త్వరలో జరగబోతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయఢంకా మోగించబోతోందా.. జనం సీఎం చంద్రబాబును అధికారపీఠం నుంచి తప్పించి జగన్ కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారా.. సీఎం కావాలన్న తన చిరకాల వాంఛ త్వరలో జగన్‌కు తీరబోతోందా.. ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం ఇస్తున్నాయి సర్వేలు..



ఇప్పటివరకూ ఏపీ రాజకీయంగా జరిగిన ఏ సర్వే కూడా తెలుగు దేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పిన దాఖలాలు కనిపించడం లేదు. అదే సమయంలో పలు జాతీయ సర్వేలు వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుపు తథ్యం అని ఢంకా భజాయించాయిఈ సర్వేలన్నీ ఏపీలో మారుతున్న రాజకీయాన్ని ప్రతిబింబిస్తున్నాయా అని ఆలోచిస్తే.. సమాధానం స్పష్టంగా చెప్పలేకపోయినా.. మొగ్గు మాత్రం ప్రతిపక్ష వైసీపీ వైపే స్పష్టంగా కనిపిస్తోంది.



ఏపీ సీఎం స్వయంగా చేయించుకున్న సర్వేల్లోనూ ప్రతికూల ఫలితాలే కనిపించడం వల్లే చంద్రబాబు హఠాత్తుగా జనంపై వరాల వర్షం కురిపిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ పథకాలు కాపీ కొడుతున్నారన్న అపవాదు వచ్చినా సరే.. ప్రజలకు తాయిలాలు ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారుఅందుకే.. ఎన్ని హామీలు ఇచ్చినా సరే.. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు.



అందుకే ఫించన్లు డబుల్ చేయడం వంటి వరాలు కురిపిస్తున్నారు. తాజాగా డ్వాక్రా మహిళలపై ప్రేమ కురిపించి 10 వేల రూపాయల చెక్కులు అందజేస్తున్నారు. ప్రతి ఒక్క డ్వాక్రా మహిళకూ స్మార్ట్ ఫోన్ ఇస్తామంటూ స్మార్టుగా హామీలు గుప్పిస్తున్నారు. మరి ఇంతగా చంద్రబాబు టెన్షన్ పడుతున్నారంటే వైసీపీకే అధికారం దక్కే పరిస్థితి ఉన్నట్టేగా.


మరింత సమాచారం తెలుసుకోండి: