగా టిజి చేసిన ప్రకటనతో పొత్తులు ఖాయమైనట్లే. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని పవన్ ఒకవైపు చెబుతున్నారు. అదే సమయంలో తమతో పొత్తులు పెట్టుకోవాలంటూ పవన్ ను చంద్రబాబు పదే పదే గోకుతున్నారు. దానికి తగ్గట్లే చంద్రబాబుపై పవన్ కూడా నెగిటివ్ గా ఏమీ మాట్లాడటం లేదు. అంటే ఇవన్నీ రెండు పార్టీల మధ్య పొత్తుకు సంకేతాలనే భావించాల్సుంటుంది.

 

ఈ నేపధ్యంలోనే టిజి పొత్తులపై ప్రకటన చేయటం గమనార్హం. ఎవరెన్ని సీట్లో పోటీ చేయాలనే విషయంలో మార్చి నెలలో రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతాయని కూడా చెప్పారు. అసలు తమ పార్టీల మధ్య వివాదాలు ఏమీ లేవని కూడా టిజి చెప్పటం గమనార్హం. ఉత్తర ప్రదేశ్ లో ఎస్పీ, బిఎస్పీలు కలిసి పోటీ చేయగా లేంది ఏపిలో తమ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే తప్పేంటని టిజి ఎదురు ప్రశ్నించటం విచిత్రంగా ఉంది. నిజానికి ఆ రెండు పార్టీలు కలవకూడదని ఎవరూ అనలేదు. చంద్రబాబుపై ఆరోపణలు చేసి పవనే దూరమైపోయారు. మళ్ళీ పవనే దగ్గరవుతున్నారు. అందుకనే కదా జగన్ కూడా వాళ్ళిద్దరికీ నాటకమని చెబుతున్నది ? అసలు తెలుగుదేశంపార్టీ, జనసేనలు కలిసి పోటీ చేయటమే జగన్ కు కావాల్సింది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: