రాజ‌కీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు కామ‌న్‌. ఎవ‌రు ఎప్పుడు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లినా.. అంతిమంగా ప్ర‌త్య‌ర్థు ల‌ను మ‌ట్టిక‌రిపించ‌డ‌మే అస‌లు సిస‌లు వ్యూహం. తాజాగా ఏపీ కాంగ్రెస్ నేత‌లు కూడా ఇలాంటి వ్యూహాల‌కే తెర‌దీశారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఉన్న ప్ర‌ధాన శ‌త్రువు టీడీపీకాదు, వైసీపీ! అవును. కాంగ్రెస్ నేత‌ల‌ను, కాంగ్రెస్ ఓటు బ్యాంకును వైసీపీ అధినేత జ‌గ‌న్ లాగేసుకున్నార‌నేది ఆ నాయ‌కుల అక్క‌సు. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లో 67 స్థానాల‌ను జ‌గ‌న్ కైవసం చేసుకున్నాడ‌ని వీరి అభియోగం. అయితే, అదేస‌మయంలో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త కూడా వారికి అనుకూ లంగా మారుతుంది అనుకున్నారు. కానీ, తెలంగాణా ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్‌-టీడీపీపొత్తు పెట్టుకున్నాయి. 


కేంద్రంలోనూ పొత్తుతోనే మ‌హాకూట‌మిగా ఏర్ప‌డి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించాయి. ఈ క్ర‌మంలో ఇక‌, రాష్ట్రంలోని టీడీపీ ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డం మానేసి, కేవ‌లం జ‌గ‌న్‌పై నే ప‌డ్డారు. ఇక‌, రాష్ట్రంలో టీడీపీ-కాంగ్రెస్ క‌లిసి ప‌నిచేస్తాయా?  పొత్తు పెట్టుకుంటాయా అనే సందేహాలు, అనుమానాలు కూడా తెర‌మీదికి వ‌చ్చాయి. అయితే, ముందుగానే పొత్తు పెట్టుకుంటే.. రాజ‌కీయంగా ఎన్నిక‌ల ప‌రంగా కూడా న‌ష్టం వాటిల్లుతుంద‌ని తాజాగా నాయ కులు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. అంటే, టీడీపీతో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం ద్వారా జ‌గ‌న్ ఓటు బ్యాంకు ముఖ్యంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు త‌మ‌కుప‌డుతుంద‌న్న గ్యారెంటీ లేద‌ని నాయ‌కులు విశ్లేషించారు. 


దీంతో ఒంట‌రిగానే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ప్రాథ‌మికంగా నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఫ‌లితంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు స‌హా ఎన్నిక‌ల ముందు ఇత‌ర పార్టీల్లో టికెట్లు రాని అసంతృప్తులు సైతం త‌మ వ‌ద్ద‌కు వ‌స్తార‌ని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక‌, రాష్ట్ర ప్ర‌త్యేక హోదా విష‌యంపై కాంగ్రెస్ ఇప్ప‌టికే స్ప‌ష్ట‌త‌ను ఇచ్చింది. తాము అధికారంలోకి రాగానేదీనిపైనే తొలి సంతకం చేస్తామ‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఇదే విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లి ప్ర‌చారం చేయాల‌ని కూడా నాయ‌కులు నిర్ణ‌యించారు.

జ‌గ‌న్ ఎలాగూ ఇప్పుడు ప్ర‌త్యేక హోదాను ప‌క్క‌న పెట్టిన నేప‌థ్యంలో ఇది కూడా త‌మ‌కు అనుకూలంగా ఉంటుంద‌ని నాయ‌కులు భావిస్తున్నారు. అదే టీడీపీతో క‌లిసి వెళ్తే.. కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చ‌లేమ‌ని భావిస్తున్నారు. మొత్తానికి జ‌గ‌న్ కేంద్రంగా కాంగ్రెస్ చేసిన వ్యూహం ఏమేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: