ఏపీలో రాజకీయం చాలా గందరగోళంలో పడుతోంది. నిన్నటి వరకూ కలసి ఉంటాయనుకున్న ప్రధాన పార్టీలు ఇపుడు విడిగానే అంటున్నాయి. ఇక కూటములు కడతారనుకున్న వారి దారులు కూడా వేరయ్యాయి. దీంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగానే ఏపీ రాజకీయం ఉంది. ఓ విధంగా చెపాలంటే లెక్కకు మించిన పార్టీలు రంగంలోకి దిగి బహుముఖ పోరుగా ఏపీ రాజకీయ క్షేత్రాన్ని మార్చేయనున్నాయనిపిస్తోంది.


బలమైన వేదిక:


ఇదిలా ఉండగా ఏపీలో చూసుకుంటే నిన్నటి వరకూ కేవలం తన సొంత సినిమా గ్లామర్, సామాజిక బలాన్ని మాత్రమే నమ్ముకున్న పవన్ కళ్యాణ్ జనసేనకు ఇపుడు అదనపు బలం తోడు అవుతోంది. సిధ్ధాంత  బలం దండీగా ఉన్న వామప‌క్షాలు జనసేనతో కలవడం ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపుగానే చెప్పాలి. విశాఖలో జరిగిన రౌండ్ టేబిల్ సమావేశంలో ఈ మేరకు పవన్ కళ్యాణ్, సీపీఐ, సీపీఎం పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. దీంతో ఏపీలొ కొత్త సమీకరణలకు రంగం సిధ్ధమవుతోంది. అలాగే ఇపుడున్న పార్టీలకు వ్యతిరేకంగా బలమైన వేదిక కూడా రంగంలోకి రానుంది. దీనికి సంబంధించి పూర్తి యాక్షన్ ప్లాన్ ఫిబ్రవరి నెలలో ఉంటుందని తెలుస్తోంది.


దూసుకు వస్తారా:


ఇంతవరకూ పవన్ బలం ఏంటన్నది ఏ సర్వే కూడా చెప్పకపోవడం విశేషం. ఏపీలో టీడీపీ, వైసీపీల పైన మాత్రమే సర్వేలు వస్తున్నాయి. అయితే చాప కింద నీరులా మరో వైపు జనసేన కూడా విస్తరిస్తోంది. ఇపుడు ఆ పార్టీకి కామ్రెడ్స్ తోడు కావడంతో బలం మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయి. వామపక్షాలకు క్షేత్ర స్థాయిలో పటిష్టమైన క్యాడర్ ఉంది. ఇక జనసేనకు గ్లామర్ ఉంది. ఈ రెండూ కలిస్తే గట్టి పోటీకి అవకాశం ఉంటుందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.


ఎవరికి చిల్లు :


ఆ విధంగా చూసుకున్నపుడు ఏ పార్టీకి జనసేన చిల్లు పెడుతుందన్న చర్చ ఇపుడు తెరపైకి వస్తోంది. నిన్నటి వరకూ టీడీపీకి మద్దతుగా ఉన్న పార్టీ కాబట్టి ఆ ఓట్లు చీలుతాయని వైసీపీ అంచనా వేస్తోంది. అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు చీలుతాయి కాబట్టి వైసీపీకే నష్టమని టీడీపీ అనుకుంటోంది. కానీ ప్రతీ ఎన్నికల్లో కొత్త ఓటర్లు, తటస్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వారితో పాటు గత ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల ఓటేసిన వారు కూడా వెనక్కిపోయి కొత్త ఆప్షనులు వెతికే చాన్సు కూడా ఉంది. ఆలాంటి ఓట్లకు ఇపుడు జనసెనా కామ్రెడ్స్ కూటమి మంచి అవకాశంగా ఉంటుందని అంటున్నారు. అదే జరిగితే రెండు ప్రధాన పార్టీల ఓట్లకు కూడా గండి పడే ప్రమాదం ఉందని కూడా చెబుతున్నారు.


హంగ్ తెస్తారా :


అటువంటి పరిస్థితే వస్తే ఏపీలో హంగ్ కచ్చితంగా వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. హంగ్ ఎపుడు వస్తుందంటే ప్రధాన పార్టీలు రెండింటి మీద పూర్తి అవిశ్వాసం కానీ, పూర్తి విశ్వాసం కానీ లేని సందర్భాల్లొనే. ఏపీలో చూసుకుంటే టీడీపీ, వైసీపీల విషయంలో జనం వైఖరి అలాగే ఉంది. దాంతో హంగ్ దిశగా ఏపీ అడుగులు వేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా అంటున్నరు.  అంటే అచ్చం కర్నాటకలో మాదిరిగా ఇక్కడ కూడా రెండు ప్రధాన పార్టీలకు మ్యాజిక్ నంబర్ రాకపోతే మాత్రం మూడవ కూటమిగా పవన్ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అద్రుష్టం కలసివస్తే కింగ్ అయ్యేందుకు వీలుంటుందని అంటున్నారు. దాంతోనే పవన్ కామ్రెడ్స్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. చూడాలి ఏం జరగనుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: