ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో.. ప్ర‌జా నాడిని తెలుసుకునేందుకు వివిధ సంస్థ‌లు స‌ర్వేలు నిర్వ‌హిస్తున్నాయి. వాటి ఫ‌లితాలు కూడా వరుస‌గా విడుద‌ల చేస్తున్నాయి. ఏఏ పార్టీలు విజ‌యం సాధించే అవ‌కాశాలు ఉన్నాయో చెబుతున్నాయి. అయితే ఈ ఫ‌లితాలనే న‌మ్ముకుని.. ధీమాతో ముందుకెళితే మొద‌టికే మోసం వ‌చ్చే ప్ర‌మాదం లేక‌పోలేదు. ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీలో ఆత్మ‌విశ్వాసం బ‌దులు ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ క‌నిపిస్తోంద‌నే చ‌ర్చ మొద‌ల‌వుతోంది. ఆయా రాష్ట్రాల్లో వివిధ సంస్థ‌లు నిర్వ‌హించిన స‌ర్వేలు వైసీపీకి కొంత పాజిటివ్ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోందంటూ ప్ర‌క‌టిస్తున్నాయి. అయితే వీటిపై రాజ‌కీయ విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ సర్వేల పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓవర్ గా రియాక్ట్ అయితే మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశాలున్నాయంటున్నారు విశ్లేష‌కులు. ముందు వ్యూహాల ప్ర‌కారం వెళ్ల‌కుంటే మునుగుడేన‌ని హెచ్చ‌రిస్తున్నారు. 


ఎన్నికల నోటిఫికేష‌న్ విడుద‌లైన నాటి నుంచి ఏపీలో అసలు కథ మొదలు కాబోతోంది. మరో ఆరువారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత నెలరోజుల పాటు తీవ్రమైన రాజ‌కీయ‌ పోరాటం ఉంటుంది. ఇప్ప‌టికే అభ్య‌ర్థుల ఎంపిక‌పై దృష్టిపెట్టిన టీడీపీ, వైసీపీ.. వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో విభేదాలను ప‌రిష్క‌రిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో స‌ర్వేలు జోరందుకున్నాయి. వైఎస్సార్ సీపీ 19 ఎంపీ సీట్లను నెగ్గే అవకాశం ఉందని రిపబ్లిక్ టీవీ సర్వే చెబుతోంది. అటు ఎన్డీయే వైపు, ఇటు యూపీఏ వైపు మొగ్గుచూపకుండా ఉండటం జగన్ కు మేలు చేస్తోందని.. ఎన్నికల అనంతరం.. ఇలాంటి వారి మద్దతు కీలకం అవుతుందని.. విశ్లేషిస్తోంది. అయితే వైసీపీ మాత్రం అన్ని ఎంపీ సీట్లలో తగిన  అభ్యర్థులను కూడా రెడీ చేసుకున్నట్టుగా కనిపించడం లేదు. అభ్యర్థుల ప్రకటన ఇంకా తెగడంలేదు.


వైసీపీకి అనుకూలత ఉన్న అనంతపురం, కర్నూలు వంటి ఎంపీ సీట్లలోనే అభ్యర్థుల  గురించి అధికారిక ప్రకటన జరగకపోవడం గమనించాల్సిన అంశం. నంద్యాల కూడా ఇదే తీరున ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థులతో పోలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థులు కొంత బ‌ల‌హీనంగా ఉన్నార‌నే టాక్ ముందునుంచీ వినిపిస్తోంది. దీనిపై జ‌గ‌న్ క‌స‌ర‌త్తు ప్రారంభించారు. అయితే ఇది ఇంకా చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉంది. ఇదే స‌మ‌యంలో టీడీపీ సిట్టింగ్ ఎంపీలు ఆర్థికంగా, రాజ‌కీయంగా కొంత బ‌లంగా క‌నిపిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో వేవ్ ఉంటే త‌ప్ప‌.. 19 సీట్లు గెల‌వ‌డం అసాధ్య‌మ‌ని విశ్లేషకులు వివ‌రిస్తున్నారు. సర్వేలు చెప్పాయి.. ఇక గెలిచేస్తున్నాం.. అనే భావన నుంచి ఎంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డితే అంత మంచిద‌ని హెచ్చ‌రిస్తున్నారు. గ‌తంలోనూ ఇలాంటి స‌ర్వేలనే న‌మ్ముకుని బోర్లా ప‌డింద‌ని గుర్తుచేస్తున్నారు. ఈ భావ‌న‌ను వీడి ముందుకెళితే సానుకూల ఫ‌లితాలు సాధించ‌వ‌చ్చ‌ని చెబుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: