గెలుపు ఒక మత్తు..అధికారం కైపు ఎక్కించేది. దాని కోసమే యుద్ధాలు జరిగాయి. చరిత్ర చెప్పే పాఠం అదే. ఎంత ప్రజాస్వామ్యం అని జబ్బలు చరచుకున్నా అంగబలం, అర్ధబలం ఉన్న వారిదే అసలైన రాజ్యం. ఈ పరిస్థితుల్లో కర్ర ఉన్నవాడిదే బర్రే అన్న సామెతను నేతశ్రీలు రుజువు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలవడానికి అడ్డదారులు తొక్కేస్తున్నారు. అందుకోసం పెరిగిన సాంకెతిక సంపత్తిని కూడా బాగా వాడేసుకుంటున్నారు.


ప్రతిపక్షమే టార్గెట్ :


గెలవాలి అంటే మనకైనా ఓటు పడాలి. లేక మనకు పడని ఓటు అయినా బ్యాలెట్ బాక్సులో  లేకుండా చేయాలి. ఈ కుట్ర విధానం ఇపుడు భారతదేశంలో బాగానే అమలవుతోంది. అధికారం దానికి అందివస్తోంది. దాంతో ఎక్కడ చూసిన ఇపుడు విపక్ష ఓట్లకు కన్నం పెట్టడం పెద్ద వ్యూహంగా మారిపోయింది. తెలంగాణాలో తీసుకుంటే అక్కడ లక్షల్లో ఓట్లు గల్లంతు అయ్యాయి. నిజానికి ఒక్క ఓటు తేడాతో కూడా గెలుస్తున్న రోజులివి అటువంటిది లక్షల్లో ఓట్లు లేకుండా పోతున్నాయంటే అది కచ్చితంగా విజయాన్ని ఎంతగానో  బ్రేకులు వేసే చర్యగానే చూడాలి. ఇపుడు ఏపీ వంతు వచ్చింది. ఇక్కడ కూడా ఓట్ల గల్లంతు చేయడానికి చేయాల్సినదంతా చేస్తున్నారు.


సర్వేల పేరుతో :


ఇక ఏపీలో  పలు చోట్ల బ్రుందాలు సర్వేల పేరుతో చాలా కాలంగా తిరుగుతున్నాయి. ఇందులో నిజంగా సర్వేలు చేసే వారు ఉన్నారు. ఇలా ఓ రాజకీయ పక్షం తరఫున పని చేస్తూ లోగుట్టు తెలుసుకుని ఆయా ఓట్లను గల్లంతు చేసే గ్యాంగులు కూడా  ఉన్నాయి. విజయనగరం జిల్లాలో జరిగింది అదే. ఇక్కడ కుమిలి గ్రామలో ఆ విధంగా సర్వే బ్రుందం పేరు చెప్పుకుని కొంతమంది    ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ పేరుతో ట్యాబులు పట్టుకుని మరీ రంగంలోకి దిగిపోయారు. వారి పోకడలపైన అనుమానం వచ్చిన విపక్ష వైసీపీ నాయకులు పట్టుకుని గద్దించడంతో దీని వెనక పెద్దలు చాలా మంది ఉన్నారని చెబుతున్నారు.


ఇది దారుణం :


అధికార పార్టీ తమ  ఓట్లను గల్లంతు చేయడానికి ఈ రకమైన కుట్ర చేస్తోందని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అంటున్నారు. సర్వేపై అనుమానం వచ్చి పట్టుకుంటే తమ నాయకులను పోలీస్ స్టేషన్లో వేయడం ఏంటని ఆయన ప్రశ్నిచారు. ఈ రకమైన  అరాచకపు విధానాలు ఖండిస్తున్నామని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. కాగా దీని మీద ఎన్నికల కమిషన్  కూడా ద్రుష్టి సారించాల్సి ఉంది. నిజంగా సర్వే చేసుకునేందుకు ఎవరికైనా హక్కు ఉన్నా జనం వద్దకు వచ్చి అసలు గుట్టు తెలుసుని ఓట్లకు కత్తెర వేయాలనుకునే వారి విషయంలో నియమ మిబంధలను కఠినంగా అమలు చేసి చర్యలు చేపట్టాల్సి ఉందని సూచిస్తున్నారు.
పల్లెల్లో అమాయక జనం తమకు రేషన్ కార్డులు కోసం, ఇతర పధకాలు పోతాయని ఎవరి వచ్చి ఏది అడిగినా చెప్పెస్తూంటారు. దాన్ని అలుసుగా తీసుకుని ఓట్ల కత్తెరకు పూనుకునే వారిపైన  కఠినంగా  ఉండాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఈ విషయంలో ప్రజలందరి ఓటు హక్కులను కాపాడకపోతే ఎపుడూ ఒకే పక్షం గెలిచేలా అధికారంలో ఉన్న వారు ఎటువంటి ఎత్తులకైనా దిగుతారు. తస్మాత్ జాగ్రత్త.



మరింత సమాచారం తెలుసుకోండి: