ఏపీలో రాజకీయాలు ఎవరికీ అర్ధం కానంతగా ఉన్నాయి. పొత్తుల పేరుతో ప్రకటనలు ఓ వైపు వస్తూంటే సీన్ వేరేగా ఉంటోంది. అయితే ఎక్కడా క్లారిటీ మాత్రం రావడం లేదు. నిన్న కలసిన వారు ఇవాళ కత్తులు దూస్తున్నారు. నిన్న ఒక్కటి అంటున్న వారు ఇవాళ ఒంటరి అంటున్నారు. మరి దీని అర్ధం పరమార్ధం వారికే తెలియాలి.


పొత్తు ఉండదుట :


ఈ మాటలు అన్నది ఎవరో కాదు, కాంగ్రెస్ నేతలు, తెలంగాణాలో పొత్తులు పెట్టుకుని మరీ టీడీపీతో ఊరేగిన హస్తం పార్టీ నేతలు ఏపీలోనూ పొత్తులు ఉంటాయని ఎగబాకారు. బాబు తప్పు తెలుసుకుని తమతో కలసి వచ్చారని చెప్పుకున్నారు. గొప్పలు పోయారు. మరి ఇంతలో ఏమైందో ఏమో పొత్తులు లేవని తాపీగా కాంగ్రెస్ ఏపీ ఇంచార్జి ఉమన్ చాందీ  చావు కబురు చెప్పేశారు. నిజానికి ఈ పరిణామం వెనక మరోకటి జరిగింది. అదేంటంటే ఏపీ టీడీపీ అధినేత డిల్లీ వెళ్ళి మరీ రాహుల్ గాంధితో భేటీ అయ్యారు. అక్కడ ఇద్దరు నాయకులు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ తెల్లారేస‌రికి కాంగ్రెస్ నేతలకు జ్ణానోదయం కలిగింది. పొత్తులు లేవు మొత్తానికి మొత్తం పోటీ చేస్తామని చెప్పుకొచ్చారు. 


తెర వెనక బంధమేనా :


ఏపీలో పొత్తులు బయటకు లేవు అంటే లోపల ఉన్నాయని అర్ధం అంటున్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. కాంగ్రెస్, టీడీపీ రహస్యంగా పొత్తులు పెట్టుకున్నాయని, బయటకు పొత్తులంటే చీ కొడతారని ఇలా చేస్తున్నారని అసలు గుట్టు విప్పారు. ఒకరికి ఒకరు సహకరించుకుంటారని కూడా అయన సీక్రెట్ చెప్పారు. వీరందరి టార్గెట్ వైసీపీ అన్నది కూడా అయన చెప్పుకొచ్చారు. అంటే కలసి పోటీ చేసి మునిగిపోవడం కంటే విడిగా పోటీ చేస్తే ప్రభుత్వ ఓటు చీలుతుంది. అదే టైంలో కాంగ్రెస్ ఒంటరి పోరుతో వైసీపీ ఓటు కూడా చీలుతుంది అని మాస్టర్ ప్లాన్ వేశారన్న మాట. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.


పవన్ తో బెడిసిందా :


ఇక మరో పార్టీ పవన్ కళ్యాణ్ ది ఉంది ఆ పార్టీ తో పొత్తులు ఉంటాయని ఇలా ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారో లేదో అలా పవన్  టీజీ మీద ఫైర్ అయిపోయారు. అనరాని మాటలూ అన్నారు. ఇన్ని అన్న పవన్ పొత్తులు టీడీపీతో ఉండవని మాత్రం కుండ బద్దలు కొట్టి చెప్పలేదంటున్నారు. అంటే ఆ సస్పెన్స్ అలాగే ఉండిపోయింది. పొత్తులు వారితో మాకేంటి అన్న ఒక్క మాట అన్సేస్తే పోయేదానికి టీజీని తిడుతూ పవన్ ఏదేదో మాట్లాడారని అంటున్నారు. 
నిజానికి టీజీని అంటే ఏమొస్తుంది. టీడీపీ కి ఆయన అధినాయకుడు కాదు, జనం కూడా ఆయన గురించి అనుకోరు, వారికి కావాల్సింది కూదా పొత్తులు ఉంటాయా. ఉండవా అన్న క్లారిటీ, ఆ విషయంలో పవన్ ఏమీ చెప్పేలేదు. మరి అవేశంలో అసలు సంగతి మరచారో లేక అది కూడా వ్యూహమో తెలియదు కాదు టీజీ బలి అయిపోయారు. మొత్తానికి ఏపీలో పొత్తులు ఉండవని అంతా అంటున్నా ఇంకా జనంలోనూ, ఆయా పార్టీల క్యాడర్లోనూ కూడా అనుమానాలు తొలగిపోవడంలేదు. మరి క్లారిటీ ఎపుడు వస్తుంది. ఎలా వస్తుందో...


మరింత సమాచారం తెలుసుకోండి: