ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సర్వేలు వరసగా వస్తున్నాయి. జనం మనసులో ఏమి ఉందన్నది తెలుసుకునేందుకు చేస్తున్న ఈ సర్వేలు అటు ప్రజలకు, ఇటు రాజకీయ పార్టీలకు కూడా నాడి ఏంటో చెప్పేస్తున్నాయి. జాతీయ స్థాయిలో సర్వేల ఫలితాలు  అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నప్పటికీ ఏపీలో మాత్రం గత కొంతకాలంగా సర్వేలన్నీ వైసీపీకే పట్టం కట్టడం విశేష పరిణామం.


ఫ్యాన్ కే ఓటు :


ఇదిలా ఉండగా, మరి కొద్ది నెలల్లో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక సీట్లలో వైసీపీ  ఘన విజయం సాధించనుందని ‘రిపబ్లిక్‌ టీవీ – సీ ఓటర్‌’ సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.  టీడీపీ కేవలం ఆరు  ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని ఈ సర్వే తేల్చింది. ‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరుతో జరిగిన ఈ సర్వే ఫలితాలను రిపబ్లిక్‌ టీవీ తాజాగా విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగానూ వైసీపీకి 19 ఎంపీ సీట్లు, టీడీపీకి కేవలం ఆరు సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఏపీలో ఒక్క స్థానంలో కూడా గెలవలేవని పేర్కొంది.  


భారీగా ఓట్ల తేడా :


ఓట్ల శాతం పరంగా చూసినా కూడా సర్వేలో వైసీపీదే పైచేయిగా ఉండడం విశేషం.  వైసీపీకి  41.3 శాతం ఓట్లు, టీడీపీకి 33.1 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లు సర్వే వెల్లడించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసినా ఏపీలో టీడీపీకి 15 ఎంపీ సీట్లు మాత్రమే లభించడం గమనార్హం. బీజేపీకి రెండు ఎంపీ సీట్లు రావడం తెలిసిందే. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో వైసీపీ  8 ఎంపీ సీట్లను సాధించింది. సీ ఓటర్‌ సంస్థ గతంలో వెల్లడించిన సర్వేలో కూడా వైఎస్సార్‌ సీపీ ఘన విజయం సాధిస్తుందని అంచనా వేసిన సంగతి తెలిసిందే.  మొత్తం మీద చూసుకుంటే ఈ సర్వేలన్నీ ఫ్యాన్ గాలి బాగానే వీస్తోందని గట్టిగానే చెబుతున్నాయి. మరి ఇది ఏపీలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి అద్దం పడుతోందనుకోవాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: