సినీ తార‌లు లేని ఏపీ రాజ‌కీయాలను ఊహించ‌లేం. అస‌లు ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని కూడా త‌లుచుకోలేం. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర పడుతున్న నేప‌థ్యంలో.. టాలీవుడ్ అడుగులు ఎటువైపు ఉంటాయ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇండస్ట్రీ ప‌రంగా ఏక‌తాటిపై ఉన్న హీరోలు, న‌టులు.. రాజ‌కీయ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే స‌రికి మాత్రం త‌మ‌కు న‌చ్చిన పార్టీల‌కు ప్ర‌త్య‌క్షంగానో, ప‌రోక్షంగానో మ‌ద్దతు తెలుపుతూనే ఉన్నారు. మెగా ఫ్యామిలీ, అక్కినేని, ఘ‌ట్ట‌మ‌నేని, నంద‌మూరి ఇలా ఇండ‌స్ట్రీలో పెద్ద కుటుంబాల‌న్నింటికీ రాజ‌కీయాల‌తో విడ‌దీయ‌రాని సంబంధం ఉంది. ఈ నేప‌థ్యంలో ఎవ‌రు.. ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇవ్వ‌బోతున్నార‌నే విష‌యంపై చ‌ర్చ మొద‌లైంది. 


రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన 2104 ఎన్నిక‌ల్లో పెద్ద‌గా స్టార్స్ హ‌డావుడి క‌నిపించ‌లేదు. ఆ స‌మ‌యంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. జ‌న‌సేన‌తో ప్ర‌జ‌ల ముందుకు రావ‌డం, టీడీపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో.. ఆయ‌నే స్టార్ అట్రాక్ష‌న్‌గా మారారు. ఇక టీడీపీ త‌ర‌ఫున నంద‌మూరి బాల‌కృష్ణ కూడా బ‌రిలోకి దిగారు. వైసీపీ నుంచి న‌టి రోజా.. మాత్ర‌మే ఉన్నారు. ఆ ఎన్నిక‌ల్లో పెద్ద‌గా స్టార్లు క‌నిపించ‌క‌పోవ‌డానికి కూడా కార‌ణం లేక‌పోలేదు. ఏపీ రెండు ముక్కలైన సందర్భంగా వచ్చిన ఎన్నికలు కాబట్టి గత ఎన్నికల్లో స్టార్స్ పెద్దగా పాల్గొనలేదు. రాష్ట్ర రాజకీయ ప‌రిస్థితులు ఎలా ఉంటాయనే విషయంపై ఓ అంచనాకు రాలేక ఏ పార్టీకీ త‌మ మ‌ద్ద‌తు తెల‌ప‌లేక‌పోయారు. అయితే ఈ ఐదేళ్లలో హీరోలకు కూడా ఓ క్లారిటీ వచ్చేసింది.కాబట్టి ఎవరు ఎటువైపు అనే ప్రశ్న తలెత్తుతోంది.


ఎన్నికలు వస్తే ముందుగా కనిపించేది మెగా కాంపౌండ్‌. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన నాటి నుంచి.. మెగా ఫ్యామిలీతో రాజ‌కీయాలు ముడిప‌డిపోయాయి. ఆయ‌న రాజ‌కీయాల‌కు దూర‌మైన స‌మ‌యంలో.. తమ్ముడు పవన్ జనసేన పార్టీ పెట్టారు. 2014లో టీడీపీకి మ‌ద్ద‌తు తెలిపిన ప‌వ‌న్‌.. ఈసారి ఒంట‌రిగానే బ‌రిలోకి దిగ‌బోతున్నారు. అయితే ఈసారి మెగా కాంపౌండ్ కు చెందిన సుమారు 11 మంది హీరోలు జనసేన వైపే ఉన్నారు. అయితే బన్నీ మాత్రం ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇక నందమూరి కుటుంబంలో ఇటీవ‌ల ప‌రిస్థితులు మారిన‌ట్లు క‌నిపిస్తున్నా.. లోలోప‌ల మాత్రం కొంత గ్యాప్ ఉంద‌ని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా సొంత అక్క త‌ర‌ఫునే ప్రచారం చేయకుండా దూరంగా ఉన్నాడు ఎన్టీఆర్. అలాంటిది ఏపీ ఏన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేస్తాడని భావించ‌లేం. 


టీడీపీ త‌ర‌ఫున నారారోహిత్, కల్యాణ్ రామ్, తారకరత్న ప్ర‌చారం చేసే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఇక అక్కినేని  కుటుంబం నుంచి గత ఎన్నికల్లోనే జగన్ తరఫున నాగార్జున రంగంలోకి దూకుతాడని అనుకున్నారు. కానీ అది జరగ లేదు. ఈసారి మాత్రం నాగార్జున ఏపీ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది. ఇక జగన్ కోరితే మరో హీరో సుమంత్ ఎప్పుడూ రెడీ. ఎందుకంటే వీళ్లిద్దరూ క్లాస్ మేట్స్ కదా. వీళ్లతో పాటు నాగ్ చెబితే నాగచైతన్య, సుశాంత్, సుమంత్, అఖిల్.. ఇలా కాంపౌండ్ మొత్తం జగన్ కోసం కదిలొస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ కూడా వైసీపీకి మద్దతుగానే ఉంది. వైఎస్సార్‌, కృష్ణ మధ్య మంచి స్నేహబంధం ఉండేది. అయితే కృష్ణ కుటుంబానికి చెందిన గల్లా జయదేవ్ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు క‌నుక‌ ఎప్పట్లానే ఈసారి కూడా మహేష్, గల్లాకే మద్దతివ్వాల్సిన ప‌రిస్థితి.


ఇక ఎప్పట్లానే రానా, వెంకీ రాజకీయాలకు దూరంగా ఉండనున్నారు. మిగతా హీరోల్లో నిఖిల్ వైసీపీకి మద్దతు తెలిపాడు. న‌టులు పోసాని కృష్ణమురళి, పృధ్వి వైసీపీ కోసం పనిచేస్తున్నారు. వీళ్లతో పాటు భానుచందర్, ఫిష్ వెంకట్, కృష్ణుడు, ఛోటా కె నాయుడు లాంటి వారంతా జగన్ కే మద్దతిస్తున్నారు. ఇక సినీనటి రోజా ఆల్రెడీ వైసీపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఈసారి మాత్రం చంద్ర‌బాబుకు కొంత సినీ గ్లామ‌ర్ త‌గ్గే ప‌రిస్థితి మాత్రం క‌నిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: